ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని టాలీవుడ్ లో అగ్ర దర్శకులు కూడా కలలుగన్నారు. కానీ ఇప్పుడు ఆయన అవకాశం ఇస్తే కూడా భయపడుతున్నారు. మహేష్ లాంటి హీరో ఆఫర్ ఇస్తే పండగ చేసుకోవాల్సింది పోయి టెన్షన్ పడుతున్నారు దర్శకులు. దానికి కారణం కూడా ఆయనే. ఒకప్పుడు మహేష్ బాబు మాట ఇస్తే ఖచ్చితంగా అది పూర్తయ్యే వరకు మరో సినిమా వైపు చూసేవాడు కాదు. కానీ ఇప్పటి మహేష్ బాబు వేరు. ఒక సినిమా చేస్తూనే మరో రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు సూపర్ స్టార్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సెట్ చేయడం మంచిదే కానీ వాటి మోజులో పడి ప్రస్తుతం కమిటైన దర్శకులను, సినిమాలను కూడా పక్కన పెడుతున్నాడు మహేష్. దాంతో దర్శకులకు ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధత వచ్చేస్తుంది.

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ కూడా ఇలా చేయడం వాళ్ళస్సలు తట్టుకోలేకపోతున్నారు. సినిమా చేస్తానని చెప్పి ఈ ఏడాది తన చుట్టూ తిప్పించుకున్న తర్వాత తీరా చివరికి కథ నచ్చలేదని చెప్పడం ఎంతవరకు సబబు అని వాళ్ళు అడుగుతున్నారు. మొన్నటి వరకు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పిన మహేష్ ఇప్పుడు సడన్ గా మనసు మార్చుకున్నాడు. మహర్షి సినిమా తర్వాత పూర్తిగా మహేష్ కుటుంబంతోనే ఉన్నాడు వంశీ పైడిపల్లి. అలాంటి ఆ దర్శకుడిని ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పక్కనపెట్టాడు సూపర్ స్టార్. దీనికి ముందు సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడికి కూడా అదిరిపోయే షాక్ ఇచ్చాడు మహేష్. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ సినిమా కాదనుకోవడం మహేష్ అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది. దాంతోపాటు అంతకుముందు మరో ఇద్దరు ముగ్గురు దర్శకులకు కూడా కథ ఓకే అయిన తర్వాత మహేష్ నో చెప్పాడు. దాంతో ఈయనతో సినిమా అంటే ఇప్పుడు దర్శకులు సర్దార్ పడుతున్నారు.