Home News Stories

ఢిల్లీలో మహాకూటమి లెక్కెంటీ….చంద్రబాబు మో ‘డీ’ నేనా…!

ఇప్పటి వరకూ రాజకీయ చరిత్రలో పుట్టుకొచ్చిన రాజకీయ కూటములకు, తాజా కూటమికి తేడా ఏంటి? ఢిల్లీ కేంద్రంగా సిద్ధమవుతున్న ఈ కొత్త రాజకీయ సమ్మేళనం.. దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? కూటమి కూర్పులో చంద్రబాబు నాయుడు ఎలాంటి నేర్పులు పాటిస్తున్నారు? ఈ కూటమి రాబోయే సార్వత్రిక సమరంలో ఎలాంటి ప్రభావం చూపబోతోంది?

దేశ రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్టి రాజకీయాలను చంద్రబాబు నాయుడు మలుపు తిప్పబోతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ తర్వాత.. కేంద్రంమీద పోరాటం ఒత్తిడి పెంచిన ఏపీ సీఎం చంద్రబాబు.. క్రమంగా దాన్ని పోరాటంగా మార్చేశారు. ఇందుకోసం ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడమే కాదు… ఏకంగా కేంద్రం మీద యుద్ధమే ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ ఏపీ వర్సెస్ కేంద్రంగా ఉన్న పోరును కాస్తా.. కమలనాథులు టీడీపీ వర్సెస్ బీజేపీగా మార్చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏకంగా మోడీనే ఢీకొట్టేందుకు అతి పెద్ద రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం దేశంలోని మోడీ వ్యతిరేక పార్టీలను ఏకం చెయ్యబోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి, బీజేపీయేతర, బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతల్ని కలుస్తున్నారు. వారికి కూటమి అవసరాన్ని చెప్పుకొస్తున్నారు. ఈ ప్రయత్నంతో బీజేపీయేరత పార్టీలన్నీ ఒక్కటవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.


ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ సీఎం కెజ్రీవాల్‌ను కలిశారు. ఫరూఖ్‌ అబ్దుల్లా, శరద్ పవార్ వంటి సీనియర్లను కలుపుకు పోతున్నారు. ఆర్జేడీ అధినేత కుమారుడు తేజస్వీ యాదవ్‌ను కలిశారు. సీపీఐ నేతలు సీతారాం ఏచూరీ వంటి వారితోనూ సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ను కూడా కూటమిలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. త్వరలో మమతా బెనర్జీని కూడా కలవబోతున్నారు. ఇలా పార్టీలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు.

2019 ఎన్నికలకు ఎక్కువ టైంలేదు. పైగా మరో నెల రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. ఇందులో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించేలా సాధ్యమైనంత వేగంగా కూటమి కూర్పు పూర్తి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఇప్పటి వరకూ ఎన్నో కూటములు తెరపైకి వచ్చాయి. కానీ అవన్నీ బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా కేవలం ప్రాంతీయ పార్టీలతో మాత్రమే వచ్చాయి. కానీ చరిత్రలో తొలిసారిగా.. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీను కూడా కలుపుకుని, ఒక అతిపెద్ద కూటమి ఏర్పడబోతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే… 2019 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ ఒక వర్గంగా, యాంటీ బీజేపీ పార్టీలన్నీ ఒక వర్గంగా తలపడనున్నాయన్నమాట.

ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా.. కూటమి నుంచి దూరంగా జరిగేందుకు లోలోపల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది టీడీపీ బయటకొచ్చేసింది. శివసేన కూడా ఏడాది కాలంగా అంటీ ముట్టనట్ల వ్యవహరిస్తోంది. ఇక ఏడాదిన్నర కిందట అనూహ్యంగా రాత్రికి రాత్రే ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన జేడీయూ కూడా.. తాజా పరిణామాల దృష్ట్యా గత కొన్నాళ్లుగా బీజేపీ మీద విమర్శలు గుప్పిస్తోంది. ఇక మిగిలిన పార్టీలు కూడా బయటకు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. మోడీ మీద పెరుగుతున్న వ్యతిరేకత తమకు కూడా శాపంగా^మారుతుందేమో అని భయపడుతున్నాయి. ప్రస్తుతానికి వాళ్లకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ పార్టీలతో సహా ఎన్డీయేలో ఉన్న పార్టీలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే యాంటీ బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున కూటమిగా చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్డీయే పార్టీలు కూడా వచ్చి చేరినా ఆశ్చర్యం లేదు. ఈ కూటమిలో భాగస్వాములయ్యే పార్టీలన్నింటి లక్ష్యం ఒక్కటే.. దేశాన్ని మోడీ నుంచి కాపాడటం.

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేలా ఈ కూటమిని సంసిద్ధం చేసే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. పార్టీలతోనూ సంప్రదింపులు జరపడం, కూటమిగా ఏర్పడాల్సిన అవసరాన్ని వివరించడం.. వంటి ప్రయత్నాలతో ఈ కూటమికి ఆయనే ఇరుసుగా వ్యవహరించబోతున్నారన్నమాట. 2109 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ని ఓడిండమే లక్ష్యంగా ఈ కూటమి ముందుకు కదలబోతోంది. ఈ క్రమంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఒక సమావేశం పెట్టుకుని భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించబోతున్నాయి. ఈ కొత్త ఫ్రంట్‌కి ఎవరూ నాయకత్వం వహించరు. అందరూ కలసి పనిచేస్తారని ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు.

మొత్తంగా దేశ ప్తంగా మోడీ మీద, బీజేపీ మీద పెల్లుబుతున్న ఆగ్రహాన్ని, వ్యతిరేకతను బేస్‌ చేసుకుని ఈ కూటమి రాబోయే ఎన్నికల్లో ప్రచారబరిలోకి దిగబోతోందన్నది విస్పష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here