Home News

ఓరుగల్లులో మారుతున్న రాజకీయ సమీకరణలు..కడియం ఇంటికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఓరుగల్లు పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతుంది. కేసీఆర్ వరంగల్ వచ్చిన ప్రతిసారి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేసి ఆతిథ్యం స్వీకరించేవారు. అయితే రేపటీ సీఎం కేసీఆర్ పర్యటనలో మాత్రం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేపు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోనేందుకు వరంగల్ పర్యటనకు రానున్న కేసీఆర్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో ఆతిధ్యం స్వీకరించనున్నారు. ఇప్పుడు ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఉద్యమ కాలం నుంచి మొదలుకొని సీఎం హోదాలో మొన్నటి యంజియం ఆసుపత్రి పర్యటన వరకు వరంగల్‌ ఎప్పుడు వచ్చినా లక్ష్మీకాంతరావు ఇంట్లోనే ఆయన బస ఏర్పాటు చేసే వారు. కానీ అనూహ్యంగా కడియం ఇంటికి కేసీఆర్ రావడం ఆసక్తి రేపుతుంది. గత కొంత కాలంగా కడియం శ్రీహరిని పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టుతున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది. ఇక బీజేపీ వైపు కడియం చూస్తున్నారని మరికొందరు అనుకుంటున్న సమయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఈటల ఎపిసోడ్‌ పై ఆసక్తికర చర్చ నడుస్తున్న సమయంలో పార్టీని వదిలి వెళ్లిన ఈటల రాజేందర్ పై కడియం శ్రీహరి ఘాటు విమర్షలు చేశారు. ఈటల కమ్యూనిస్ట్‌ కాదు ఫ్యూడలిస్ట్‌ అని ఆయన విరుచుకుపడ్డారు. సోషలిస్ట్‌ అంటూనే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శల డోస్‌ కూడా పెంచారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటి చేసి ఎంపీగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి. అయితే అనూహ్య రాజకీయ పరిణామాలతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెనువెంటనే డిప్యూటీ సీఎంగా అనుకోని పదవి వరించింది. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు శ్రీహరి. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో చోటు దక్కలేదు. దాంతో ఎమ్మెల్సీగానే ఉండిపోయారాయన. ఇప్పుడు చేతిలో ఎలాంటి పదవి లేదు. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాతో కలిపి ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిల్లో టీఆర్‌ఎస్‌ ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. పార్టీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. ఎవరిస్థాయిలో వారు లాబీయింగ్‌ చేస్తున్నారు కూడా. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ చాన్స్ దక్కవచ్చని ఆపై మంత్రి వర్గంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తుంది.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కడియం ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ పదవితో పాటు అధిక ప్రాధాన్యత గల పదవి ఖాయమన్న చర్చ ఉమ్మడి ఓరుగల్లు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here