పీసీసీ పదవుల పందేరంలో మెదక్ జిల్లా పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు కాంగ్రెస్ సీనియర్లకు కీలక పదవులిచ్చింది. జిల్లాలో సీనియర్ నేతలంతా సైలెంట్ గా ఉన్నా పిలిచి మరి పదవులిచ్చారు. పీసీసీలో కీలక పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈ పదవులతో నాయకులు యాక్టివ్ అయ్యి.. కేడర్‌లో చురుకు పుట్టిస్తారో లేదోనన్న చర్చ ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదలైంది.
ఒకప్పుడు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకునేది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల సంఖ్య కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువే. మంత్రులుగా నాడు చక్రం తిప్పి.. ఓ వెలుగు వెలిగిన వారూ ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ సీన్ మారింది. 2014లో రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే.. తర్వాత జరిగిన ఉపఎన్నికలో నారాయణ్‌ఖేడ్‌ను పార్టీ కోల్పోయింది. ఆ సమయంలో గీతారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మాత్రమే గెలిచారు. ముందస్తు ఎన్నికల్లో ఓటమి తర్వాత సీనియర్లు ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది.
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలకు పీసీసీలో చోటు దక్కింది. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌ను పీసీసీ ఉపాధ్యక్షుడిగా.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు పీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. పీసీసీ నియామక పక్రియ సమయంలో తన కామెంట్స్‌తో కాక రేపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎంపీ రేవంత్‌ను వ్యతిరేకించినా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెబుతూ వచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పై ఆయన హ్యాపీగానే ఉన్నట్టు తెలుస్తోంది. పైగా జగ్గారెడ్డికి పదవి ఇవ్వడం ద్వారా హైకమాండ్ పంపిన సంకేతాలు చర్చగా మారాయి.
మాజీ మంత్రి గీతారెడ్డి పార్టీకి లాయల్. కిందటి ఎన్నికల్లో ఓడిపోయినా.. సామాజిక సమీకరణాలు ఆమెకు కలిసివచ్చాయని చెబుతున్నారు. పైగా జగ్గారెడ్డి, గీతారెడ్డి ఇద్దరినీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిఫారసు మేరకే టీమ్‌లోకి తీసుకున్నారని ఒక టాక్ ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ.. పార్టీ గీత దాటలేదు. వరస ఓటములతో ఆయన డీలా పడ్డారట. ఇప్పుడు పీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించడంతో తిరిగి యాక్టివ్ అవుతారని అనుకుంటున్నారట.
మాజీ ఎంపీ సురేష్ షెట్కార్‌కు సైతం ఓటములే ఎదురయ్యాయి. ఆయన రేవంత్ వర్గం నేతగా టాక్. ఇప్పుడు పీసీసీ ఉపాధ్యక్ష పదవి రావడంతో సురేష్ కూడా నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అనుకుంటున్నారట. దీంతో కేసీఆర్ సొంత జిల్లాలో తిరిగి పట్టు సాధించవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీనియర్లంతా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పూర్వ వైభవానికి ఏ విధంగా ప్రయత్నిస్తారో చూడాలి.