కాంగ్రెస్ లో ఇప్పుడు సీట్ల గోల పీక్ స్టేజ్ కి చేరింది. సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ తమతోపాటు తమ వారసుల్లో ఒకరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని భీష్మించుకు కూర్చుంటున్నారట.. అంతేకాదు ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో డబుల్ కోసం దాదాపు ‘డజన్’ మంది పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్‌లో డబుల్ ధమాకా కోసం సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెల్లడయ్యే సమయం దగ్గరపడుతున్న కొద్దీ సీనియర్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఫ్యామిలీ ప్యాకేజీల కింద రెండు టికెట్లు ఆశిస్తున్న నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలకు అధిష్టా నం అంగీకరించలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రం అదనంగా ఆయన సతీమణి పద్మావతికి పోటీ చేసే అవకాశం దక్కింది. ఫ్యామిలీ టికెట్ల విషయంలో ఉత్తమ్‌కు కూడా అధిష్టానం నో చెప్పినప్పటికీ, కోదాడ టికెట్ కోసం పద్మావతి ఒక్కరే దరఖాస్తు చేసుకోవడంతో అనివార్యంగా ఆమె పోటీ చేయాల్సి వచ్చింది. కానీ, ఈసారి కుటుంబంలోంచి ఇద్దరికి పోటీ చేసే అవకాశమివ్వాలని కోరుతున్నవారి జాబితా పెద్దగానే ఉంది.
జాబితాలో ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి బ్రదర్స్, డి.కె.అరుణ, సబిత, అంజన్, ముఖేశ్,గండ్ర,బలరాంనాయక్,భట్టి,గీతారెడ్డి ఇలా చాంతాడంతా లైన్ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట లాంటి నల్గొండ జిల్లాలోనే ఈ పోటీ అధికంగా ఉంది. ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి సిట్టింగ్‌ల జాబితాలో మళ్లీ హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. టీడీపీతో పొత్తు నేపథ్యం లో కోదాడ అసెంబ్లీ సీటును టీడీపీకి ఇవ్వాల్సి వస్తే తొలి త్యాగానికి ఉత్తమే ముందుకు రావాల్సి ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. పొత్తు కోసం త్యాగం చేయాల్సి వస్తే తప్ప సిట్టింగ్‌ల కోటా లో ఉత్తమ్‌కు ఫ్యామిలీ ప్యాకేజీ ఖాయమేనని తెలుస్తోంది. మరో ముఖ్య నేత జానారెడ్డి కూడా ఈసారి తన కుమారుడు రఘువీర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
రఘువీర్‌రెడ్డిని మిర్యా లగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే పోటీ చేయించాలని భావించినా అధిష్టానం అంగీకరించకపోవడంతో చివరి క్షణంలో తన అనుచరుడు ఎన్.భాస్కరరావుకు టికెట్ ఇప్పించుకుని గెలిపించారు. సిట్టింగ్ హోదాలో నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉండనున్నారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి ఈసారి మునుగోడు అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతానంటూ టిక్కెట్ పై క్లారిటి లేకున్నా క్యాపెయిన్ షూరు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డి.కె.అరుణ తనతోపాటు కుమార్తె స్నిగ్ధారెడ్డి కి మక్తల్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంతో పాటు ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ అసెంబ్లీ సమరాంగణంలోకి దూకేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వరంగల్ జిల్లా కు చెందిన మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నుంచి బరిలో దిగనుండగా తన సతీమణి జ్యోతికి వరంగల్ ఈస్ట్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ గోషామహల్ నుంచి బరిలో దిగనుండగా కుమారుడు విక్రంగౌడ్ ముషీరాబాద్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంతోపా టు తన కుమారుడు అనిల్‌కుమార్‌యాదవ్‌కు అసెంబ్లీ టికెట్ అడుగుతున్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనిల్‌కు ఇప్పటికే రాహుల్ నుంచి హామీ లభించిందని, ముషీరాబాద్ స్థానంపై ఆయన దృష్టి పెట్టారని తెలుస్తోంది. అదే కోవలో మరోనేత బలరాం నాయక్ కూడా ఉన్నారు. ఆయన మహబూబాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశమున్న నేపథ్యంలో తన కుమారుడు సాయిరాం నాయక్ కు ఇల్లెందు లేదా మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నేత సర్వే సత్యనారాయణ కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఆయన గతంలో మల్కాజ్గిరి, వరంగల్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని భావిస్తున్నారు. తనతో పాటు అల్లుడు క్రిశాంక్‌కు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం రాకపోతే భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేవెళ్ల లోక్‌సభ నుంచి కార్తీక్ లేదా సబితాఇంద్రారెడ్డి టికెట్లు అడగనున్నారు. మరి చివరకు అధిష్టానం ఏం చేస్తుం దో.. ఫ్యామిలీ ప్యాకేజీలకు గతంలో లాగానే ‘నో’ చెబుతుందా.. ప్రొసీడ్ అంటుందా.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వస్తేగానీ తెలియదు.
ఒకటి అసెంబ్లీ… ఇంకోటి పార్లమెంటు అడిగే జాభితా కూడా ఇంకోటి ఉంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తమ కుటుంబానికి ఒక లోక్‌సభ, మరొక అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నారు. ఇందులో కూడా సీఎల్పీ నేత జానారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్న జానా అది సాధ్యం కాకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తన కుమారుడు రఘువీర్‌ను నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించాలని భావిస్తున్నారు. ఎంపీగా గెలవడం ద్వారా నేరుగా రాహుల్ కోటరీలోకి రఘువీర్‌ను పంపాలనేది ఆయన వ్యూహం. ఉత్తమ్ కూడా నల్లగొండ పార్లమెంటుపై కన్నేసినట్టు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కోదాడ అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇవ్వాల్సి వస్తే తన సతీమణిని నల్లగొండ ఎంపీగా బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకే చెందిన మరోనేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఉన్నారు. దామోదర్‌రెడ్డి తనకు సూర్యాపేట అసెంబ్లీ స్థానం, తన కుమారుడు సర్వోత్తంకు భువనగిరి లోక్‌సభ స్థానం ఇవ్వాలని అడుగుతున్నారు.
మరో సీనియర్ నేత గీతారెడ్డి ఈసారి తన కుమార్తె మేఘనారెడ్డిని ఈసారి అసెంబ్లీ బరిలో దించేందుకు రెడీ అయ్యింది. ఆమెకు తన జహీరా బాద్ టికెట్ ఇచ్చి తనకు వేరే సీటు ఇవ్వాలని కోరుతున్నారట.. లేకపోతే ఎంపీగానైనా పోటీచేస్తానని గీతారెడ్డి చెబుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క.. తన సోదరుడు మల్లు రవిని ఈసారి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నారట.. వీరికి రెండు సీట్లు కావాలని అడుగుతున్నారు.
ఇలా పీసీసీ చీఫ్ ఉత్తమ్ మొదలు ఫ్యామిలీ ప్యాక్ సీట్ల కోసం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా డిమాండ్ చేస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఇస్తే ఓ బాధ.. ఇవ్వకపోతే పార్టీ లో అసమ్మతి పెరుగుతుందని ఖంగారు పడుతోందట..