Home News Politics

చిత్తూరులో ఢీ అంటే ఢీ అంటున్న అభ్యర్ధులు వీరే…!

ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించినంత వేగంగా ప్రధాన రాజకీయ పార్టీల అధిష్ఠానాలు స్పందించడం లేదు. చాలా సీట్లకు ప్రధాన పార్టీల్లోనే అభ్యర్థుల ఎంపిక జరగ లేదు. చిత్తూరులో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ,జనసేన అభ్యర్ధుల కసరత్తు ఒక కొలిక్కి తెస్తున్నాయి. ఈ ప్రక్రియలో జనసేన మాత్రమ పూర్తిగా వెనబడింది. అధికార పార్టీలో ఆరు సీట్లు ఖరారైనా మిగిలినవి ప్రకటించలేదు.మూడు ఎంపీ సీట్లుండగా ఒక్క చోట కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు.వైసీపీ విషయానికొస్తే పది చోట్ల అభ్యర్థులు ఖరారైనా ఇంకా ప్రకటించలేదు. ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసినా రెండు చోట్ల స్పష్టత లేదు. ఇక కాంగ్రెస్‌, బీజేపీ పరిస్థితి మరింత అధ్వానంగా వుంది.

అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఎన్నికలు హఠాత్తుగా ముంచుకొచ్చేశాయి. అయితే ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదు. ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించినంత వేగంగా ప్రధాన రాజకీయ పార్టీల అధిష్ఠానాలు మాత్రం స్పందించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా శ్రేణులు, సామాన్య జనం కూడా అయోమయానికి లోనవుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పటి దాకా ఖరారైంది ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. కుప్పం నుంచీ అధినేత చంద్రబాబు పోటీచేస్తారనేది బహిరంగ రహస్యమే. అలాగే పలమనేరు నుంచీ మంత్రి అమరనాధరెడ్డి, పుంగనూరు నుంచీ ఆయన మరదలు అనీషారెడ్డి, పీలేరు నుంచీ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చంద్రగిరి నుంచీ పులివర్తి నాని, చిత్తూరు నుంచీ డీఏ సత్యప్రభ పోటీ చేయనున్నారు.

శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన సతీమణి బృందమ్మ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. అయితే గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంకా విజయవాడలోనే మకాం వేసి వుండడం చూస్తే అక్కడ కూడా టికెట్‌పై ఎవరికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదనేది అర్థమవుతోంది. తిరుపతి టికెట్‌పై కూడా అధిష్ఠానం ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణవైపు మొగ్గు వున్నట్టు చూచాయగా తెలిపినా పూర్తిస్థాయిలో సంకేతాలివ్వలేదు. తంబళ్ళపల్లె సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌ అధిష్ఠానం ముందు బలప్రదర్శన కూడా చేశారు. అయినా ఎలాంటి స్పష్టతా రాలేదు. మదనపల్లెలో టికెట్‌ ఎవరికిస్తారనే దానిపై అయోమయం రాజ్యమేలుతోంది.

సత్యవేడులోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తలారి ఆదిత్యకు, పూతలపట్టు ఇన్‌ఛార్జి లలితకుమారికి ఇంతవరకూ స్పష్టమైన సంకేతాలు అందలేదు. జీడీనెల్లూరులో హఠాత్తుగా మాజీ ఎమ్మ్లెల్యే ఆర్‌.గాంధీ వైసీపీ నుంచీ టీడీపీలో ప్రత్యక్షమయ్యారు. నేరుగా పార్టీ నేతలను కలసి తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. ఏం జరిగిందో అర్థం కాక శ్రేణులతో పాటు ప్రస్తుత ఇన్‌ఛార్జి హరికృష్ణ వర్గం అయోమయంలో పడ్డాయి. ఎంపీ స్థానాలకు వస్తే చిత్తూరు నుంచీ సిట్టింగ్‌ ఎంపీ శివప్రసాద్‌కు మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అన్నది తెలియడంలేదు. ఆయన అల్లుడికి కడప జిల్లా కోడూరు అసెంబ్లీ టికెట్‌ ఇస్తున్నందున ఇక్కడ ఈయన అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తిరుపతి, రాజంపేటల నుంచీ ఎవరు పోటీచేస్తారనేది శ్రేణుల ఊహకు కూడా అందడం లేదు.

ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అభ్యర్థుల విషయంలో కాస్తంత అడ్వాన్స్ గా వుంది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు నుంచీ చింతల రామచంద్రారెడ్డి, చంద్రగిరి నుంచీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరి నుంచీ రోజా, శ్రీకాళహస్తి నుంచీ బియ్యపు మధుసూదనరెడ్డి, చిత్తూరు నుంచీ జేఎంసీ శ్రీనివాసులు, తంబళ్ళపల్లె నుంచీ పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, కుప్పం నుంచీ చంద్రమౌళి, తిరుపతి నుంచీ భూమన కరుణాకరరెడ్డి, జీడీనెల్లూరు నుంచి కళత్తూరు నారాయణస్వామి పోటీ చేయడం ఖరారైపోయింది. ఏవైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తేనే తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, చిత్తూరు స్థానాల్లో మార్పులుంటాయి.లేదంటే ఇందులో ఎలాంటి మార్పులూ వుండకపోవచ్చు.

ఇక మిగిలిన పలమనేరు, పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లె స్థానాలపై మాత్రం స్పష్టత లేదు. మదనపల్లెలో మైనారిటీ అభ్యర్థి నవాజ్‌ పేరు ఖరారు చేసినప్పటికీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఇంకా త్రీవ ప్రయత్నాల్లోనే వున్నారు. అందువల్ల అక్కడ తుది నిర్ణయం ఎలా వుంటుందనేది వేచి చూడాలి. ఎంపీ స్థానాల విషయానికొస్తే రాజంపేట నుంచీ మిధున్‌రెడ్డి పోటీలో వుంటారనే దాంట్లో అనుమానం లేదు. అయితే తిరుపతిలో సిట్టింగ్‌కు మరో అవకాశం ఇచ్చే దిశగా ఎలాంటి సంకేతాలూ లేవు. చిత్తూరుకు తగిన అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది.

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఇటీవల రోడ్‌ షో సందర్భంగా పలమనేరుకు గజేంద్రను అభ్యర్థిని ప్రకటించారు. అది మినహా మిగిలిన 13 సెగ్మెంట్ల గురించి స్పష్టత ఇవ్వలేదు. కనీసం ఫలానా వారిని ఖరారు చేశారన్న సమాచారం కూడా శ్రేణులకు లేదు. తంబళ్ళపల్లెలో మలిపెద్ది ప్రభాకర్‌రెడ్డి, మదనపల్లెలో హచ్‌కుమార్‌లకు అవకాశం దక్కవచ్చు. లేదంటే చివరిక్షణంలో ఇతర ప్రధాన పార్టీల్లో టికెట్‌ దక్కనివారు వస్తే మార్పుచేర్పులుండచ్చు. కాంగ్రెస్‌ విషయానికొస్తే తిరుపతి నుంచీ ఎంపీగా చింతా మోహన్‌ పోటీ చేయడం దాదాపు ఖరారైపోయినట్టే.

రాజంపేట నుంచీ పోటీకి మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ పరంగా చంద్రగిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి పోటీ చేయనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అన్ని సెగ్మెంట్లకూ చాలామందే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఇంతవరకూ స్పష్టత లేదు. బీజేపీ గురించి చెప్పుకునేందుకు పెద్దగా ఏమీ లేదు. చల్లపల్లె నరసింహారెడ్డి మదనపల్లె, తంబళ్ళపల్లెల్లో ఎక్కడి నుంచీ అసెంబ్లీకి పోటీ చేస్తారో తెలియడం లేదు. అసలు పోటీ చేస్తారో లేదో కూడా అంతుబట్టని పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here