Home News Politics

చంద్ర‌బాబు..ఆప‌రేష‌న్ గ‌జ‌గ‌జ‌!

ఏపీ సీఎం అడ్డంగా దొరికారా?

ఆప‌రేష‌న్ గ‌రుడ సంగ‌తేమోగానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం గ‌జ‌గ‌జా వ‌ణికిపోతున్నారు. మోడీతో త‌ల‌ప‌డ్డ మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రిని తానేన‌ని జ‌నంలో డ‌బ్బా మోత మోగిస్తున్నా, నిప్పులా బ‌తికాన‌నీ..ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని ఆయ‌న ఎంత మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా అంత‌ర్లీనంగా ఆయ‌న మాట‌ల్లోనే అభ‌ద్ర‌తాభావం క‌నిపిస్తోంది. ఏ త‌ప్పూ చేయ‌న‌ప్పుడు ఆందోళ‌నెందుకు? మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ్యానికి యువ‌రాజైన ఆయ‌న కుమారులుంగారు.. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న తెలుగుతో చెల‌రేగిపోతున్నారు. ఈ భూగోళంలోనే ఏటా స్వ‌చ్ఛందంగా ఆస్తులు ప్ర‌క‌టించే కుటుంబం వ‌న్ అండ్ ఓన్లీ నారావారేన‌ని ట‌ముకేస్తున్నారు. ఎరీగుడ్‌..నిప్పుకు చెద ప‌ట్ట‌ద‌న్న‌ది ఎంత వాస్త‌వ‌మో, అర‌చేతిలో నిప్పును దాచ‌లేమ‌న్న‌ద‌ని కూడా అంతే క‌ఠోర వాస్త‌వం. జ‌బ్బ‌లు చ‌రుచుకునేముందు ఏ బాబ‌యినా ఆ విష‌యాన్ని గ్ర‌హించాల్సి ఉంది.

ఎన్డీఏకి గుడ్‌బై చెప్పిన మ‌రుక్ష‌ణ‌మే కేంద్రం-కుట్ర స‌బ్జెక్ట్‌ని జ‌నం మ‌ర్చిపోకుండా రోజూ గుర్తుచేస్తూనే ఉన్నారు టీడీపీ నేత‌లు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత వేధింపులు మొద‌ల‌వుతాయ‌ని చంద్ర‌బాబే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. క‌ర్ణాట‌కలో బీజేపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో కుట్ర వేడి కాస్త త‌గ్గింద‌ని ప‌చ్చ‌చొక్కాల విశ్లేష‌ణ‌. ఏ విష‌యంలో త‌మ జుట్టు కేంద్రం చేతికి చిక్కుతుందోన‌ని టెన్ష‌న్ ప‌డుతున్న చంద్ర‌బాబు…ఎయిర్ ఏషియా వ్య‌వ‌హారంలో త‌న పేరొస్తుంద‌ని ఏమాత్రం ఊహించ‌లేక‌పోయారు. విమాన‌యాన‌సంస్థ‌కు సంబంధించిన లావాదేవీల్లో చంద్ర‌బాబు జోక్యం ఎందుకుంటుంద‌న్న అనుమానానికి తావులేకుండా…మొన్న‌టిదాకా ఆ శాఖ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు చూసిన అశోక‌గ‌జ‌ప‌తి రాజు పేరు కూడా వినిపిస్తోంది.

విమాన‌యాన‌శాఖ నిబంధ‌న‌ల్లో మార్పుల‌కోసం ఎయిర్ ఏషియా ముడుపులు ఇచ్చింద‌నేది ఆరోప‌ణ‌. టీడీపీ ఎంపీ అశోక‌జ‌గ‌జ‌ప‌తి రాజు ఆ శాఖ మంత్రిగా ఉండ‌గానే ఇది జ‌రిగింద‌నేది సీబీఐ అనుమానం. ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్‌ని ప్ర‌శ్నించిన సీబీఐ కొన్ని ర‌హ‌స్యాలు రాబ‌ట్టింద‌నీ…అందులో చంద్ర‌బాబు మ‌ధ్య‌వ‌ర్తిత్వంపైనా కొన్ని ఆధారాలు దొరికాయ‌న్న‌ది ఆరోప‌ణ‌. ఓ ఇన్వెస్ట‌ర్‌తో ఎయిర్ ఏషియా సీఈవో చందుచాండ‌ల్య సంభాష‌ణ‌ల్లో ఏపీ సీఎం ప్ర‌స్తావ‌న రావ‌డంపై సీబీఐ ఆరాతీస్తోంది. అశోక‌గ‌జ‌ప‌తి త‌న‌కు బాగా ద‌గ్గ‌ర‌నీ…చంద్ర‌బాబు మంచీచెడూ చూసుకుంటే ప‌నుల‌న్నీ జ‌రిగిపోతాయ‌ని చాండ‌ల్య చేసిన వ్యాఖ్య‌లు టేపుకెక్కాయంటున్నారు.

అయితే ఎయిర్ ఏసియా విష‌యంలో మా వాళ్లు బ్రీఫ్డ్ మీ..లా చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్ష జోక్యం లేదు. వివాద‌ర‌హితుడిగా పేరున్న అశోక‌గ‌జ‌ప‌తి రాజు నేరుగా ఇన్వాల్వ్ అయ్యిందీ లేదు. అయితే క్విడ్‌ప్రోకో వ్య‌వ‌హారం జ‌రిగింద‌నే అనుమానంతో ప్ర‌శ్నించే అవ‌కాశం సీబీఐకి ఉంది. అయితే అంత‌దూరం వెళ్తుందా..లేకుంటే చంద్ర‌బాబుకో ఝ‌ల‌క్ ఇచ్చి కొన్నాళ్లు మ‌న‌శ్శాంతి లేకుండా చేయ‌డ‌మైతే ఖాయంగా క‌నిపిస్తోంది. ల‌క్ష‌కోట్లు తిన్నాడ‌ని జ‌గ‌న్‌మీద బాబు అండ్ కో చేస్తున్న ఆరోప‌ణ‌లు కూడా ఇదే బాప‌తు. ఎక్క‌డా జ‌గ‌న్ ప్ర‌త్య‌క్ష ప్ర‌మేయం లేదు. త‌న తండ్రి పేరు అడ్డుపెట్టుకుని క్విడ్‌ప్రోకోతో సంపాదించార‌న్న‌దే వైసీపీ అధినేత‌మీదున్న అభియోగం. అలాంట‌ప్పుడు ఎయిర్ ఏషియా వ్య‌వ‌హారాన్నీ తేలిగ్గా కొట్టిపారేయ‌లేం. పైగా నిప్పులేందే పొగ‌రాదంటారు. ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here