Home News Politics

క్యాస్ట్ పాలిటిక్స్ పై కాన్సంట్రేట్ చేసిన కాంగ్రెస్….!

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో… ప్రజా కూటమిని ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. ఓట్ల బదలాయింపులో జాగ్రత్తలు పాటిస్తోందా?. భాగస్వామ్య పక్షాలకు సీట్ల పంపిణీ విషయంలో అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్న కాంగ్రెస్ నేతలు… సొంత పార్టీ అభ్యర్థుల ఎంపికలో లెక్కలన్నీ పక్కాగా చూసుకున్నారా?. 40 నియోజకవర్గాల్లో బలమైన ప్రాతినిధ్యం ఉన్న సీమాంధ్రుల ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ వద్ద ఏదైనా వ్యూహం ఉందా?. హస్తం పార్టీ గత ఎన్నికల్లో చేసిన తప్పులే మళ్లీ చేస్తోందా?.

దేశంలో ప్రతీ కులం, వర్గం అధికారంలో ప్రాతినిధ్యం కోసం అన్ని రకాలుగా పోరాడుతున్న రోజులివి. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులు ఇందుకు అతీతం కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా సీమాంధ్రుల్లో కొంత అభద్రతా భావం ఉంది. దీన్ని గుర్తించిన టీడీపీ అధినేత.. సీమాంధ్రులు బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఆ ప్రాంత వాసులకే టిక్కెట్లు ఇవ్వడం.. పార్టీలో కీలకంగా ఉన్న సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లాంటి వ్యూహాన్ని అమలు చేశారు. ఈ వ్యూహం సక్సెస్ కావడంతో టీడీపీ చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకుంది. అయితే ఒకరిద్దరు మినహా టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది.

సీమాంధ్రులు తమ వైపే ఉన్నారని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. తమ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా బరిలోకి దింపింది. దీంతో సీమాంధ్రుల ప్రాభల్యం ఉన్న నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణల లెక్కలు కూడా సరిపోయాయి. సీమాంధ్ర ఓటర్ల విషయంలో టీఆర్ఎస్ పక్కా క్లారిటీతో ఉంది. మరి కాంగ్రెస్ ఈ విషయంలో ఏం చేస్తోందనే ప్రశ్న వినిపిస్తోంది. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. మిగతా వర్గాలు ఉన్నా వారి ప్రాధాన్యం అంతంత మాత్రమే. సీమాంధ్రులు బలంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, నిజామబాద్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున సీమాంధ్రకు చెందిన నేతలకు ఇంత వరకూ ప్రాతినిధ్యం లేదు.


ప్రజా కూటమిలో టీడీపీ చేరడంతో… టీడీపీకి కేటాయించే సీట్లన్నీ సీమాంధ్రుల కోటా కింద ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 40 స్థానాల్లో సీమాంధ్రుల ప్రాతినిధ్యం ఉంటే.. టీడీపీకి 20 సీట్లిస్తే.. మిగతా నియోజకవర్గాల మాటేమిటనే ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి సమాధానం లేదు. సీమాంధ్రులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు వారికి సీట్లిచ్చేందుకు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ తరపున సీమాంధ్రకు చెందిన అభ్యర్థులకు సీట్లివ్వకుండా వారి ఓట్లు ఆశించడం సాధ్యమేనా?. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల్లో అన్ని వర్గాలకు చెందిన ఓటర్లున్నారు. వారంతా తమకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటారు. మరి వారికి కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఇవ్వదా?


కూటమి తరపున తనకు దక్కే సీట్లలో టీడీపీ తరపున సీమాంధ్రులు ఎక్కువ సంఖ్యలో రంగంలో దిగే అవకాశాలున్నాయి. అదే సమయంలో తెలంగాణలో ఉంటున్న నేతలకు కూడా టీడీపీ అధినేత సమ ప్రాధాన్యం ఇస్తారు. సీమాంధ్రుల ఓట్ల బదలాయింపు పక్కాగా జరగాలని కాంగ్రెస్ కోరుకుంటూ ఉంటే… హస్తం పార్టీ తరపున కూడా సీమాంధ్రులకు సమాన ప్రాతనిధ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా భారం అంతా టీడీపీ మీదే వేస్తే… లాభం కూడా టీడీపీకి మాత్రమే దక్కుతుందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించడం అవసరం. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులు తెలంగాణ ప్రజలే అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం గుర్తిస్తే… సీట్ల పంపిణీలో వారికి కూడా మిగతా వర్గాలతోపాటు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల్లో కమ్మ, కాపు, రెడ్లతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. సీమాంధ్రుల కోటాలో కేటాయించే టిక్కెట్లలో తమకు ప్రాతినిధ్యం కావాలని ఈ వర్గాలన్నీ కోరుతున్నాయి. తమకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైపే ఈ వర్గాలన్నీ మొగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో నెక్ టూ నెక్ పోటీ నడుస్తున్న తరుణంలో.. ప్రతీ సీటు కీలకం కానుంది. సంప్రదాయంగా ఒక వర్గాన్ని నమ్ముకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ … ఈసారి సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక వర్గాన్ని నమ్ముకుంటే కొంప మునగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here