Home Sports

క్రికెటర్లను వణికిస్తున్న కరోనా భయం..ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్న ఆటగాళ్లు..!

భారత్‌ కరోనా గుప్పిట విలవిల్లాడుతోంది. రోజుకు మూడున్నర లక్షల కేసులు దాదాపు మూడువేల మరణాలు, కిక్కిరిసిన ఆస్పత్రులు…రాత్రి కర్ఫ్యూలు ఈ పరిణామాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి క్రికెటర్లూ అతీతం కాదు. ఐపీఎల్‌ టోర్నీ జరుగుతున్న సమయంలో ఏర్పడిన విపత్కర పరిస్థితి చివరికి టోర్నీపై ప్రభావం చూపుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ పరోక్షంగా కరోనా బారిన పడుతోంది..ప్రత్యేకించి- విదేశీ ఆటగాళ్లు, కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరొక్కరుగా జట్లను వీడుతున్నారు. స్వదేశానికి తిరుగుముఖం పడతున్నారు. ఇదివరకు ఆండ్రూ టై, ఆ తరువాత స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌దీ అదే పరిస్థితి. అడమ్ జంపా ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. బెంగళూరు 5 మ్యాచ్‌లు ఆడినా జంపా బెంచ్ పైనే ఉన్నాడు. కేన్ రిచర్డ్‌సన్ కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే ఆడాడు.

ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తన కుటుంబం కరోనాతో పోరాడుతోందని, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఐపీఎల్ కు విరామం ప్రకటించాడు. పరిస్థితులు కుదుటపడితే తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు. మరికొందరు భారత క్రికెటర్లు సైతం అశ్విన్‌ బాటపట్టనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ తర్వాత, రవిచంద్రన్ అశ్విన్ వెళ్లి పోయాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై జట్టును వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. వీరంతా వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ఆడలేకపోతున్నామని చెప్పి వెనక్కు మళ్లారు..


ఇక ఆస్ట్రేలియాకే చెందిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా స్వదేశానికి తిరుగుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకోనే అవకాశాలు ఉన్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం.. భారత్‌ నుంచి వచ్చే వారిపై నిషేధం విధించే అవకాశాలున్నాయి.

ఇప్పటివరకు వివిధ కారణాలతో 11 మంది క్రికెటర్లు టోర్నీనుంచి వైదొలిగారు. వీరిలో జంపా, అండ్రూ టై, రిచర్డ్‌సన్‌, అశ్విన్‌, స్టోక్స్‌, ఆర్చర్‌, హాజెల్‌వుడ్‌, ఫిలిప్‌, లివింగ్‌స్టోన్‌, మార్క్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్‌ ఉన్నారు.ముఖ్యంగా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు స్వదేశానికి క్యూ కట్టారు. ప్రస్తుతం భారత్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్లాలని చూస్తున్నారట. ఇప్పటికే చాలామంది ఆసీస్ ఆటగాళ్లు స్వదేశానికి పయనం కాగా.. సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియా సరిహద్దులు మూసివేయడానికి ముందే దాదాపు 30 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇండియా నుంచి విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. పలు రాష్ట్రాలు ఇండియానుండి వచ్చే విమానాలపై బ్యాన్‌ విధించాలని కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డేవిడ్ వార్నర్ వెళ్లిపోతే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది హైదరాబాద్. పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో ఉంది. ఈ సమయంలో వార్నర్ జట్టుకు ఎంతో కీలకం.. వార్నర్ వెళ్లిపోతే హైదరాబాద్ జట్టును ఆదుకునే బాధ్యత కేన్ విలియమ్‌సన్‌ పై పడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here