ఈసీతో ఏపీ సర్కారు వివాదం ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి ఇంకెంత తీవ్రంగా ఉండబోతోందో? ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై కారాలు మిరియాలు నూరుతున్నారు టీడీపీ నేతలు. చీఫ్ సెక్రటరీ సమీక్షలు నిర్వహిస్తుండటం, ప్రభుత్వ పాత నిర్ణయాల్ని తిరగదోడుతుండటంపై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కన్నెర్ర చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనిది..ఒక్క ఏపీలోనే ఎందుకిన్ని ఆంక్షలన్న ప్రశ్నలకు ఈసీనుంచి జవాబు లేదు. మిగిలిన రాష్ట్రాలతో తనకు సంబంధంలేదని, తానయితే రూల్స్ ప్రకారమే పోతున్నాననేది రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెబుతున్న వివరణ. చంద్రబాబు వ్యక్తిగతంగా కలుసుకుని వేలూపి వార్నింగిచ్చి వెళ్లాక ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది సీఈవో పరిస్థితి.
ఎన్నికల ముందు చీఫ్ సెక్రటరీని తప్పించి, ఆ స్థానంలో ఒకప్పుడు జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని తీసుకురావడాన్ని టీడీపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. సీఎస్‌ని నేరుగా టార్గెట్ చేశారు చంద్రబాబు. సీఎస్‌పై సీఎం కామెంట్స్‌ని తప్పుపడుతూ ఐఏఎస్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యేదాకా వెళ్లింది వివాదం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తగిన నిధుల్లేక చెల్లకుండా పోతున్నాయి. టీటీడీ నగల తరలింపు నుంచి మొదలుకుని, ఎన్నికల ముందు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలదాకా దేన్నీ వదలడం లేదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. దీంతో సీఎస్‌ని సీరియస్‌గా టార్గెట్ చేస్తున్నారు టీడీపీ సీనియర్లు. దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని వాతావరణం ఇది.
మండువేసవిలో తుపానుహెచ్చరికలు వస్తున్నాయి. ఏపీలో తీరప్రాంతంపై తీవ్ర ప్రభావం ఉండొచ్చనే అంచనాలున్నాయి. తుఫాన్లను ఒంటిచేత్తో ఎదుర్కున్నానని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి కాళ్లూ చేతులు కట్టేసినట్లు ఉంది. ఏమాత్రం అవకాశం దొరికినా ఈపాటికి ఆయన సమీక్షలు, టెలి కాన్ఫరెన్స్‌లతో తాను నిద్రపోయేవారు కాదు. ఎవరినీ నిద్రపోనిచ్చేవారు కాదు. అందుకే యనమల రామకృష్ణుడులాంటి రూల్బుక్కులు తిరగేసిన సీనియర్ లీడర్ కూడా సీఎస్ మీద ఒంటికాలిపై లేస్తున్నారు. తుపాను ముంచుకొస్తే.. సీఎస్, ఈసీ, మోడీల్లో ఎవరు బాధ్యత తీసుకుంటారనేది ఆర్థికమంత్రి ప్రశ్న. ప్రభుత్వం లేకుండా పాలన జరుగుతుందని ఏ రాజ్యాంగంలో చెప్పారో చూపించాలని నిలదీస్తున్నారు యనమల.
మరీ సినీనటుడు శివాజీ చెప్పిన రేంజ్లో మహా కుట్రలు జరిగినట్లు చెప్పలేకపోయినా…చంద్రబాబుని మోడీ అండ్ కో అష్టదిగ్బంధనం చేసిందన్న మాటయితే వాస్తవం. మోడీని వ్యతిరేకించినవారు, ఆయనపై తీవ్ర్ విమర్శలుచేసిన వారు చాలామంది ఉన్నా….కేంద్రంలోని బీజేపీ అగ్రనేతల ప్రధాన టార్గెట్ చంద్రబాబే అయ్యారు. బీజేపీతో తెగదెంపుల తర్వాత చంద్రబాబు చేసిన రచ్చతో…కోడ్‌ని అడ్డంపెట్టుకుని ఓచూపు చూస్తున్నారు. ఓ నెలరోజులు మనవి కాదని రెస్ట్ తీసుకుంటే జనం ఎవరి వైపున్నారో మే 23న తేలిపోతుంది. ఈలోపు తన నిరంతర పర్యవేక్షణ లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు టెన్షన్ పడటం కొందరికి ఓవరాక్షన్లాగే కనిపిస్తోంది.