Home News Politics

ఛీఛీ..సిగ్గుమాలిన రాజ‌కీయం!

బ‌ట్ట‌లిప్పేసి బ‌జార్న ప‌డ్డారు

ఈకాల‌పు రాజకీయ నాయ‌కుల‌కంటే తీసుకున్న డ‌బ్బుకి నిజాయితీగా శ‌రీరాన్ని అప్ప‌గించే వేశ్య‌లు గొప్పోళ్లేమో! వాళ్ల‌కు కొన్ని విలువ‌లు, ప‌ట్టింపుల‌న్నా ఉంటాయి. కానీ ఇప్పుడు రాజ‌కీయం సిగ్గూఎగ్గూ అన్నీ వ‌దిలేసింది. విలువ‌ల వ‌లువ‌లు విడిచేసి న‌గ్నంగా బ‌జార్న‌ప‌డుతోంది. దేన్ని రాజ‌కీయం చేయాలో, ఏ విష‌యంలో సంయ‌మ‌నం పాటించాలో, ఏ అంశాల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా ఒకే మాట‌మీదుండాలో..నేటి త‌రం నాయ‌కుల‌కు తెలీద‌నుకోవ‌డానికి వీల్లేదు. చేసేది ఎంత నీచ‌మ‌యినా పొలిటిక‌ల్ మైలేజ్ వ‌చ్చిందా లేదా అన్న‌దే వారికి ముఖ్య‌మైపోతోంది.

గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో బాలిక రేప్ సంఘ‌ట‌న‌లో రాజ‌కీయ ర‌చ్చ చూశాక నేత‌లంటేనే జ‌నం ఛీకొడుతున్నారు.
రాజ‌కీయాలు దిగ‌జారాయ‌ని తెలుసుగానీ.. దాచేప‌ల్లి ఘ‌ట‌న చూశాక ఇంత‌కంటే దిగ‌జ‌రాడానికి ఇంకేమీ మిగిలి లేద‌న్న విష‌యం అంద‌రికీ అర్ధ‌మైపోయింది. ఓ చిన్నారిపై అత్యాచారం జ‌ర‌గ‌డ‌మే దారుణాతిదారుణ‌మైతే..దాన్ని కూడా బ‌జారుకులాగి, ఆ కుటుంబాన్ని రోడ్డున నిల‌బెట్టి రాజ‌కీయం చేసేశాయి నీతిమాలిన పార్టీలు. హ‌త్య‌ల్ని, దాడుల్ని ఎలాగూ వాడుకుంటున్నారు. చివ‌రికి రేప్‌ల విష‌యంలోనూ ఇంత రాజ‌కీయ‌మా?

నేర‌స్తుడికి కులం, మ‌తం, ప్రాంతం, రంగు ఉండ‌వు. దాచేప‌ల్లి సంఘ‌ట‌న‌లో తొమ్మిదేళ్ల బాలిక‌ను చిదిమేసింది 55 ఏళ్ల వృద్ధుడు. వాడు ఏ కుల‌పోడ‌యితేనేం..గ‌తంలో ఏ పార్టీకి ఓటేస్తేనేం. నేరం చేశాడు..చివ‌రికి కుక్క‌చావు చ‌చ్చాడు. అయినా రేపిస్ట్ మీ పార్టీవాడంటే మీ పార్టీ వాడంటూ కాట్ల‌కుక్క‌ల్లా కొట్లాడుకున్నాయి పార్టీలు. ఓ చిన్నారిపై అత్యాచారంతో ఆ కుటుంబం త‌ల్లిడిల్లిపోతోంద‌నీ..చేత‌నైతే రెండు క‌న్నీటిబొట్లు రాల్చి..మేమున్నామ‌ని ధైర్యం చెప్పి వెళ్లిపోవాల‌నే సంస్కారం లేక‌పోయింది మ‌న నాయ‌కుల‌కు.

గ‌య్యిమ‌ని నోరేసుకుని మీద ప‌డిపోవ‌డ‌మే త‌ప్ప తనో ప్ర‌జాప్ర‌తినిధిన‌నీ..అంత‌కంటే ముఖ్యంగా ఓ మ‌హిళ‌న‌నీ అప్పుడ‌ప్పుడూ మ‌రిచిపోతోంది రోజా. రేప్ బాధిత బాలిక‌ని ప‌రామ‌ర్శించాక జ‌బ‌ర్ద‌స్త్ షో కోసం ఆమె చేసిన ప్ర‌య‌త్నం విమ‌ర్శ‌ల‌పాలైంది. ముఖ్య‌మంత్రే ద‌గ్గ‌రుండి ఈ కిరాత‌కాన్ని జ‌రిపించిన‌ట్లు మాట్లాడేస్థాయికి దిగ‌జారాలా? అత్యాచారాల వెనుక టీడీపీవాళ్లు ఉన్నార‌నేది ఆమె ఆరోప‌ణ‌. మేమూ నాలుగాకులు ఎక్కువే చ‌దివామ‌న్న‌ట్లు టీడీపీ కౌంట‌ర్లు. రేపిస్ట్ సుబ్బ‌య్య అతని కుటుంబ స‌భ్యులు వైసీపీకి చెందిన వారేనంటూ త‌మ ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలుగా ఎప్పుడో ఎక్క‌డో క‌ట్టిన ఫ్లెక్సీల్ని చూపిస్తోంది ప‌చ్చ‌గ్యాంగ్‌.

ఆ రేపిస్ట్ అయినా భ‌యంతోనో..లోప‌ల ఏదోమూల కాస్త ప‌శ్చాత్తాప భావ‌న‌తోనే ఉరేసుకుని త‌న‌కు తాను మ‌ర‌ణ‌శిక్ష విధించుకున్నాడు. కానీ రాజ‌కీయ‌పార్టీలు చేసిందేంటి? మ‌రేమీ స‌మ‌స్య‌లే లేన‌ట్లు, ఇలాంటి అవ‌కాశం మ‌ళ్లీ మ‌ళ్లీ దొర‌క‌ద‌న్న‌ట్లు బ‌ట్టలిప్పి బ‌జార్న‌ప‌డ్డారు. బాధిత కుటుంబాన్ని ప‌దిమందిలో పెట్ట‌కూడ‌ద‌ని, ఇది తెగేదాకా లాగాల్సిన విష‌యం కాద‌న్న విచ‌క్ష‌ణ మ‌రిచారు. జ‌నం మొహాల‌మీద కాండ్రించి ఉమ్మితేగానీ ఈ నాయ‌కులు మార‌రేమో!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here