Home News Updates

టీఆర్ఎస్ ని వీడని ఆవిర్భావ కష్టాలు..రెండో సారి మింగేసిన కరోనా

గత ఏడాదితోపాటు..ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక వేడుకలు లేవు. అధికారంలో ఉన్న పార్టీ ఆవిర్భావం దినోత్సవం అంటే కేడర్‌ ఓ రేంజ్‌లో ఊహించుకుంటుంది. కానీ ప్రతికూల వాతావరణం ఉండటంతో చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. ఉద్యమ పార్టీ అధికారమనే లక్ష్యాన్ని చేరుకున్నా..రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నా ఆవిర్భావ కష్టాలు మాత్రం వీడటం లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆ తర్వాత తెలంగాణలో భారీ సభలకు టీఆర్‌ఎస్‌కు పెట్టింది పేరు. తక్కువ సమయంలోనే జనాల్లోకి చొచ్చుకెళ్లిన పార్టీ. క్షేత్రస్థాయి నుంచి బలమైన కేడర్‌ ఉంది. ఉద్యమ సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులు.. పరిణామాలకు అనుగుణంగా పెద్దఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించేది టీఆర్‌ఎస్‌. ఆ సమయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు పూర్తి పండగ వాతావరణంలో జరిగేవి. 2014లో అధికారంలోకి వచ్చాక అలాంటి పరిస్థితి లేదన్నటి కేడర్‌లో వినిపించే మాట. భారీ సభలకు..సవాళ్లకు పెట్టింది పేరైన టీఆర్ఎస్ కొన్నాళ్లుగా ఆవిర్భావ కష్టాలు ఎదుర్కొంటుంది.

2018లో రావిరాలలో సభ నిర్వహించారు. కానీ దానిని ఎన్నికల సభగా మార్చేశారు. 2016లో ప్రతినిధుల సభగా కొంపల్లెలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. 2015లో భారీ వర్షాలు ఆటంకం కలిగించాయి. ఇలా అధికారంలోకి వచ్చాక ఏదో ఒక రూపంలో ప్రతిబంధకం ఎదురవుతూనే ఉంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించలేని పరిస్థితి. పార్టీ ఆవిర్భావ వేడుకలంటే పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి.. కొత్త పరిచయాలు పెంచుకోవడానికి ఆవిర్భావ వేడుకలు ఒక ప్లాట్‌ఫారంగా నిలుస్తాయి. కేడర్‌ అంతా ఒక్క చోట చేరి కొత్త జోష్‌ కనిపిస్తుంది.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగానే పనిచేస్తున్నా.. మునుపటిలా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరపకపోవడం లోటు లోటేనని అభిప్రాయపడుతోంది గులాబీ దళం. వరసగా రెండేళ్లు కరోనా మింగేసింది. అందుకే ఆవిర్భావ కష్టాలు వచ్చే ఏడాదైనా తొలుగుతాయని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి పార్టీ శ్రేణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here