చెప్పేవి శ్రీరంగనీతులు..దూరేవి అవేవో గుడిసెలన్న నానుడి ఈ కాలపు మీడియాకి అతికినట్లు సరిపోతుంది. మన కలికాలపు మీడియా ఎన్నో నీతులు చెబుతుంది. క్షణంక్షణం బ్రేకింగులతో ఊదరగొడుతుంది. చీమచిటుక్కుమంటే చాలు.. తన నిఘా కళ్లనుంచి ఏదీ తప్పించుకోలేదన్నట్లు హడావుడి చేస్తుంది. జనంకోసమే 24గంటలూ పనిచేస్తున్నట్లు బిల్డప్పివ్వడంలో మన మీడియాని మించింది లేదు. కానీ ఎవర్ని ఎప్పుడు ఎత్తాలో, ఎప్పుడు ఎవర్ని తొక్కాలో మీడియాకో “లెక్క” ఉంటుంది.
.
మన దారికి రాలేదంటే కడిగిపారయేడం, టచ్‌లో ఉండేవాళ్లని జాగ్రత్తగా చూసుకోవడం…ఇదే ఈకాలపు మీడియా సిద్ధాంతమనేది ఓపెన్ సీక్రెట్. ఎవడ్నన్నా దార్లో పెట్టుకోవాలంటే కమింగ్ అప్లు, ప్రొమోలతో టీవీ స్క్రీన్‌మీద ఏ క్షణమయినా బ్రహ్మాండం బద్దలైపోతుందన్నట్లు హడావుడిచేయడం…లైన్లోకొచ్చి మాట్లాడుకోగానే దాని గురించి మరిచిపోవడం మన తెలుగుమీడియాలోనూ కనిపిస్తున్న తంతే. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు…తమనెవరూ గమనించడంలేదనీ, మీడియా ముసుగులో తామేం చేసినా చెల్లుతుందన్నట్లే ఉంది ఈ దేశంలో కొన్ని పత్రికలూ ఛానెళ్ల పరిస్థితి.
నిబద్ధత లేని మీడియా సంస్థలు కాసులకోసం గడ్డికరవడానికైనా సిద్ధపడతాయని కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఈ ప్రపంచానికి చాటిచెప్పింది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింపజేయడానికి, గోబెల్స్ ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి పేరున్న మీడియా సంస్థలు కూడా నిస్సిగ్గుగా ఒప్పుకుని కెమెరా నిఘాకు దొరికిపోయాయి. ఈ దేశంలో మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని బట్టలిప్పి బజార్లో నిలబెట్టింది కోబ్రాపోస్ట్ ఆపరేషన్-136. దేశవ్యాప్తంగా 25కి పైగా న్యూస్ నెట్‌వర్క్స్‌పై స్టింగ్ ఆపరేషన్‌తో సంచలనం సృష్టించింది కోబ్రాపోస్ట్. రెండుమూడు వార్తాసంస్థలు మాత్రమే ఈ ఉచ్చులోకి రాకుండా కుదరదని చెప్పేశాయి. మిగిలినవన్నీ కోరిందిస్తే దేనికయినా తెగబడేందుకు నిస్సిగ్గుగా ఒప్పేసుకున్నాయి.
హిందూత్వకు అనుకూలంగా ఎన్నికలముందు ప్రచారాన్ని నిర్వహించేలా, బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించేలా కథనాలిచ్చేందుకు కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో మీడియా సంస్థలు పోటీపడ్డాయి. టైమ్స్ గ్రూప్, ఇండియాటుడే, నెట్వర్క్ 18, జీ నెట్వర్క్, దైనిక్ జాగరణ్..అన్నీ ఒకే తానుముక్కలని కోబ్రా ఆపరేషన్-136లో బట్టబయలైంది. ప్యాకేజీ కుదిరితే ఏం కోరితే అది చేసి పెట్టడానికే కాదు..గతంలో తాము తెలివిగా చేసిన ఇలాంటి ఘనకార్యాల్ని కూడా చెప్పుకొచ్చారు ఆ మీడియా సంస్థల యాజమాన్య ప్రతినిధులు.
మరి తెలుగుమీడియా నిప్పులా ఉందా అంటే తప్పులో కాలేసినట్లే. ఎవరన్నా వచ్చి గోకాలేగానీ ముందే సదా మీ సేవలో అనడానికి మన మీడియా ఎప్పుడూ రెడీనే. కాకపోతే…ఈసారికి కోబ్రా స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 దొరికాయి. రంకునేర్చినమ్మ బొంకు నేర్వదా అన్నట్లు తప్పుడు ప్రచారమని బొంకొచ్చుగానీ…మన తెలుగుమీడియా యాజమాన్యాలకు నార్కోఎనాలసిస్ పరీక్షచేసి ప్రశ్నిస్తే నమ్మలేని నిజాలెన్నో బయటికొస్తాయి. వారి వెనుక చీకటికోణాలు వెలుగుచూస్తాయి. వీళ్లా…ప్రసారాలతో జనాన్ని ఉద్ధరించేది?