ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువగా దెబ్బతిన్నది..ఓటర్లు షాకిచ్చింది కాంగ్రెస్ కేనా…ఒక్కసారి ఓట్ల లెక్కింపు ఫలితాల లెక్కలు విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ డ్యామేజ్ కాంగ్రెస్‌కి జరిగింది..పుదుచ్చేరిని కోల్పోవడమే కాదు.. బెంగాల్లో కనుమరుగైంది కేరళను చేజార్చుకుంది.

దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయ్.. కొత్త కొత్త పార్టీలు విజేతలుగా అవతరిస్తున్నాయ్. కానీ ప్రతి ఎన్నికల్లోనూ ఘోరంగా విఫలమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ డ్యామేజీ కాంగ్రెస్ పార్టీకి జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి అవేవీ సాకారం కాలేదు.
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. అసలు ప్రభావమే చూపించలేదు. నిజానికి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో గెలుపు కోసం ప్రయత్నించాల్సిన పార్టీ చేతులెత్తేసింది. మమతతో కలవకుండా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. వివాదాస్పద మత గురువు అబ్బాస్‌కి చెందిన పార్టీ ఐఎస్ఎఫ్తోనూ జత కలిసింది. ఈ నిర్ణయాన్ని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకించారు. అయినప్పటికీ వినిపించుకోలేదు. ఇక బెంగాల్లో రాహుల్ గాంధీ ప్రచారమే లేదు. దీంతో ఇక్కడ జీరో స్థానాలు దక్కాయి.
2016కి ముందు అధికారంలో ఉన్న అసోం కూడా రెండోసారి చేజారింది. ఇక్కడ పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో ఫెయిలైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, యాంటీ సీఏఏ, ఎన్ఆర్సీ వీటిని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రియాంక ప్రచారం తప్ప.. రాహుల్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అసోంలోనూ కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. పుదుచ్చేరిలో గతంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ ఇప్పుడు అక్కడ ఓడిపోయింది. అంటే సిట్టింగ్ రాష్ట్రాన్ని కోల్పోయినట్లేగా..రాహుల్ ప్రచారం చేసినా పెద్దగా పట్టించుకోలేదు జనాలు.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా అధికారంలో వస్తుందెమో అన్న పరిస్థితులు కనిపించిన రాష్ట్రం కేరళ..ఎందుకంటే యూడీఎఫ్‌కి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2019లో ఏకంగా 19పార్లమెంట్ స్థానాలు గెలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ అసమర్థతో ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. పైగా ఇక్కడ రాహుల్ గాంధీ ముమ్మర ప్రచారం చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఓట్లు పడలేదు. తమిళనాడులో మాత్రమే చెప్పుకోదగ్గ స్థానాలు గెలిచింది. అదీ డీఎమ్‌కే సపోర్ట్‌తో.. ఇక ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి షాకులు తగులుతున్నాయ్.
పార్టీకి ఇప్పటికీ అధ్యక్షుడు లేడు. కొన్ని రాష్ట్రాలకు పీసీసీలను మార్చలేదు..ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. ఇక సొంత అధిష్టానంపై అసంతృప్తితో జీ 23 నేతలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. ఇన్ని సమస్యల మధ్య కాంగ్రెస్ ఎదిగి.. మళ్లీ అధికారం దక్కించుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు పెరుగుతున్నాయ్.