Home News Stories

టెస్టులందు కరోనా టెస్టు వేరయా..

మెగాస్టార్ చిరంజీవికి కరోనా అనగానే అంతా ఉలిక్కిపడ్డారు. ఏం చిరంజీవి మాత్రం మనిషి కాదా, ట్రంప్ కి, అమితాబ్ కే కరోనా వచ్చినప్పుడు చిరంజీవి ఏమన్నా అతీతుడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉలికిపాటుకు కారణం వేరే. కరోనా వచ్చిందనే ప్రకటనకు ముందు నాగార్జునతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిశారు చిరంజీవి. వరద బాధితులకు సాయం చెక్కు అందించటంతో పాటు, సినీ పరిశ్రమ గురించి చాలాసేపు చర్చించారు.

ఆ సందర్భంగా చాలామంది ముఖ్యులు ఉండటంతో అందరిమీదా వైరస్ ఎఫెక్ట్ ఉండొచ్చని ఆందోళనపడ్డారు. అయితే నాలుగురోజుల్లోనే తనకు కరోనా లేదని ప్రకటించారు మెగాస్టార్ చిరు. అదేంటీ…మూడు వారాల తర్వాత కూడా ఒంట్లో వైరస్ ఉందో, పోయిందో తెలిసేది…అప్పుడే అలా ఎలా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు చాలామంది. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవికి అసలు కరోనానే రాలేదు. లేని కరోనా ఉన్నట్టు టెస్ట్ రిపో్ర్ట్ మాత్రం వచ్చింది. దీంతో కరోనా టెస్టులపై ఉన్న అనుమానం మెగా అనుభవంతో మరోసారి బలపడింది.

తనకు ఎలాటి లక్షణాలు లేవని, అయినా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు చిరంజీవి. అయినా లోపల ఏదో డౌటు ఉండటంతో రెండు రోజులు వెయిట్ చేశారు. పాజిటివ్ వచ్చాక కూడా ఆయనలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవటంతో ఎందుకయినా మంచిదని మరోచోట టెస్ట్ చేయించారు. విచిత్రంగా అక్కడ నెగిటివ్ వచ్చింది. అయినా దాన్నే ఫైనల్ అనుకోకుండా…మరో రెండు చోట్ల కూడా కరోనా టెస్టులు చేయించారు మెగాస్టార్. అక్కడ కూడా నెగిటివ్ రావటంతో…ముందు వచ్చిన రిపోర్టు లోనే తేడా ఉందని అర్ధమైపోవటంతో…అసలు విషయం చెబుతూ అందరికీ ట్వీట్‌ చేశారు చిరంజీవి. కాలంతో పాటు కరోనా నాలుగురోజులు నన్ను కన్ ఫ్యూజ్ చేసి ఆడుకున్నాయంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. లేని కరోనా ఉన్నట్లు రిపోర్టు ఎందుకుకిచ్చారనే ప్రశ్నకు….తేడా కిట్ లోనే ఉందన్న సమాధానం వచ్చింది. అవును…మిషిన్ లోనే తేడా ఉన్నాక ఇక కరెక్ట్ రిపోర్ట్ ఎక్కడినుంచి వస్తుంది?! చిరంజీవికి కరోనా లేదని తేలటంతో ఫ్యాన్స్ హ్యాపీ.

ఈమధ్య కాలంలో ఆయన్ని కలిసిన, ఆయన వెళ్లి కలిసినవారంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతవరకు బానే ఉంది. అయితే చిరంజీవిలాంటి సెలబ్రిటీకే ఇలాంటి అనుభవం ఎదురయితే, డెయిలీ ఎంతమందికి ఇలాంటి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారోనన్న డౌట్ మొదలైంది.
కరోనా టెస్టింగ్ రిజల్టు మీద అనుమానాలు చిరంజీవికి ఎదురైన అనుభవంతో మొదలు కాలేదు. మొదట్నించీ ఉన్నాయి. గతంలో కూడా చాలామంది ఇలాగే పాజిటివ్ వచ్చి… ఎలాంటి లక్షణాలు లేకపోవటంతో మరోచోట రెండోసారి చెక్ చేయించుకుని కరోనా లేదని నిర్ధారించుకున్నారు. అయితే వారంతా సామాన్యులు కావటంతో ఆ చేదు అనుభవాలు బయటి ప్రపంచానికి బ్రేకింగ్ న్యూస్ లు కాలేకపోయాయంతే. కరోనా పేరెత్తితేనే ఇప్పటికీ ప్రజలు వణికిపోతున్నారు.

