పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవడం అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీని చూస్తేనే అర్ధమైపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లపాటు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఇప్పుడు చేష్టలుడిగి చూస్తోంది. నాయకత్వ ప్రయోగాలన్నీ విఫలమై, ఉనికికోసం పాకులాడుతోంది. జనంలో పోగొట్టుకున్ననమ్మకాన్ని మళ్లీ ఎలా పొందాలో తెలీక దిక్కులు చూస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్.ని జనం నెత్తిన పెట్టుకుంటారంటే సీన్ రివర్స్ అయ్యింది. టీఆరెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. నేతలు చేజారిపోయి, క్యాడర్.లో నమ్మకాన్ని కోల్పోయి నామ్ కేవాస్తే అన్నట్లు మారిపోతోంది తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి.

దుబ్బాక ఫలితం తర్వాత తెలంగాణలోకాంగ్రెస్ ఇక బతికి బట్టకడుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి కొడుకిని తెరపైకి తెచ్చి గెలుపు గుర్రం ఎక్కాలనుకున్న కాంగ్రెస్ చివరికి మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనాకష్టంమీద డిపాజిట్ మాత్రం దక్కించుకోగలిగింది.
రాష్ట్ర ఇంచార్జిలను మార్చినా, ఎవరిని ముందుపెట్టినా తెలంగాణలోకాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఎంపీగా గెలిచాక సిట్టింగ్ సీటు హుజూర్ నగర్ నే నిలబెట్టుకోలేకపోయారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీకాంగ్రెస్.లోఎవరి గోల వారిదే. టీడీపీని వీడి కాంగ్రెస్.లోకొచ్చిన రేవంత్ రెడ్డిది మింగాకక్కాలేని పరిస్థితి. టీడీపీలోనే రేవంత్ దూకుడు చూసిన నేతలు…కాంగ్రెస్.లో అతనికంత ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఇరగదీస్తామని మొన్నటిదాకా ఎగిరిన కోమటిరెడ్డి బ్రదర్స్…అనువుగాని చోట అధికులమనరాదన్నట్లు కొన్నాళ్లుగా సైలెన్స్ అయిపోయారు.
విజయశాంతిలాంటి గ్లామర్ లీడర్ కూడా ఔట్ డేటెడ్ పార్టీలో ఉండలేనంటోంది. ఇక పార్టీని లేపేదెవరు, ముందుకు నడిపేదెవరు? ఓ వ్యూహం, పట్టుదల, ప్రణాళిక లేకుండా…కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వారిదే. భట్టి విక్రమార్క ఎంత ఎగిరినా, తలపండిన వీహెచ్ ఎంత వాగినా తెలంగాణలో కాంగ్రెస్ ఇంచు కూడా ముందుకు వెళ్లడం లేదు.
దుబ్బాక రిజల్ఠ్ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రేపు గ్రేటర్ ఎన్నికలకు ఏ ఎజెండాతో వెళ్లాలో, ఎలా మొహం చూపించాలో అర్ధంకావడం లేదు. ఎవరి మొహం చూసి జనం ఓట్లేస్తారో పార్టీ కార్యకర్తలకే అంతుపట్టటం లేదు. ఇక చావు ఇంట్లో కామెడీ చేసినట్లు వీ హనుమంతరావులాంటి నాయకులు ఉండనే ఉన్నారు. తాజాగా ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు పొలికేక సభలోనూ రచ్చరచ్చే. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని స్టేజీ మీదే గట్టిగా డిమాండ్ చేశారు వీహెచ్. అక్కడితో ఆగితే తోకలేని హన్మంతు ఎందుకవుతాడు.
ఎన్నికల టైంలో ఇతరపార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇవ్వొద్దు, పదవులొచ్చి ప్రోత్సహించవద్దని డిమాండ్ చేశారు. ఆయన టార్గెట్ రేవంత్ రెడ్డి. రేవంత్ టీపీసీసీ పదవి ప్రయత్నాల్లో ఉన్నాడనే అక్కసుతో వీహెచ్ కడుపులో ఉంది కక్కేశాడు. ఇంకేముందీ ఆయనకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. బొక్కబోర్లా పడ్డపార్టీని కనీసం మోకాళ్లమీదయినా కూర్చోబెడదామని ఓ మీటింగ్ పెడితే…వీహెచ్ చేసిన రచ్చతో తలపట్టుకున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. ఎక్కడైనా ఓ దెబ్బతగిలాక జాగ్రత్తగా అడుగేస్తారు. కానీ కాంగ్రెస్ ఒళ్లంతా బ్యాండేజీలున్నా…తల తీసుకెళ్లి రోకట్లో పెడుతూనే ఉంది. నేతల మైండ్ సెట్ మారకుండా, వారిమధ్య సమన్వయం కుదరకుండా…కాంగ్రెస్ అధినాయకత్వం ఎంతమంది ఇంచార్జిలను మార్చినా వేస్టే.