Home News

ఆ వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యల పై ఫోకస్‌ పెట్టిన జగన్…!

వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారు. ఓ ఎమ్మెల్యే కీలకమైన ఒక సామాజికవర్గాన్ని తాగుబోతులని కించపరిస్తే మరో ఎమ్మెల్యే ఏకంగా తమ నాయకుడు ప్రవేశపెట్టిన పథకాన్నే అపహాస్యం చేశారు. ఇలా సొంత పార్టీ నేతలు అదీ సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. సీనియర్‌ నాయకులే పద్ధతీ పాడు లేకుండా మాట్లాడి తమ నాయకుడి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడంలో ముందు వరసలో ఉంటున్నారు. ఇప్పుడు వీరీ పైనే ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం.

వైసీపీలో సీనియర్‌ నాయకులే తమ నాయకుడిని డ్యామేజ్ చేయడంలో ముందు వరసలో చేరుతున్నారు. ప్రత్యర్ది పార్టీలకు కావల్సిన విమర్షనస్త్రాలు అందిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రత్యర్థిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. పంచ్‌లు, వ్యంగ్యాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వైసీపీ అధికార ప్రతినిధి పోస్టులో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నారు. పార్టీ విధానాల గురించి అన్నితెలిసిన నాయకుడైనా.. ఇటీవల కాపు సామాజికవర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. అంబటి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత. అయినప్పటికీ కాపుల గురించి ఆయన చేసిన కామెంట్స్‌ ఆ సామాజికవర్గంలో దుమారం రేపాయి.

నేర ప్రవృత్తి ఆర్థికంగా బలహీనవర్గాల్లో ఎక్కువగా ఉంటుందని, చైతన్యం ఉండబోదని అంబటి సెలవిచ్చారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి వెనుకబడిన వర్గాలపై ఇటువంటి అభిప్రాయాలు ఉండటం.,మళ్లీ వాటిని సమర్దించుకోవడంతో కాపు సామాజికవర్గం మరింత అసంతృప్తికి లోనైంది. వెంటనే క్షమాపణ చెప్పాలని.. లేకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు కాపు నేతలు. మంత్రి పదవి రేసులో ముందున్న అంబటి ఇలాంటి కీలకసమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీ అధినేత దగ్గర బుక్కయ్యారు. సీనియర్ నేతయిన అంబటి ముందు వెనుక చూసుకోకుండా చేసిన వ్యాఖ్యలు పార్టీని సైతం ఇబ్బందుల్లో నెట్టి ప్రత్యర్ది పార్టీలకు కొత్త అస్త్రాన్నిచ్చాయి.

వివాదాస్పద వ్యాఖ్యలతో ఏకంగా తమ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఇరుకున పెట్టారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి. పేదలకు ఇళ్ల పథకం కార్యక్రమం సమీక్షకు వచ్చిన గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారుల ముందే జగనన్న ఇళ్లు మంచం వేసుకోవటానికి కూడా సరిపోవన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు కూడా ఏ మాత్రం చాలవని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలకు మరింత ఉప్పు, కారం జోడించాలని అనుకున్నారో ఏమో.. కొత్త జంట శోభనానికి కూడా ఆ ఇల్లు సరిపోదన్నారు నల్లపురెడ్డి. ఆయన ఈ కామెంట్స్‌ చేయడంతో వెంటనే అందిపుచ్చుకున్న సీపీఐ నారాయణ మరింత వేడి రగిలించారు. ఇక ఇదే అలుసుగాతీసుకున్న టీడీపీ,బీజేపీ నేతలు మరింత రెచ్చిపోయారు. జగనన్న ఇళ్ల పై సొంత పార్టీ నేతలే ఇలా మాట్లాడుతున్నారని ఇరకాటంలో నెట్టారు.

ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుండటంతో వీరిపై గట్టిగానే ఫోకస్ పెట్టింది వైసీపీ అధిష్టానం. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు పథకాలపై మరే ఇతర అంశాలైనా ప్రభుత్వం నిర్వహించే అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించకుండా ఇలా నలుగురిలో మాట్లాడి నవ్వుల పాలు చేయడం పై సీఎం జగన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. కీలకమైన కాపు సామాజికవర్గం దూరమయ్యేలా ఒకరు..ప్రభుత్వ విధానాలను తప్పుపడతూ మరొకరు.. ఎమ్మెల్యేల హోదాలో చేసిన కామెంట్స్ ఈ ఇద్దరు నేతలకు కొత్త టెన్షన్ పెడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here