Home News Stories

చిలుకూరి బాలాజీ! భార‌తీయుల‌కు వ‌ర‌మా.. అమెరిక‌న్ల‌కు రుణ‌మా?

చిలుకూరి బాలాజీ! భార‌తీయుల‌కు వ‌ర‌మా.. అమెరిక‌న్ల‌కు రుణ‌మా?


త్వ‌ర‌లో చిలుకూరు బాలాజీ బిజినెస్ మొత్తం ప‌డిపోతుందా? వీసాల వెంక‌టేశ్వ‌రుడిగా పేరున్న‌ ఈ దేవుడి వ్యాపారం మొత్తం ట్రంప్ ఖాతాలో క‌లిసిపోతుందా? ఇక నుంచి ఈ దేవుడ్ని చూడ్డానికి వ‌చ్చే వాళ్ల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతుందా? అంటే అవున‌నే చెప్పాలి. కార‌ణం అమెరికాలో హెచ్ వ‌న్ బీ వీసాల మీద జ‌రుగుతున్న దాడులు మాములుగా లేవు. ఇన్నాళ్ల పాటూ మ‌న‌మంతా ట్రంప్ వ‌ల్లే ఈ గొడ‌వ జ‌రుగుతోంద‌ని భావిస్తున్నామా? అలాక్కాద‌ట‌.. రిప‌బ్లిక‌న్లు, డెమొక్రాట్లు తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ భారతీయులు త‌మ ఉద్యోగాల‌ను ఎగ‌రేసుకుపోతున్నార‌ని వాపోతున్నార‌ట‌.

హెచ్ వ‌న్ బీ వీసాల‌తో వ‌చ్చే వాళ్లంతా మ‌న ఉద్యోగాల‌ను మింగేస్తున్నారు. వీళ్ల‌కు క‌ళ్లెం వేయాల్సిందేనంటూ అమెరికా సెనెట్ ప్ర‌తినిధుల స‌భ‌ల్లోని మెజార్టీ స‌భ్యుల అభిప్రాయం. ఒక‌టి కాదు రెండు కాదు ఉభ‌య స‌భ‌ల్లో వీసాల‌కు వ్య‌తిరేకంగా ఆరు బిల్లులు ప్ర‌వేశ‌పెట్టారంటే సీనేంటో తెలుస్తోంది. రిప‌బ్లిక‌న్ సెనెట‌ర్ చుక్ గ్రాస్ లీ అసిస్టెంట్ సెనెట్ మైనార్టీ లీడ్ డిక్ డ‌ర్బిన్ మొద‌టి సారి హెచ్ వ‌న్ బీ, ఎల్ వ‌న్ వీసాల సంస్క‌ర‌ణ‌ల చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టార‌ట‌.

ఉద్యోగాల్లో అమెరిక‌న్ల‌కే ప్రాధాన్య‌త‌నివ్వాల‌న్న‌ది ఇందులోని సారాంశం. అంతే కాదు లాట‌రీ ప‌ద్ధ‌తి మార్చేయాల‌నీ అమెరికాలో చ‌దువుకున్న వాళ్లకే ఉద్యోగాలివ్వాల‌న్న ప్ర‌తిపాద‌న సైతం చేశారు. యాభై కంటే ఎక్కువ ఉద్యోగులుండి.. వాళ్ల‌లో స‌గం హెచ్ వ‌న్ బీ, లేదా ఎల్ వ‌న్ వీసాదారులున్న కంపెనీలు అద‌నంగా విదేశీయుల‌ను నియ‌మించుకోరాద‌ని కూడా ప్ర‌తిపాదించారు. తాత్కాలిక శిక్ష‌ణ‌కు హెచ్ వ‌న్ బీ, ఎల్ వ‌న్ వీసాదారుల‌ను ర‌ప్పించే ఔట్ సోర్సింగ్ కంపెనీల‌పై గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా కోరారు.

ఒక అమెరిక‌న్ ఉద్యోగిని ప‌క్క‌న పెట్టి ఆ స్థానంలో విదేశీయుల‌ను నియ‌మించుకోరాద‌ని అంద‌రూ ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు. అమెరికాలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రిస్తూ త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను పొందుప‌రుస్తున్నారు. కాంగ్రెస్ లో సిలికాన్ వ్యాలీకి సంబంధించి డెమొక్రాటిక్ నేత జో ల‌ఫ్రోజెన్ కూడా ఓ బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. హెచ్ వ‌న్ బీ వీసాల‌పై వ‌చ్చే వాళ్ల‌కు క‌నీస వార్షిక‌ జీతం రెట్టింపు చేసి ల‌క్షా ముప్పై వేల డాల‌ర్కు పెంచాల‌ని కోరారు. హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్ నెస్ యాక్ట్ పేరిట ఈ బిల్లు ప్ర‌వేశ‌పెట్టింది ఈయ‌నే.

