Home News Stories

దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న కూటమి…..

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను మరోసారి నిజం చేస్తూ.. సరికొత్త కూటమి తెరపైకి రాబోతోంది. దేశ భవిష్యత్తు కోసమంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే రాహుల్‌ని కలిశా అంటున్నచంద్రబాబు ఏం చేస్తున్నారు? ఈ కొత్త కూటమి ప్రభావమెంత…?

దేశ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.. చంద్రబాబు నాయుడు డిల్లీ టూర్లు, అక్కడ ప్రాంతీయ పార్టీల నేతల్ని ఒక్కొక్కరుగా కలవడం, ఆపై ఏఐసీపీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమవ్వడం, ఇద్దరూ గంటకు పైగా దేశ రాజకీయాల గురించి, కొత్త పొత్తుల గురించి, భవిష్యత్‌ కార్యచరణ గురించి చర్చించుకోవడం… ఇలా వరుస పెట్టి చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఎలా ఉండబోతోందన్నదే అటు రాజకీయ పార్టీలు, ఇటు మీడియా సంస్థలను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అసలేం జరుగుతోంది… దశాబ్దాల వైరాన్ని పక్కన బెట్టి టీడీపీ అధినేత… కాంగ్రెస్‌ అధినేతతో భేటీ అయ్యాక దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నదే సర్వత్రా ఆసక్తి కరంగా మారింది.

వారం రోజులు వ్యవధిలో రెండుసార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. అప్పుడే ఈ టూర్లు రాజకీయంగా సంచలనంగా మారుతాయని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. నాలుగు రోజులు కిందటే ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడు… జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ను, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కెజ్రీవాల్‌ను, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా పలువురు జాతీయ నేతల్ని కలసి వచ్చారు. మళ్లీ వారం తిరక్కుండానే ఢిల్లీ వెళ్లి, జాతీయ నేతలు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లాను కలసి వచ్చారు. ఆపై జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. ఇలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు. దేశ రాజకీయాలు చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ సమావేశాలన్నది చంద్రబాబు చెప్తున్న మాట.

రాజకీయాల్లో వర్తమానం, భవిష్యత్తులే కీలకమని. గతాన్ని పట్టించుకోకూడదని, దేశంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించడానికే తాము టీడీపీ అధినేతతో భేటీ అయ్యామన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. బీజేపీ పాలనలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ, గవర్నర్లు, సుప్రీం కోర్టు సహా వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. ఇక్కడ ఇద్దరి విమర్శలు కేంద్ర ప్రభుత్వ వైఖరి మీదే అయినా.. ఆలోచనలు, అడుగులు మాత్రం కేంద్ర రాజకీయాల్లో కొత్త కూటమి దిశగా సాగుతున్నాయన్నది నిర్వివాదాంశం. గత కొన్నాళ్లుగా కేంద్రంపై పోరాడుతున్న చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీ యేతర పార్టీలన్నింటినీ ఏకం చేసి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. తన ప్రయత్నాలు పదవి కోసం కాదని, దేశం కోసమని చెప్పుకొచ్చిన చంద్రబాబు, యాంటీ బీజేపీ పార్టీలన్నింటితో జాతీయస్థాయిలో ఓ కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఈ విషయంలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఏకీభవించాయి. దేశంలో పరిస్థితి దిగజారుతోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేంద్రాన్ని విమర్శించారు. దేశాన్ని రక్షించడానికే తాము కూటమిగా ఏర్పడుతున్నామన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా కూడా… ఈ కూటమిలో కీలక భూమిక పోషించనున్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకూ కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రమే రెండు వర్గాలుగా ఉంటూ.. మిగిలిన ప్రాంతీయ పార్టీలతో చాలా కూటములు ఏర్పడ్డాయి. నాలుగున్నరేళ్ల కిందట మోడీ పీఠమెక్కిన తర్వాత.. కూడా జనతా పరివార్ పేరుతో ఉత్తరాది పార్టీలన్నీ మోడీ వ్యతిరేక ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. కానీ మోడీ ప్రభావంతో ఆ కూటమి ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రాంతీయ పార్టీలన్నింటిలోనూ మోడీ మీద వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకతను ఏకం చేసేందుకు జాతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.

మొత్తంగా సమీప భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కొత్త కూటమి సంచలనంగా మారబోతోందన్నమాట. ఇన్నాళ్లూ మోడీ వ్యతిరేక కూటములు, యాంటీ బీజేపీ కూటములు తెరపైకి వచ్చినా నిలబడలేకపోయాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో రూపు దిద్దుకోబోతున్న ఈ కొత్త కూటమి మాత్రం రాబోయే ఎన్నికల్లో దేశ^వ్యాప్తంగా కీలక భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here