Home News Stories

కరోనా కొత్త సవాళ్లు!


మూడ్నెల్లు ఉంటుందనుకున్నారు. ఆరునెలల తర్వాత ఆందోళన పడాల్సిన అవసరం ఉండదనుకున్నారు. అయితే ఎనిమిదినెలలు గడిచినా మహమ్మారి కరోనా భయపెడుతూనే ఉంది. సెకండ్‌ వేవ్‌ ప్రభావం దేశ రాజధానీ నగరాన్ని వణికిస్తోంది. అన్యాపదేశంగా అప్పుడెప్పుడో ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి సహా కొందరన్న మాటే నిజమవుతోంది. నెలలు కాదు…కొన్నేళ్లపాటు కరోనాతో సహజీవనం చేయాల్సి వచ్చేలా లేదు. పైగా.. కొత్త కొత్త లక్షణాలతో ఇంకా బలం పుంజుకుంటోంది ఖతర్నాక్‌ కరోనా వైరస్‌.

జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, రుచిని గుర్తించలేకపోవడం, వాసనను గ్రహించలేకపోవడం వంటివి కరోనా వైరస్‌ బారినపడ్డ వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఇప్పుడు కరోనా బాధితుల్లో మరింత ప్రమాదకర లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాల జాబితాలో కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. కరోనా పీడితుల్లో న్యూరాలజీ సమస్యలు తలెత్తున్నాయని గుర్తించారు అధికారులు. వైరస్‌తో ఆసుపత్రిలో చేరిన వారిలో దాదాపు ఐదుశాతం మందిలో న్యూరాలజీ సంబంధిత సమస్యలున్నట్లు చెబుతున్నారు. కరోనా పాజిటివ్ లలో కొందరిమీద మెదడువాపు, పక్షవాతం వంటి జబ్బులు ఎటాక్‌ చేస్తున్నాయి. ఎక్కువ మంది బాధితులను తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటి సమస్యలు పీడిస్తున్నాయి. కరోనా నెగిటివ్‌ వచ్చాక గండం గడిచిందని ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకొని ఇంటికెళ్లాక కూడా కొత్త అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం బాధితులను తీవ్రంగా ఆందోళనపరుస్తోంది.

ప్రధానంగా కరోనా వైరస్‌ లంగ్స్‌ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఊపిరితిత్తులను వైరస్ నిర్వీర్యం చేస్తోంది. కొందరిలో మెదడు, నాడీ వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్‌ బారినపడి చికిత్స తీసుకున్న వారిలో సుమారు 5 శాతం మంది బాధితులు ఏదో ఒక న్యూరాలజీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు వైద్యనిపుణులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే కొందరిలో మెదడువాపు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బులబారిన పడుతున్నారు. వైరస్‌ తీవ్రతను బట్టి ఆర్గాన్స్‌ మీద ప్రభావం పడుతోంది. వయసుమీరిన వారు, ఇదివరకే కొన్ని అనారోగ్యాలు ఉన్నవారి ఆరోగ్యపరిస్థితి మరింత దెబ్బతింటోంది. కొవిడ్‌ ట్రీట్మెంట్‌ తీసుకునేవారికి మెదడువాపు రావడానికి కారణాలను వైద్యులు విశ్లేషిస్తున్నారు. కేవలం మెదడుపై వైరస్‌ ఇన్‌ఫెక్షనే కాదు… ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థపై కరోనా చూపించిన దుష్ప్రభావం కూడా కొత్త సమస్యలకు కారణం కావచ్చనే అంచనాకొస్తున్నారు. కరోనా వైరస్‌ తో కిడ్నీలు బలహీనపడినా మెదడువాపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. మెదడు రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఏర్పడే ఆటంకంతో కొందరు వైరస్‌ పీడితులు పెరాలసిస్‌ బారిన పడుతున్నారు. అయితే కొవిడ్‌ బాధితుల్లో పక్షవాతం బారినపడినవారు ఒక శాతం మందిమాత్రమే ఉండటం కొంతలో కొంత ఊరటకలిగించే విషయం.

మెదడులో ఇన్‌ఫెక్షన్‌ వల్ల, లేదంటే రక్తంలో ఆక్సిజన్‌ హెచ్చుతగ్గులతో మరో 5 నుంచి 10 శాతం మంది వైరస్‌ బాధితులను తలనొప్పి వెంటాడుతుంది. ఎక్కువమందిలో దాదాపు పదిరోజులపాటు ఈ తల్నొప్పి సమస్య కనిపిస్తోంది. కొందరినయితే నాలుగైదు వారాలు తలనొప్పి సమస్య వేధిస్తోంది. ఉన్నట్టుండి నీరసించిపోవడం, పొంతన లేని మాటలతో అసంబద్ధంగా మాట్లాడడం, అసహనం, కాలు, చేయి బలహీనపడడం, అపస్మారక స్థితికి చేరుకోవడం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 90-94 కంటే తగ్గడంవంటి లక్షణాలు ప్రమాదకరమంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటివారు వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందాలి. చికిత్స సమయంలోనే కాదు.. ఇంటికెళ్లాక కూడా ఈ తరహా సమస్యలు ఉంటాయి. సాధారణ సమస్యలైతే కొన్నాళ్లకే కుదురుకోవచ్చు. అయితే లక్షణాలు తీవ్రమైతే ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా…వెంటనే చికిత్స చేయించుకోవాలి. అన్‌ లాక్‌ మొదలయ్యాక మన చుట్టూ వైఫైలా వైరస్‌ ఉందనే విషయాన్నే మరిచిపోతున్నాం. మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించుకుండా మళ్లీ రద్దీలో తిరుగుతున్నాం. సెకండ్‌ వేవ్‌ ప్రభావం మొదలుకావడమే కాదు, కొత్త లక్షణాలతో కరోనా మరింత బలం పుంజుకుంటున్న ఈ సమయంలో…ఏమాత్రం ఆదమరిచినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. బీకేర్‌ ఫుల్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here