Home News Politics

హీరా మే కుఛ్ కాలా హై!

ఎంఈపీ..టిక్కెట్స్ ఫ‌ర్ సేల్‌?

వ‌జ్రం మెరుస్తుంది. చిమ్మ‌చీక‌ట్లోన‌నైనా కాంతులీనుతుంది. నేల‌కేసి విసిరికొట్టినా చెక్కుచెద‌ర‌నంత దృఢంగా ఉంటుంది. కానీ ఆ వ‌జ్రం మాత్రం అప్పుడే క‌ళ త‌ప్పింది. ఒరిజ‌న‌లా? డూప్లికేటా?? అన్న అనుమానాల‌కు తావిస్తోంది. మ‌నం చెప్పుకుంటోంది వ‌జ్రాన్నే త‌న పార్టీ గుర్తుగా ప్ర‌క‌టించుకుని అన్న‌ప్రాస‌న‌నాడే ఆవ‌కాయ తినాల‌ని ఆరాట‌ప‌డ్డ పార్టీగురించి. ప్ర‌చారప‌టాటోపంతో నేల‌విడిచి సాము చేయాల‌నుకున్న ఓ కొత్త జెండా గురించి. ఓ మ‌హిళే ముందుకొచ్చి పార్టీ అద్భుతాలు సృష్టిస్తుంద‌ని ఆశ‌ప‌డ్డ ఎంద‌రో మ‌హిళ‌ల‌కు తాను కూడా ఆ తాను ముక్క‌నేన‌ని అనుమానాలు క‌లిగించేలా అప్పుడే అప‌నింద‌లు ఎదుర్కుంటూ ఆప‌సోపాలు ప‌డుతున్న ఎంఈపీ గురించి.

పేరులోనే మ‌హిళా సాధికారిక‌త‌. మ‌హిళా ఎంప‌వ‌ర్‌మెంట్ పార్టీ. డ‌క్కామొక్కీలు తిన్న‌వాళ్లే సొంత జెండాని రెప‌రెప‌లాడించ‌లేక ఎజెండాలు మార్చేసుకుని ఏదో ఒక పార్టీ పంచ‌న చేరుతున్న ఈరోజుల్లో…ఓ మ‌హిళ, అందులోనూ వ్యాపార‌రంగంలో రాణించిన మ‌హిళ ఓ కొత్త జెండా ప‌ట్టుకునేస‌రికి అంద‌రిలో ఆస‌క్తి. ఆమె పార్టీ నిజంగానే చీక‌ట్లో చిరుదివ్వె అవుతుందేమోన‌ని కొంద‌రిలో ఏదో మూల ఓ చిన్న ఆశ‌. హైద‌రాబాద్‌లో పుట్టిన పార్టీ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో హ‌డావుడి చేసేస‌రికి ఏద‌న్నా అద్భుతం జ‌రుగుతుందేమోన‌ని ఆస‌క్తిగా చూశారంతా. అలాంటివేం లేక‌పోగా టికెట్లు అమ్ముకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో జ‌నం ముందు దోషిలా నిలుచుంది ఎంఈపీ వ్య‌వ‌స్థాప‌కురాలు, హీరా గ్రూప్ అధినేత నౌహారా షేక్‌.

మ‌హిళ‌ల సాధికారిత‌కోస‌మంటూ పార్టీ పెట్టిందే పోయినేడాది న‌వంబ‌రులో. మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల్ని ఎత్తుకుంటే గ‌ల్లీనుంచి ఢిల్లీదాకా కావాల్సినంత చోటుంది. చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నిస్తే జాతీయ‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవ‌కాశం ఉంది. కానీ అస‌లుకంటే కొస‌రెక్కువైన‌ట్లు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది మ‌హిళా ఎంప‌వ‌ర్‌మెంట్ పార్టీ. ఇంకా పునాదులే స‌రిగాప‌డ‌ని కొత్త పార్టీ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అన్ని సీట్ల‌లో పోటీచేస్తానంటూ హ‌డావుడి చేసింది. 212 నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలాచోట్ల ఆ పార్టీ పేరు చెప్పి టిక్కెట్ల‌కోసం బేర‌సారాలు జ‌రిగిన విష‌యం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. దీంతో ఎంఈపీ వ్య‌వ‌స్థాప‌కురాలు నౌహారా షేక్‌పై కంప్ల‌యింట్లు మొద‌ల‌య్యాయి. గ‌తంలోనూ ఇలాంటి చీటింగ్ కేసులు న‌మోదైన విష‌యం ఇప్పుడు బ‌య‌టికొస్తోంది.

టికెట్లు ఇస్తామ‌ని డ‌బ్బులు తీసుకున్నార‌ని, న‌మ్మించి మోస‌గించార‌ని బెంగ‌ళూరులో కేసులు న‌మోదు కావ‌టంతో క‌ర్ణాట‌క నుంచి ప్ర‌త్యేక పోలీసు బృందం హైద‌రాబాద్‌కొచ్చి నౌహారాషేక్‌ని విచారించింది. ఎవ‌రికో ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు, ఓట్లు చీల్చేందుకే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఎంఈపీ పోటీకి దిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌కు ఈ ఫిర్యాదులు తోడ‌య్యాయి. ఇప్ప‌టిదాకా సెల‌బ్రిటీల్ని ముందుపెట్టి హ‌డావుడి చేసిన నౌహారా షేక్ రాజ‌కీయాన్ని కూడా లాభ‌సాటి వ్యాపారంగా భావిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. ఓ ప్ర‌ముఖ సంస్థ సీఈవోగా ఆర్థికంగా ఏ లోటూ లేక‌పోయినా టికెట్లు అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఆమె పార్టీ లేవ‌కుండానే చ‌తికిల‌ప‌డేలా ఉంది.

సినీ ప్ర‌ముఖుల‌తో ప్ర‌చారం చేసినంత మాత్రాన జ‌నం గుడ్డిగా న‌మ్మేసే రోజులు కావివి. ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల‌తో కొన్ని కార్య‌క్ర‌మాల్లో హ‌డావుడి చేయ‌గానే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వ‌స్తాయ‌నుకుంటే పొర‌పాటు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించ‌కూడ‌దు. పార్టీ పేరులో మ‌హిళా సాధికారిత‌ను ప్ర‌క‌టించుకుంటే స‌రిపోదు. మేథాపాట్క‌ర్ వెనుక ఏ పార్టీ ఉంద‌ని ఆమెకింత గుర్తింపు? మ‌న ప్ర‌య‌త్నంలో చిత్త‌శుద్ధి లేక‌పోతే ర‌థ‌మెక్కి ఊరేగినా జ‌నం న‌మ్మ‌రుగాక న‌మ్మ‌రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here