దిగ్గజ కాంగ్రెస్ నాయకులదరికి కేరఫ్ అడ్రస్ నల్లగొండ జిల్లా. ఉద్దండులైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు ఈజిల్లాలో..ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట ఉమ్మడి నల్గొండ. కాంగ్రెస్ లో ఎలాంటి పదవులైన ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ జిల్లాకే. ప్రస్తుతం ప్రకటించిన పీసీసీలో ఈ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. జిల్లాలో కాంగ్రెస్ ని శాసించే నాయకులందరిని హైకమాండ్ రెస్ట్ మోడ్ లో ఉంచింది. ఇక పీసీసీ బాధ్యతలు రేవంత్ కి అప్పగించి ఫుల్ పవర్స్ ఇచ్చిన అధిష్టానం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆ సీనియర్లందరిని పక్కన పెట్టిందా అన్న చర్చ మొదలైంది.

ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ పార్టికి మొదటి నుంచి గట్టి పట్టుంది. పార్టీకి బలమైన నాయకత్వం..కేడర్ ఉంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు ఎంపీలు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి.. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి.. ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతానికి చెందినవారే. ఇంత మంది ఉన్నా.. ఈ దఫా ప్రకటించిన పీసీసీలో నల్లగొండ జిల్లాకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే చర్చ కాంగ్రెస్‌లో సాగుతోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఆరు కాంగ్రెస్ గెల్చుకుంది. ఒక ఎంపీ సీటు కూడా కాంగ్రెస్‌దే. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడంతో హస్తం పార్టీ కుదేలైంది. ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు నాడు కారెక్కేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య గెలిచారు. వీరిలో చిరుమర్తి లింగయ్య కండువా మార్చేశారు. మంత్రులుగా పనిచేసిన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఉత్తమ్ భార్య పద్మావతి ఓడిపోవడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి ఉత్తమ్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచి ఉత్సాహం నింపారు. కానీ.. ఉత్తమ్ రాజీనామాతో ఉపఎన్నిక జరిగిన హుజూర్నగర్ అసెంబ్లీ సీటు మాత్రం గులాబీ ఖాతాలో పడింది. ఇక్కడ పోటీ చేసిన ఉత్తమ్ భార్య పద్మావతి ఓడిపోయారు. ప్రస్తుతం జిల్లాలో ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన కూడా పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియని స్థితి. తాజాగా ప్రకటించిన పీసీసీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చోటు దక్కలేదు. ఏ కమిటీలోనూ చోటు ఇవ్వలేదు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని మాత్రం ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు.
ఈ సీనియర్ లీడర్లందరిని పక్కన పెట్టిన అధిష్టానం రేవంత్ కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక వేళ సీనియర్ల సేవలు వినియోగించుకోవాలంటే వారిని ఎంపీలుగా పోటి చేయించొచ్చన్న ఆలోనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో తీసుకునే కీలక నిర్ణయాలు సీనియర్లతో చర్చించమని రేవంత్ కి చెప్పిన అధిష్టానం వాటి అమలులో మాత్రం రేవంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట. రేవంత్ 2022లో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకి ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు పార్టీలో తన కోర్ టీంని రంగంలోకి దించి ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి పట్టుందన్న దానిపై కసరత్తు మొదలు పెట్టనుంది.