ఎందుకంటే ఒకరికొస్తే..వారి ద్వారా మిగిలినవారికి కూడా వ్యాపించే అవకాశం ఉన్న ప్రమాదకర వైరస్ ఇది. ఎన్నో కుటుంబాల్లో ఈ వైరస్ చిచ్చు పెట్టింది. అయినవాళ్లే అంటరానివాళ్లుగా చూసిన ఉదంతాలు ఎన్నో కళ్లెదుట ఉన్నాయి. వైరస్ సోకటంతో భయంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పాజిటివ్ వచ్చి ఇంటికి దూరంగా వారాల తరబడి అజ్ఙాతంలో బతికిన వారు కూడా ఉన్నారు. ఇలా కుటుంబాలను, మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న విస్ఫోటక వైరస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరీక్షల్లో అడుగడుగునా లోపాలే. ఇప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాని కరోనా నుంచి తమనుతాము కాపాడుకునేందుకు ప్రజలు ఏడ్నెల్లుగా మాస్కులేసుకుని తిరుగుతున్నారు. జేబుల్లో శానిటైజర్లు పెట్టుకుంటున్నారు. పక్కన ఎవరయినా తుమ్మినా, దగ్గినా భయపడుతున్నారు. దూరం దూరం జరుగుతున్నారు. పెద్దాచిన్నా తేడాలేకుండా అందరినీ కబళిస్తోంది కరోనా మహమ్మారి.
ముక్కు నుంచో, గొంతునుంచో శాంపిల్ తీసుకోవడం ద్వారా జరుగుతున్నాయి కరోనా పరీక్షలు.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువగా జరుగుతోంది ర్యాపిడ్ టెస్టులే. అయితే ర్యాపిడ్ టెస్టుతోనే వైరస్ ని పూర్తిగా నిర్ధారించుకోలేకమని ఈమధ్య డబ్ల్యుహెచ్ వో తో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా చావుకబురు చల్లగా చెప్పేశాయి. ఆర్టీపీసీఆర్ టెస్టే అంతిమం అంటున్నాయి. అయితే అందరికీ ఆ తరహా టెస్ట్ అందుబాటులో లేదనేది వాస్తవం. ఇక ఆథరైజ్డ్ ప్రైవేట్ ల్యాబులు ఆర్టీపీసీఆర్ కరోనాటెస్టుకు 2వేలదాకా వసూలు చేస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఆసుపత్రులు ముక్కుపిండి మూడు వేలదాకా బిల్లు చేస్తున్నాయి. సామాన్యుడు ఎవరయినా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓసారి టెస్టు చేయించుకోవడమే గొప్పన్నట్లున్నాయి సర్కారువారి సదుపాయాలు. నెగిటివ్ అంటే నెగిటివ్. పాజిటివ్ అంటే పాజిటివ్. క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలే నూటికి 95శాతంమందికి లేవు.అలాంటప్పుడు పరీక్షలు ఎంత పకడ్బందీగా జరగాలి? ఎంత కచ్చితత్వం ఉండాలి.? కానీ ఈ వ్యవహారం కంటితుడుపుగానే జరిగిపోతోంది. టెస్టు రిజల్టు వచ్చే లోపు… కరోనా లక్షణాలున్నవారి ద్వారా మరికొందరికి వైరస్ వ్యాపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అనుభవాన్నే దేశవ్యాప్తంగా చాలామంది ఎదుర్కున్నారు. ఇప్పటికీ ఎదుర్కుంటున్నారు.

ఆ మధ్య
ఎయిర్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలెట్లకు టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో అంతా ఆందోళనపడ్డారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా తమ పైలెట్లకు కరోనా రావడంతో అనుమానపడి.. మరోసారి కరోనా పరీక్షలు చేయించారు.అయితే రెండోసారి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. చివరికి కరోనా టెస్ట్ కిట్ లోపం వల్లనే ఐదుగురు పైలెట్లకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ప్రకటించాల్సి వచ్చింది ఎయిర్ ఇండియా. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరుపై అనుమానంతోనే ఆమధ్య రెండు రోజుల పాటు ఫలితాలివ్వకుండా ఆపేశారు.


కొత్త వైరస్. కొత్త తరహా పరీక్షలు నూటికి నూరుశాతం కచ్చితత్వం ఆశించడం అత్యాశే. అయితే అందుబాటులో ఉన్న సామగ్రితో ఎంతవరకు సిన్సియర్.గా పరీక్షలు చేస్తున్నారన్నదే పాయింట్. లెక్కకోసమో, తప్పదన్నట్లో పరీక్షలు చేస్తూపోతే ఫలితం ఉండదు. దీన్నో యజ్ఙంలా చేపట్టాలి. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతీ దశలో జాగ్రత్తపడాలి. అయితే ప్రభుత్వాల పరంగా చూస్తే కరోనా పరీక్షలు అంత పకడ్బందీగా జరగడం లేదనే చెప్పాలి. తెలంగాణలో ఇప్పుడు టెస్టులు పెరిగాయిగానీ రెండునెలల క్రితందాకా అరకొరగానేచేశారు. ఓదశలో దేశంలో జరుగుతున్నకరోనా టెస్టుల్లో తెలంగాణ శాతం కేవలం వన్ పాయింట్ ఫైవ్. తర్వాత టెస్టుల సంఖ్య పెరిగినా, అనుమానమొచ్చిన ప్రతీ ఒక్కరికీ వెంటనే టెస్టులు నిర్వహించే స్థాయిలోనైతే సదుపాయాలు మెరుగుపడలేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో టెస్టులు ఆశాజనకంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొరియా కిట్లు వాడుతున్నారు. వాటి పనితీరు సంతృప్తికరంగా ఉందంటున్నారు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అయినా నూటికి నూరుశాతం పర్ ఫెక్ట్ అని నమ్మలేం.

ఏ పుట్టలో ఏపాము ఉందో… ఏ కిట్టులో ఏ లోపం ఉందో ఎవరికి తెలుసు. మొత్తానికి చిరంజీవి ఇష్యూతో కరోనా పరీక్షలు మరోసారి బోనులో నిలబడ్డాయి. శాంపిల్ తీసుకున్నాం, రిపోర్ట్ ఇచ్చేశాం అనుకోకుండా…టెస్టుల వ్యవహారం నూటికి నూరుశాతం నిక్కచ్చిగా జరుగుతోందో లేదో..ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఫలితం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here