Home News

రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ?

రేవంత్‌రెడ్డికి టీ పీసీసీ ప‌గ్గాలు అప్పగించినట్లే అన్న చర్చ ఒకపక్క కాంగ్రెస్ నేతలల్లో నడుస్తుంటే..కొందరు కాంగ్రెస్ నేతలు అనూహ్యంగా కేసీఆర్ ని కలిసి ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్‌ను పీసీసీ చీఫ్ చేయ‌డానికి ఏ ఒక్క సీనియ‌ర్ నేత కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఈ వెట‌ర‌న్ బ్యాచ్ అంతా ఏక‌మై ఆ డైన‌మిక్ లీడ‌ర్‌కు చెక్ పెట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అధిష్టానంలో లాబీయింగ్ ఓవైపు.. రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప‌ని మ‌రోవైపు. ఇవేవీ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో.. ఇప్పుడిక హైక‌మాండ్‌కు ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చేందుకు కూడా వెన‌కాడ‌లేదు సీనియ‌ర్లు. రేవంత్‌రెడ్డిని అధ్య‌క్షుడిని చేస్తే.. త‌మ దారి తాము చూసుకుంటామ‌న్న‌ట్టుగా తొలిసారి ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లి మ‌రీ సీఎం కేసీఆర్‌ను క‌లిశార‌ని చెబుతున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాట‌య్యాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్న‌డూ లేని విధంగా ముఖ్య‌మంత్రి సైతం ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్ల‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం తెర‌వ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు.. కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టేందుకే.. కేసీఆర్ ఇలాంటి స్కెచ్ వేశార‌ని అంటున్నారు. ఇటు కేసీఆర్.. అటు కాంగ్రెస్ సీనియ‌ర్స్.. అంతా కావాల‌నే త‌మ ప్ర‌యోజ‌నాల కోస‌మే మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్‌ను అడ్డుపెట్టుకొని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా పొలిటిక‌ల్ డ్రామా న‌డిపించార‌ని అంటున్నారు. తాజా ప‌రిణామంతో ఇటు కేసీఆర్‌ అటు కాంగ్రెస్ సీనియ‌ర్స్‌.. అంతా క‌లిసి రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టే నాట‌కానికి తెర తీశార‌ని చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ ఛ‌రిష్మా ఉన్న రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయితే ఇక కాంగ్రెస్‌లో వ‌న్‌మ్యాన్ షో నే ఉంటుంది. ఇక కేవ‌లం రేవంత్‌రెడ్డి పేరు మాత్ర‌మే వినిపిస్తుంది. కేసీఆర్‌కు నిద్ర‌లేకుండా చేస్తూ.. రేవంత్‌రెడ్డి చిచ్చ‌ర‌పిడుగులా చెల‌రేగిపోవ‌డం ఖాయం. కాంగ్రెస్‌లో రేవంత్‌.. మ‌రో వైఎస్సార్‌గా మారుతార‌ని భావిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్‌ను ఆక్ర‌మించేస్తే.. ఇన్నాళ్లూ పార్టీలో హ‌వా చెలాయించిన సీనియ‌ర్లు మదనపడుతున్నారు. అధిష్టానం మాత్రం రేవంత్‌రెడ్డి వైపే ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌టం.. సీనియ‌ర్ల‌కు మింగుడుప‌డ‌ని అంశం. మేట‌ర్ ఇక క్లైమాక్స్‌కు చేర‌డంతో ఏకంగా హైక‌మాండ్‌కే ఝ‌ల‌క్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు సో కాల్డ్‌ సీనియ‌ర్స్. త‌మ‌ని కాద‌ని రేవంత్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. త‌మ దారి తాము చూసుకోవాల్సి వ‌స్తుంద‌నే మెసేజ్ ఇవ్వ‌డానికే కేసీఆర్‌ను ఇంటికెళ్లి మ‌రీ క‌లిశార‌ని అంటున్నారు.

సీఎం కేసీఆర్ సైతం ఏడేళ్లుగా ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు పావుగంట‌లోనే అపాయింట్‌మెంట్ ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రియ‌మ్మ సాకుగా ఈ భేటీ జ‌రిగింద‌ని చెబుతున్నారు. కేసీఆర్ ని కలిసిన భ‌ట్టి విక్ర‌మార్క‌. శ్రీధ‌ర్‌బాబు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి. ఈ న‌లుగురూ మొద‌టి నుంచీ కేసీఆర్‌కు విధేయులేన‌నే ప్ర‌చారం ఉంది. సీఎల్పీ లీడ‌ర్ భ‌ట్టి కేసీఆర్‌పై సుతిమెత్త‌గా దాడి చేస్తుంటారు. మ‌ధిర‌లో టీఆర్ఎస్ శ్రేణులే భ‌ట్టిని గెలిపించాయ‌నే రూమ‌ర్ కూడా ఉంది. ఇక మ‌రో ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబు. మొద‌టినుంచో ఆయ‌న‌కు కేసీఆర్‌పై సాఫ్ట్ కార్న‌రే. ఇక రాజ‌గోపాల్‌రెడ్డి. ఆయ‌న టీఆర్ఎస్ వైపు చూడ‌కున్నా.. కాంగ్రెస్‌ను వీడాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించేసుకున్నారు. అందుకే ప‌లుమార్లు కాంగ్రెస్ పార్టీని బ‌హిరంగంగానే విమ‌ర్శించారు కూడా. బీజేపీలో చేరేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ పేరు ప్ర‌క‌టించ‌గానే కాంగ్రెస్‌లో ప‌డే ఫ‌స్ట్ వికెట్ రాజ‌గోపాల్‌రెడ్డే కావొచ్చు అంటున్నారు.

ఇక జ‌గ్గారెడ్డి తాను కేసీఆర్‌ను విమ‌ర్శించ‌ను అంటూ బాహాటంగానే ప్ర‌క‌టించేశారు. రేవంత్‌రెడ్డి ప‌గ్గాలు ఇవ్వొద్దంటూ గట్టిగానే గొడవ చేస్తున్నారు. ఆయ‌న‌కు హ‌రీష్‌రావుతో ప్రాబ్ల‌మ్ అంతేకానీ ఆయ‌న మ‌న‌సంతా టీఆర్ఎస్సే. ఇలా రేవంత్‌రెడ్డిపై తీవ్ర‌ అసంతృప్తిగా ఉన్న ఆ న‌లుగురు కేసీఆర్‌ను క‌లిసి కాంగ్రెస్ అధిష్టానానికి నేరుగా మెసేజ్ ఇచ్చారు అన్న చర్చ నడుస్తుంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే.. ఆయ‌న‌కు స‌హాయ నిరాక‌ర‌ణ త‌ప్ప‌ద‌ని.. త‌మ దారి త‌మ‌దేన‌నేలా బెదిరింపుల‌కు దిగారని అంటున్నారు. టీఆర్ఎస్ పై ఓవైపు బీజేపీ నేతలు క‌త్తులు దూస్తూ కాంగ్రెస్ ప్లేస్‌ను బ‌ర్తీ చేస్తుంటే.. బీజేపీకి పోటీగా కేసీఆర్‌పై మ‌రింతగా దూకుడు పెంచాల్సింది పోయి ఎంచ‌క్కా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వెళ్లి కేసీఆర్ ట్రాప్‌లో ప‌డేటంత‌టి అమాయ‌కులేమీ కాదు ఆ న‌లుగురు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here