Home News Stories

సీఎం సొంత ఇలాకలో పరేషాన్…

టికెట్ల కేటాయింపు తర్వాత టీఆర్ఎస్‌లో అలకలు, నిరసనల పర్వానికి అసలు కారణం ఏంటి? తామంతా పోటీలో ఉండాలనేనా.? లేక మరేదైనా కారణం ఉందా.? అలక పానుపు ఎక్కిన వారంతా సీరియస్ గా టికెట్ కోసమే ట్రై చేస్తున్నారా? లేక నిరసనల గళం వెనుక మరేదైనా మతలబుందా? టికెట్‌ దక్కదని తెలిసీ ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు?.. ప్రస్తుతం గులాబీశ్రేణుల్లో చర్చంతా దీని గురించే..

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేసి ఓ అంకాన్ని పూర్తి చేసేసింది. ఆ క్రమంలో ప్రస్తుతం టీఆర్ఎస్‌ అభ్యర్థుల పై ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్కడక్కడా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి… పార్టీ అభ్యర్థులను మార్చాల్సిందే అంటూ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న వారు నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి…


నారాయణఖేడ్ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ని మార్చాల్సిందే అని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి … “భూపాల్ రెడ్డి హఠావో-నారాయణఖేడ్ బచావో ” .. నినాదాలతో నారాయణఖేడ్ లో నిరసన ర్యాలీలు నిర్వహించి ఆయన దిష్టిబొమ్మ లను దహనం చేసారు… స్థానిక గొర్రెల పెంపకం దారుల సంఘం నాయకులు, ఎంపీటీసి, జడ్పీటీసీ లు గతకొంత కాలంగా టీఆర్‌ఎస్‌లో ఆయన ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు … ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రాములు నాయక్, జహీరాబాద్ ఎంపి బి.బి.పాటిల్ వర్గాలు సైతం గతం నుండి భూపాల్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నాయి..

మరోవైపు పటాన్‌చెరులోనూ అలాంటి పరిస్థితే నెలకొని ఉంది… ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డినే అభ్యర్ధిగా ప్రకటించారు కేసీఆర్‌.. అయితే ఆయన్ని మార్చి తీరాల్సిందే అని గాలి అనిల్ కుమార్ వర్గం డిమాండ్ చేస్తోంది… ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ మదన్ రెడ్డి ని మార్చాలని ప్రత్యేక సమావేశాలు జరిగాయి… పార్టీలో తొలి నుండి కష్టపడ్డ ఉధ్యమ కారులకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ నియజకవర్గ నాయకులు.. జిల్లా పార్టీ అధ్యక్షుడు మురళీ యాదవ్ ఈ స్థానం నుండి పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు.

సంగారెడ్డి లోనూ పార్టీ ప్రకటించిన అభ్యర్ధి చింత ప్రభాకర్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ వర్గం సమావేశాలను నిర్వహిస్తోంది.. అధిష్టానం వద్ద బాధ ను చెప్పుకునేందుకు అవకాశం దొరకక రోడ్డెక్కాల్సి వస్తోందని సత్యనారాయణ వాపోయారు… నియోజవర్గానికి చెందిన మరికొంత మంది అసంతృప్తివాదులు జిల్లా మంత్రి హరీష్ రావుని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.. అయితే అసంతృప్తితో బయటపడే వారు పడుతుంటే కొందరు నివురు గప్పిన నిప్పులా వ్యవహరిస్తున్నారు .. దాంతో అభ్యర్థిత్వాలు ఖరారైన వారిలో గుబులు రేగుతోంది…

మొత్తం మీద సిట్టింగ్‌లు అసమ్మతి తలనొప్పులతో కంగారు పడుతున్నారు.. పలు సీట్లలో అసమ్మతి వర్గం స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేస్తామన్న సంకేతాలను సైతం ఇస్తుండటం తో ఎక్కడ తమ ఓటు బ్యాంక్ చీలిపోతుందో అన్న భయం సైతం పార్టీ అభ్యర్థులకు వెంటాడుతోంది… అయితే ఇలా అసమ్మతి రాగం వినిపిస్తున్న వారిలో ఎక్కువ మంది అసలు ఉద్దేశ్యం పార్టీ టికెట్ కాదని.. తమ ప్రాధాన్యత ను పెంచుకోవడం.. అస్థిత్వం ను కాపాడుకోవడం అని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సీఎం సొంత ఇలాకలో కూడా అసమ్మతుల బెడద గులాబీలో గుబులు రేపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here