ఒక్కోదేశానికి ఇన్నేసి చొప్పున కోటా పెట్ట‌కుండా ముందు ఎవ‌రు కోరితే వాళ్ల‌కు ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ వీసాలు జారీ చేయాల‌న్న‌ది ఒక ప్ర‌తిపాద‌న‌. సెనెట‌ర్లు షెరాడ్ బ్రైన్, జో డాన్ లీ, క్రిస్టెన్ గిల్లీ బ్రాండ్ క‌లిసి ఔట్ సోర్సింగ్ కు తెర దించాల‌ని మ‌రో బిల్లు ప్ర‌తిపాదించారు. అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలిచ్చే కంపెనీల‌కే ప్ర‌భుత్వ ప‌నుల‌ను అప్ప‌గించాల‌న్న‌ది ఈ బిల్లు సారాంశం. రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన టామ్ కాట‌న్, డేవిడ్ ప‌ర్వ్యూలు మొత్తంగా ప‌దేళ్ల‌పాటు అమెరికాలో వ‌ల‌స‌ల‌కు క‌త్తెర వేయాలంటూ బిల్లు తీసుకొచ్చారు. ఇటీవ‌ల భార‌త సంత‌తికి చెందిన కాంగ్రెస్ స‌భ్యుడు ఖ‌న్నా మ‌రో ముగ్గురితో క‌లిసి.. హెచ్ వ‌న్ బీ, ఎల్ వ‌న్ వీసాల‌పై స‌మ‌గ్ర స‌వ‌ర‌ణలు తీసుకురావాల‌ని స్పెష‌ల్ బిల్లు తీసుకొచ్చారు.

వ‌ల‌స విధానాన్ని సంపూర్ణంగా మార్చాల‌ని ట్రంప్ ప్ర‌భుత్వం భావిస్తున్న ఈ స‌మ‌యంలో ఈ బిల్లుల‌కు విశేష ప్రాధాన్య‌త సంత‌రించుకుంటోంది. ఇది వ‌ల‌స‌వాదుల్లో ముఖ్యంగా భార‌తీయుల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా హెచ్ వ‌న్ బీల‌తో వ‌చ్చి గ్రీన్ కార్డు పొంద‌డానికి సంబంధించి రిప‌బ్లిక‌న్ సెనెట‌ర్ టామ్ కాట‌న్ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న‌లు చేశారు. వ‌ల‌స‌దారుల్లో పీహెచ్డీ, కంప్యూట‌ర్ సైంటిస్టుల‌ను మాత్ర‌మే తాము కోరుతున్నామ‌నీ.. మిడిల్ లెవ‌ల్ ఉద్యోగులెవ‌రూ త‌మ‌కు అక్క‌ర్లేద‌న్న‌ది ఈ ప్ర‌తిపాద‌న ప్ర‌ధానోద్దేశం.

దీన్నిబ‌ట్టీ చెప్పండీ! వీసాల వెంక‌టేశ్వ‌రుడి క్రేజ్ అమాంతం ప‌డిపోయే ప‌రిస్థితి ఉందా లేదా? ప్ర‌స్తుతం వీసాలు ఆశించి అమెరికాలో సెటిల‌వ్వాల‌నుకుంటున్న వాళ్లంతా.. చిలుకూరి బాలాజీ మీదే భార‌మేసి బ‌తుకుతున్నారు. ఇప్పుడీ బిల్లుల‌న్నీ పాస‌వ్వ‌కుండా చూడాల్సిన బాధ్య‌త బాలాజీదే. ఏమంటారు చిలుకూరు స్వామీ.. నీ భ‌క్తుల‌కు అభ‌య‌మిస్తావా? లేక నువ్వు కూడా అమెరికాలో స‌గ‌టు అమెరిక‌న్ ఉద్యోగికి మ‌ద్ధ‌తుగా నిలుస్తావా? భార‌తీయుల‌కు వ‌ర‌మా.. అమెరిక‌న్ల‌కు క‌రుణ‌మా? మీరే తేల్చుకోవాలి దేవా! అంటూ ప‌డి ప‌డీ మొక్కేస్తున్నారు ఇక్క‌డి భ‌క్తులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here