Home News Politics

డబుల్ హ్యాట్రిక్ కి కాలం కలిసోస్తుందా…?

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం పాలమూరులోనే ప్రత్యేకం, డబుల్ హ్యాట్రిక్ కోసం జూపల్లి పక్క ప్లాన్ తో వెళ్తుంటే కాంగ్రెస్ నుంచి అభ్యర్ధి ఎవరన్నది ఇప్పటికి సస్పెన్సే. కొల్లాపూర్ కాంగ్రెస్ సీటు పాత నేతలకే దక్కుతుందా కొత్త వారు వచ్చి ఎగరేసుకుపోతారా అన్నది మరో సందేహం. హస్తం పార్టీలో టిక్కెట్ లొల్లి తమ పార్టికి ప్లస్సే అని గులాబీ పార్టీ భావిస్తుంటే…కొల్లాపూర్ రాజకీయం ఈ సారి వేరేగా ఉంటుందన్నది మరికొందరి అంచనా…

పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ లో రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్ దే విజయం. మూడుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్ధులు గెలిస్తే ఒకసారి టీడీపీ, రెండుసార్లు టీఆర్ఎస్ కొల్లాపూర్ లో జెండా పాతాయి. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే టిక్కెట్ దక్కక స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగారు. కొల్లాపూర్ నుంచి మూడుసార్లు వరుసగా కొత్తా వెంకటేశ్వరావు గెలిస్తే ఓటమి ఎరగకుండా ఐదుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు. మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి తర్వాత 2004లో టీఆర్ఎస్ పొత్తులో టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగి విజయం సాధించారు. 2012లో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీకి,మంత్రిపదవికి రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరి ఉపఎన్నికల్లో నాలుగోసారి గెలిచారు. 2014లోనూ ఐదోసారి ఎమ్మెల్యే అయిన జూపల్లి వచ్చే ఎన్నికల్లోను గెలుస్తానన్న నమ్మకంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇంకా ప్రధాన ప్రతిపక్షం అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో జనంలో జూపల్లి మాత్రమే కనిపిస్తున్నారు. కొల్లాపూర్ లో టిక్కెట్ ఆశవహులు ఎక్కువగా ఉండటం కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇటివల పార్టీలో చేరిన సీఆర్ జగదీశ్వరావు పోటాపోటీగా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ బాగోగులు చూస్తున్న తనకే టిక్కెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు హర్షవర్ధన్ రెడ్డి. ఇటివల నాగం జనార్ధన్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన జగదీశ్వర్ రావు కూడా టిక్కెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచార యాత్ర,బహిరంగ సభల్లో నేతలిద్దరు బల ప్రదర్శన చేశారు.

ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కలిసి పని చేస్తే విజయం తమదే అంటుంది కాంగ్రెస్. కానీ అలాంటి పరిస్థితి ఉందా అని పార్టీ శ్రేణులే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేవైఎఫ్ ఫౌండర్, రెడ్ కో మాజీ ఎండీ సుదాకర్ రావు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతుండటం కోల్లాపూర్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. కాంగ్రెస్ టీక్కెట్ పై కన్నేసిన సుదాకర్ రావు ఉద్యోగాన్ని వదిలేసి సేవ కార్యక్రమాలతో జనంలోకి వెళ్తూ హస్తం పార్టీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి అవకాశం దక్కకపోతే బీజేపీ టిక్కెట్ తోనైనా పోటీ చేయాలనే ఆలోచనలో సుధాకర్ రావు ఉన్నారు. ప్రస్థుత సమీకరణాలు తనకు అనుకూలిస్తాయని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు సుధాకర్ రావు.

వాతావరణం చూస్తుంటే ఈసారి కొల్లాపూర్ లో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆరోసారి గెలిచి రాష్ట్రంలోనే తొలి డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించాలనుకుంటున్నారు జూపల్లి. తెలంగాణ పోరాటంలో తన పాత్ర, కొత్తరాష్ట్రంలో తాను మంత్రిగా చేసిన అభివృద్ది,ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు జూపల్లి. సోమశిల సిద్దేశ్వరం వంతెన, శ్రీశైలం ముంపు భాదితుల జీవో,ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెస్తానంటూ చేసిన హామీలు ఏమయ్యాయంటు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధి ఎవరనేది తేలి కలిసికట్టుగా ముందుకు సాగితే ఒకలా ఎవరికి వారే అయితే ఒకలా నియోజకవర్గంలో రాజకీయపరిస్థుతులుంటాయని పొలిటికల్ పండితుల అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here