Home News

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాతో కాంగ్రెస్ కొత్త డిమాండ్..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కండువా మార్చేశారు. గులాబీకి గుడ్‌బై చెప్పి జీజేపీ గూటికి చేరారు. అయితే అంతకు ముందు టీఆర్‌ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలా రాజీనామా చేశారోలేదో వెంటనే స్పీకర్‌ ఆమోదం కూడా తెలిపారు. ఆ తర్వాతే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు ఈటల. ఆత్మగౌరవం ముందు ఆ పార్టీ నుండి వచ్చిన పదవులు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌.. ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చింది.

పార్టీ మారిన ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక ఇప్పుడు టీపీసీసీ నేతలు మేలుకున్నారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి..టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఈటల లాగే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2014లో టీఆర్ఎస్‌ తొలి అధికారంలోకి రాగానే.. రేవంత్‌, ఒకరిద్దరు తప్ప టిడిపి తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా గులాబీ కండువా కప్పేసుకున్నారు. 2018లో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రాగానే.. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన డజను మంది ఎమ్మెల్యేలు వరుసగా గులాబీ గూటికి చేరుకున్నారు. సిఎల్పీని టీఆర్ఎస్ఎల్పీ లో విలీనం చేసేందుకు సుముఖత తెలుపుతూ స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చారు. ఇది అనైతికమంటూ కాంగ్రెస్ గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో, న్యాయ పోరాటం చేస్తోంది.

కాంగ్రెస్ తరపు ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రరెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అత్రం సక్కు, ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్, హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ కండువా కపుకొన్నారు. అయితే, ఇప్పుడు ఈటల ఎపిసోడ్‌తో నాడు పార్టీ మారిన వీళ్లందరిపై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. టీఆర్ఎస్ నుండి బయటకు వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.. కానీ ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు రాజీనామ చేయరని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌నేతలు. నైతికత అనే అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చి.. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. టీడీపీ నుండి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావు లు కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీని విలీనం చేయాలన్న వారి విజ్ఞప్తికి స్పీకర్ ఆమోదం కూడా తెలిపారు. దీంతో, అనైతికంగా పార్టీ మారిన టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు విపక్ష నేతలు. మొత్తానికి, ఈటెల రాజేందర్ రాజీనామా తో పార్టీలు మారిన నాయకులు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here