టాలీవుడ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పోయినేడాది మిగిల్చిన నష్టాలని మర్చిపోతూ, కొత్త దారులు వెతుక్కుంటోంది. ఎలాగోలా సెట్ అవుతోంది అనుకుంటోన్న టైమ్‌లో మళ్లీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. థియేటర్ బిజినెస్‌ని దెబ్బకొడుతోంది. సినిమా ఇండస్ట్రీలో పోయినేడాది మొత్తం కరోనాలో కలిసిపోయింది. షూటింగులు ఆగిపోయి, థియేటర్ల షట్‌డౌన్‌తో సినిమా రిలీజుల్లేక వందలకోట్ల నష్టం వచ్చింది.

ట్వంటీ ట్వంటీ పోయినా, ట్వంటీ ట్వంటీ వన్ అయినా కలిసొస్తుంది అనుకుంటే మళ్లీ కరోనా టెన్షన్ మొదలైంది. సినిమా రిలీజులని ఆపేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఇండస్ట్రీకి మళ్లీ ఊపు వచ్చింది. ‘క్రాక్’ నుంచి ‘వకీల్‌సాబ్’ వరకు వచ్చిన హిట్స్‌తో థియేటర్లు పండగ చేసుకున్నాయి. ‘ఉప్పెన, జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమాలు కూడా భారీగా వసూల్ చెయ్యడంతో స్టార్ హీరోలు కూడా బరిలో దిగడానికి ఉత్సాహం చూపించారు. రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు.
ఈ సమ్మర్లో భారీగా వసూళ్లు సాధించాలని చిరంజీవి, వెంకటేశ్, నాని లాంటి హీరోలు భారీ స్కెచ్చులేసుకున్నారు. టీజర్లు, సాంగ్స్ రిలీజ్ చేశారు. నాని అయితే పరిచయ వేదిక అని ‘టక్ జగదీష్’ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. ఏప్రిల్ 23న సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుగుతోన్న కరోనా కేసులతో ఈ సినిమాని వాయిదా వేసుకున్నాడు నాని.
కరోనా లాక్డౌన్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కోలుకుంది. సూపర్ హిట్స్‌తో భారీ బిజినెస్ జరుగుతోంది. ఇండియన్ సినిమాకి తెలుగు సినిమా ఒక ప్లాట్‌ఫామ్ చూపిస్తోందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇలా ఒక గాడిన పడిన ఇండస్ట్రీని దెబ్బకొడుతోంది కరోనా సెకండ్ వేవ్.
తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి తర్వాత సమ్మర్ బిగ్గెస్ట్ సీజన్. పైగా కరోనా లాక్డౌన్ తర్వాత వచ్చిన ఈ సమ్మర్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలని హీరోలు నిర్మాతలు చాలా ఊహించుకున్నారు. అందుకే ఏప్రిల్‌లో వారానికి ఒక హీరో బరిలో దిగాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ‘లవ్‌స్టోరి’ వాయిదా పడింది.
చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా వాయిదా పడుతోందనే ప్రచారం జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గే వరకు సినిమాని వాయిదా వెయ్యడం మంచింది అనుకుంటున్నారట నిర్మాతలు. ఈ సినిమాని మే నుంచి జూన్‌కి పోస్ట్ పోన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలని, ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే వర్కవుట్ అవ్వదు అనుకుంటున్నారట నిర్మాతలు. అందుకే ఈ కరోనా సెకండ్ వేవ్ తగ్గే వరకు ఎదురుచూసే ఆలోచనల్లో ఉన్నారట నిర్మాతలు.