Home News Stories

ఇప్పుడు ఓకేనా? మ‌ళ్లీ మొద‌టికేనా?

న్యాయ‌,శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌

జ‌స్టిస్ కేఎం జోసెఫ్ వివాదం కేంద్రానికి, సుప్రీంకోర్ట్‌కి మ‌ధ్య అగాధం పెంచుతోంది. సుప్రీం న్యాయ‌మూర్తులుగా ప‌దోన్న‌తి కోసం ఇద్ద‌రి పేర్ల‌ను సిఫార్సుచేస్తే అందులో ఒక‌రిని ఆమోదించి, మ‌రొక‌రిని తిర‌స్క‌రించ‌డం అసాధార‌ణ చ‌ర్య‌గా భావిస్తున్నారు న్యాయ‌నిపుణులు. ఇప్ప‌టికే ఇందూమ‌ల్హోత్రా సుప్రీం న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించ‌గా, కేఎం జోసెఫ్ విష‌య‌మే అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇద్ద‌రినీ తిర‌స్క‌రిస్తే ఇంత ర‌గ‌డ ఉండేదే కాదు. సుప్రీంకొలీజియం జాబితాని మ‌ళ్లీ స‌వ‌రించి పంపి ఉండేది. కానీ ఒక‌రికి ఆమోదం తెలిపి మ‌రొక‌రిని తిర‌స్క‌రించ‌డాన్నే న్యాయ‌వ్య‌వ‌స్థ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.

జ‌స్టిస్ కేఎం జోసెఫ్ పేరును తిర‌స్క‌రించ‌డానికి కేంద్రం స‌వాల‌క్ష కార‌ణాలు చెప్పినా కొంద‌రు సుప్రీం న్యాయ‌మూర్తులు ఆ వాద‌న‌తో ఏకీభవించ‌డంలేదు. కేంద్ర నిర్ణ‌యాన్ని చీఫ్ జ‌స్టిస్ దీప‌క్‌మిశ్రా స‌మ‌ర్ధించినా సుప్రీం న్యాయ‌మూర్తుల్లో కొంద‌రు దీన్ని తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు. జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌, జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్‌ల విన్న‌పంతో చివ‌రికి కేఎంజోసెఫ్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకునేందుకు సుప్రీం కొలీజియం స‌మావేశ‌మైంది. సుప్రీం న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తికోసం మిగిలినవారితో పాటు మ‌ళ్లీ కేఎం జోసెఫ్ పేరుని కూడా సిఫార్సు చేయాల‌ని కొలీజియం నిర్ణ‌యించ‌టంతో దీనిపై కేంద్రం స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌దే ఇప్పుడంద‌రిలో ఉత్కంఠ‌.

చూస్తుంటే ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్ పదోన్నతి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలనే అత్యున్నత న్యాయస్థానం భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆయనకు పదోన్నతి కల్పించాల్సిందేనని, ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని తేల్చిచెప్పింది. ప్ర‌త్యేకంగా సమావేశమైన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం కేఎం జోసెఫ్ పేరుని మ‌ళ్లీ సిఫార్సుచేస్తూ ఫైల్‌ని వెనక్కి పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. కాక‌పోతే ఆయ‌న ఒక్క‌రిపేరే కాకుండా వివిధ హైకోర్టులకు చెందిన మరికొందరి పేర్లతో కలిపి సిఫార్సు చేయ‌బోతోంది.

కొలీజియం తన సిఫార్సుల్ని పునరుద్ఘాటించడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరిన సందర్భం కూడా ఇదేనంటున్నారు న్యాయ‌నిపుణులు. కొలీజియం మ‌ళ్లీ త‌న సిఫార్సుని పంపిస్తుండ‌టంతో దాన్ని ఆమోదించడం తప్ప కేంద్రానికి మ‌రో మార్గం లేదంటున్నారు. అయితే కేంద్రం మ‌రింత పంతానికి పోతే, నిర్ణ‌యంలో జాప్యంచేస్తే న్యాయ‌,శాస‌న వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య అగాధం పెర‌గ‌డం ఖాయ‌మ‌న్న అభిప్రాయం బ‌లంగా ఉంది. సుప్రీం న్యాయ‌మూర్తుల పోద‌న్న‌తి వ్య‌వ‌హారంలో కులం, ప్రాంతం, సీనియారిటీ, ప్రతిభ మొద‌లైన కార‌ణాల్ని కేంద్రం ప్ర‌స్తావించ‌డాన్ని సుప్రీం సీరియ‌స్‌గా తీసుకుంది. ఉత్త‌రాఖండ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని పున‌రుద్ధ‌రించేలా తీర్పు ఇచ్చినందుకే జ‌స్టిస్ కేఎం జోసెఫ్ పేరుని తిర‌స్క‌రిస్తున్నార‌నే వాద‌న కేంద్రాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here