కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు తయారైంది టీడీపీ ఆవిర్భావం పరిస్థితి. ఎన్టీఆర్ కి పార్టీ పెట్టమని సూచించింది తానేనంటాడు బాబు. అంతే కాదు వ్యవస్థను మార్చడం తనొక్కడి వల్లే కాదు.. కాబట్టి మీలాంటి వాళ్లు పార్టీ పెట్టండని నూటికి నూరు పాళ్లు సూచించింది తానే అన్నది బాబుగారి మాట.
ఎంతైనా ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనేం చెబితే అది విని రాసుకోవల్సిన అవసరం విలేఖరులది. దీంతో బాబన్న చెప్పింది వేదమని ఎవరికి వాళ్లు తల అడ్డంగా ఊపలేక నిలువునా ఊపలేక మింగలేక కక్కలేక నానా అవస్థలు.
బాబుకీ తెలుగదేశం ఆవిర్భావానికీ అసలు సంబంధమేలేదంటారు కొందరు. అడిగేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి.. దానికి తోడు ప్రస్తుతం పార్టీ తన గుప్పెట్లో ఉంది కాబట్టి.. దీనంతటికీ కారణం తానేనంటూ ఒక కలరింగిచ్చేస్తే అలా పడుంటుంది లెమ్మన్నది ఒక ఆలోచన. తన అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని తానేదో ఒకటి అనడం వాళ్లు రాయడం వల్ల చరిత్ర స్థిరమై పోతుందన్నది ఒక ఐడియా.. అంతే తప్ప ఇందులో నిజం లేదంటారు కొందరు.
గతంలో కూడా సరిగ్గా బాబు ఇలాగే తన అనుకూల మీడియాలో రాయించినప్పుడు.. చరిత్ర వక్రీకరణ అంటే ఇదే.. అసలానాడు ఏం జరిగిందంటే అంటూ సాక్షి తదితర వార్తా సంస్థలు రాయాల్సి వచ్చింది. పదే పదే ఒక అబద్ధం చెబుతూ పోతుంటే ఒక సారి కాకున్నా ఒకసారికి నిజమై తీరుతుందన్న ఉద్దేశం బాబుగారిది.
దీంతో ఛాన్సు దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ కి పార్టీ పెట్టమని సూచించింది తానేనని చెప్పుకుంటారని అంటారు కొందరు. నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులోనూ ఇదే పాటందుకున్నారు బాబు.
బాబుగారి మాటలను ఎందుకు నమ్మరాదంటే.. కంప్యూటర్ని కనిపెట్టింది తానేననీ.. సత్యానాదెళ్లను సీఈఓ చేసింది తానేననీ.. హైదరాబాద్ నగరానికిక నావల్లే అంతర్జాతీయ ఖ్యాతనీ అదనీ ఇదనీ చెబుతుంటారు. తనకే మాత్రం సంబంధం లేకున్నా అన్నీ తానే చేసినట్టు చెబుతుంటారు. కాబట్టి బాబు మాటలను అంతగా సీరియస్ గా తీసుకోరాదన్నది కొందరి సలహా.
అయితే ఇదే సమావేశంలో బాబుగారో బంగారం లాంటి మాట అన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే పార్టీ ఆరోగ్యంగా ఉంటుందని.. అందుకే ఆరోగ్య నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తాననీ.. తన భార్య చేతిలో తన హెల్త్ రిమోట్ ఉంటుందనీ సెలవిచ్చారు. ఈ మాట మాత్రం నిజమే. బాబు తర్వాత టీడీపీని కాపాడేవాళ్లు లేరు. అక్కడెలాగూ సెకెండ్ స్టేజ్ లేదు. కాబట్టి ఇందులోని నిజాన్ని మాత్రం నమ్మక తప్పదని అంటున్నారు మరికొందరు.
అందుకే కావచ్చు.. లోకేష్ బాబును అర్జెంట్ గా ఎమ్మెల్సీ చేసి.. ఏప్రిల్ రెండున జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఎమర్జెంట్ గా మంత్రిని చేస్తున్నారు. ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తే కదా? ఎప్పటికో లోకేష్ తన బాబులా తర్ఫీదయ్యేది. సో సరికొత్త ట్రైనింగ్ ప్రొగ్రాం మొదలైందన్నమాట. ఏవుందీ లోకేష్ సైతం నాన్నగారు చెప్పినట్టు.. ప్రతిదానికీ తానే కారణమంటే బాబుకే బాబులా మారవచ్చని సెటైర్ వేస్తున్నారు మరికొందరు.