Home News Politics

శ‌ల్య సార‌ధ్యానికి శీల‌ప‌రీక్ష‌!

ప్ర‌మాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తారా?

ఫెడ‌రల్ ఫ్రంట్‌. కేసీఆర్ మ‌దిలో పుట్టిన గొప్ప ఆలోచ‌న‌. ఆలోచ‌న త‌ట్టిందే త‌డ‌వుగా ప‌శ్చిమబెంగాల్‌కి వెళ్లి మ‌మ‌తాబెన‌ర్జీని క‌లుసుకున్నారు. క‌రుణానిధితో పాటు ఆయ‌న కొడుకు స్టాలిన్‌ని క‌లుసుకున్నారు. ఆ మ‌ధ్య‌లో క‌ర్నాట‌క ప్ర‌చారం వేడెక్కుతున్న స‌మ‌యంలో దేవ‌గౌడ అండ్ స‌న్స్‌తో సిటింగేశారు. యూపీనుంచి ఏకంగా స‌మాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌యాద‌వ్ వ‌చ్చి వెళ్లారు. అయితే కేసీఆర్ చెప్పే ఫెడ‌రల్ ఫ్రంట్ బీజేపీ-కాంగ్రెస్‌ల‌కు ప్ర‌త్యామ్నాయ‌మ‌ని. కానీ ఈదేశంలో ఇప్పుడు విప‌క్ష పార్టీల‌న్నీ కోరుకుంటోంది బీజేపీని దూరం పెడితే చాల‌ని. కేసీఆర్ కేవ‌లం కాంగ్రెస్‌మీదే విమ‌ర్శ‌లుచేస్తే .. అఖిలేష్ ఆయ‌న స‌మ‌క్షంలోనే బీజేపీని టార్గెట్ చేసుకున్నారు.

ఓప‌క్క దేశంలో బీజేపీయేత‌ర రాజ‌కీయ‌ప‌క్షాల‌న్నీ ఒకే గొడుగుకిందికి చేరాల‌న్న మూడ్‌లో ఉన్నాయి. మొన్న యూపీ ఉప ఎన్నిక‌ల్లో నిప్పుఉప్ప‌నుకున్న స‌మాజ్‌వాదీ, బ‌హుజ‌న‌స‌మాజ్ పార్టీలు క‌లిసి పోటీచేశాయి. మ‌మ‌తా, మాయావ‌తి, శ‌ర‌ద్‌ప‌వార్‌, శ‌ర‌ద్‌యాద‌వ్‌, వామ‌ప‌క్ష‌పార్టీలు అన్నీ కాంగ్రెస్ ఆలోచ‌న‌కు అనుగుణంగా యాంటీ బీజేపీ స్ట్రాట‌జీతో క‌దులుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కేసీఆర్ మ‌దిలో పుట్టిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది ప‌జిల్‌గా మారింది. దీనికితోడు త‌న ఫ్రంట్ రాజ‌కీయాల‌కోసం కాద‌నీ, దేశంలో గుణాత్మ‌క మార్పుకోస‌మ‌నీ సామాన్యులెవ‌రికీ ఓ ప‌ట్టాన అర్ధంకాని టార్గెట్ చెప్పుకొచ్చారు గులాబీ బాస్‌.

అంతా బాగానే ఉందికానీ బీజేపీ-కాంగ్రెస్‌ల‌కు వ్య‌తిరేకంగా స‌రికొత్త రాజ‌కీయం కావాలంటే దేశంలో విప‌క్షాల మ‌న‌సెరిగి న‌డుచుకోవాలి. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు చేసే కార్య‌క్ర‌మాల‌కు నైతికంగా మ‌ద్ద‌తివ్వాలి. అప్పుడే కేసీఆర్ ఆలోచ‌న‌కో నిబ‌ద్ధ‌త ఉంద‌ని న‌మ్ముతారు. ఈమ‌ధ్య 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల‌ను వ్య‌తిరేకిస్తూ తిరువ‌నంత‌పురంలో నిర్వ‌హించిన ద‌క్షిణాది రాష్ట్రాల ఆర్థిక‌మంత్రుల స‌మావేశాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం దూరంగా ఉంది. త‌ర్వాత ఏపీలో ఇదే అంశంపై జ‌రిగిన మ‌రో మీటింగ్‌కి ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోని బీజేపీయేత‌ర రాష్ట్రాలు హాజ‌ర‌య్యాయి. త‌ర్వాత రాష్ట్ర‌ప‌తిని క‌లిసి విన‌తిపత్రం కూడా స‌మ‌ర్పించారు. వీటితో త‌న‌కు సంబంధం లేన‌ట్లే ఉండిపోయారు కేసీఆర్‌.

ఇప్పుడు క‌ర్నాట‌క‌లో సంపూర్ణ మెజారిటీ లేక‌పోయినా అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టేందుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాన్ని జేడీఎస్‌-కాంగ్రెస్ తిప్పికొట్టాయి. గ‌తంలో నాలుగైదు రాష్ట్రాల్లో ఏ ఇబ్బందీ లేకుండా తెర‌వెనుక చ‌క్రం తిప్పిన బీజేపీని…క‌ర్నాట‌క‌లో క‌లిసిక‌ట్టుగా నిలువ‌రించాయి విప‌క్షాలు. మూడ్రోజుల‌కే బీజేపీని గ‌ద్దెదించి కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో అధికారంలోకొస్తోంది జేడీఎస్‌. కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి దేశంలోని విప‌క్షాల పాల‌న‌లో ఉన్న రాష్ట్రాల సీఎంల‌తో పాటు తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కూడా ఆహ్వానాలు అందాయి.

ఏపీకి కేంద్రం అన్యాయంచేసినందుకు క‌ర్ణాట‌క‌లోని తెలుగుప్ర‌జ‌లు ఓటుతో బ‌దులుచెప్పాల‌ని ముందే పిలుపునిచ్చిన టీడీపీ…ఈ ప‌రిణామాల్ని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు క‌చ్చితంగా వెళ్తారు. మ‌రి కేసీఆర్ ఏం చేస్తార‌న్న‌దే ప్ర‌శ్న‌. ఆయ‌న వెళ్ల‌క‌పోతే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వెనుక వేరే ఎజెండా ఉంద‌నే అప‌నింద‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లు అవుతుంది. ఇప్ప‌టికే ఆర్థిక‌మంత్రుల స‌మావేశాల‌కు దూరంగా ఎందుకున్నార‌న్న ప్ర‌శ్న‌కు ఎవ‌రికి తోచిన భాష్యాలు వారు చెప్పుకుంటున్నారు. కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్తే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కి మ‌రింత మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవ‌చ్చు. కానీ బీజేపీతో కెలుక్కోవ‌డ‌మే అవుతుంది. రిస్క్ లేక‌పోతే ఫ్రంట్ లేద‌నుకుని హాజ‌ర‌వుతారా? ఎందుకొచ్చిన గోల‌ని ఫోన్‌లో అభినంద‌న‌ల‌తో స‌రిపెడ‌తారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here