Home Health corona

టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా కరోనా సేవా కార్యక్రమాలు..ఆ ఉపఎన్నిక కోసమేనా ?

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఒక్కసారిగా సేవా కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టారు. పోటాపోటీగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆదిలాబాద్ లో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఏ కార్యక్రమం చేపట్టినా పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్‌ను సైతం రాజకీయంగా వాడేసుకుంటున్నారు. రకరకాల సేవా కార్యక్రమాలతో రెచ్చిపోతున్నారు. అయితే ఈ హడావిడి వెనుక ఉపఎన్నిక పోలింగ్ ఉందని తెలిసి అవాక్కవుతున్నారు స్థానికులు.

ఆదిలాబాద్‌లో రాజకీయం సెగలు కక్కుతోంది. సోయం బాపూరావ్‌ బీజేపీ ఎంపీ కావడం.. జోగు రామన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కావడంతో లోకల్‌ పాలిటిక్స్‌ ఉప్పు నిప్పుగా మారిపోయాయి. ఇప్పుడు కోవిడ్‌ను సైతం రాజకీయంగా వాడేసుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక మూడు నెలల వరకు రక్తదానం చేయడానికి వీలుపడదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈలోగానే రక్తదానం చేయడానికి. రక్తదానం చేసేలా ప్రోత్సహించడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. కార్యక్రమం మంచిదే అయినా.. రక్తదాన శిబిరాల నిర్వహణ వెనక ఉన్న కథే ఆసక్తిగా ఉందట.

రక్తదానం చేయాలని ఓ పార్టీ నాయకులు వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియో చూసిన ప్రత్యర్థి పార్టీ నాయకులు అలర్ట్‌ అయ్యారు. తెల్లారే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు పత్రికల్లో ప్రకటన ఇచ్చేశారు. తొలుత పిలుపు ఇచ్చిన వారికంటే ముందే ప్రత్యర్థులు హడావిడి చేయడం ఆదిలాబాద్‌లో రాజకీయాన్ని వేడెక్కించింది. రెండు పార్టీల శిబిరాల్లో ఉత్సాహంగానే జనం వచ్చి రక్తదానం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీఆర్‌ఎస్‌ వారి కంటే తామే ఎక్కువ యూనిట్ల రక్తాన్ని సేకరించామని బీజేపీ వాళ్లు ప్రచారం మొదలుపెట్టారట. ఇంకేముందీ సోషల్‌ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య లొల్లి షురు అయ్యింది.

టీఆర్‌ఎస్‌, బీజేపీలు చేసింది మంచి కార్యక్రమమే అయినా.. దాని వెనక త్వరలో జరగబోయే ఆదిలాబాద్‌ జడ్పీటీసీ ఉపఎన్నిక ఉందట. ఆ ఎన్నికలో ప్రచారం పొందడం.. ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చేందుకే రెండు పార్టీలు రక్తదాన శిబిరాలు నిర్వహించాయని తెలుసుకుని అంతా అవాక్కయ్యారట. గెలుపే లక్ష్యంగా అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్‌ రూరల్‌ జడ్పీటీసీ ఉపఎన్నికలో ఏ పార్టీకి ఇది ప్లస్‌ అవుతుందో కానీ.. ఓ ప్రయత్నం అయితే చేశారు నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here