HomeNewsAndhra Pradeshమహిళా రిజర్వేషన్ చట్టం అయితే… ఏపీ అసెంబ్లీలో 58, లోక్ సభలో 8 మంది

మహిళా రిజర్వేషన్ చట్టం అయితే… ఏపీ అసెంబ్లీలో 58, లోక్ సభలో 8 మంది

Published on

దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే చర్చసాగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా మహిళా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం భారీగా పెరగనుంది. ఏపీలోనూ 8 లోక్‌సభ, 58 అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళలకే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా బిల్లును కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాజకీయవర్గాల్లో దీనిపై చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత వచ్చినా.. రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనేదానిపై ప్రజాప్రతినిధులు ఆరాతీస్తున్నారు. ఈ బిల్లు వల్ల తమ నియోజకవర్గం మహిళలకు వెళ్తుందా అని చర్చల్లో మునిగి తేలుతున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది. ఆ ప్రభావం తమపై ఎలా ఉంటుందోనని తొలుత కొంతమంది ఆందోళన చెందారు. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే అమలవుతుందని తెలిసి ఊరట పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే ఎన్ని నియోజకవర్గాలు మహిళలకు ఇచ్చే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టం ఆమోదం తర్వాత మొదటి జనాభా గణనకు సంబంధించిన గణాంకాలను ప్రచురించిన తర్వాత ఈ ప్రయోజనం ఉంటుందని బిల్లులో ఉంది. అంతేగాకుండా డీలిమిటేషన్ కసరత్తు చేపట్టిన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. సాంకేతికంగా 2021 జనాభా లెక్కలు ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి జనాభా గణన నిర్వహించాలి, ఆపై గణాంకాలను ప్రచురించాలి. డీలిమిటేషన్ కూడా జరగాల్సి ఉన్నందున 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదంతా అసంభవం. కనుక వచ్చే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలుకావడం లేదు. జనాభా గణన ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశం ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఇక్కడి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. నగర నియోజకవర్గాల్లోనే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా.. మహిళలకు 33% రిజర్వేషన్‌ అమలైతే 8 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి రావచ్చు. పునర్విభజనలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. ఈ సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతమున్న స్థానాల్లో.. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న మొదటి 8 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించ వచ్చు. విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి (ఎస్సీ), అనంతపురం, నంద్యాల, విజయవాడ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. వీటిల్లో నగర ప్రాంతాలే అధికంగా ఉన్నాయని అర్థం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 175 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ సంఖ్య పెరగకుండా.. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ అమలైతే 58 స్థానాలు మహిళలకు రిజర్వు అవుతాయి. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న మొదటి 58 శాసనసభ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉండొచ్చు. వీటిలోనూ అత్యధికంగా నగరప్రాంత నియోజకవర్గాలుంటాయి. అందులో కొన్ని జిల్లా కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు సీట్లు కేటాయిస్తే రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంది. ఎలా ఉండనుందన్న చర్చలు మొదలయ్యాయి. ఏయే నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్‌ అవుతాయి… ఎవరి సీట్లు గల్లంతవుతాయనేది చర్పకు దారితీస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందన్న అంచనా ఉన్నప్పటికీ ఈ బిల్లుతో తమ నియోజకవర్గం మహిళలకు వెళ్తుందా .. తమ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎవరిని బరిలో నిలపాలి అన్న చర్చ సాగుతోంది.

విశాఖపట్నం 9,20,376
గుంటూరు 8.82.220
నరసరావుపేట 8.58.501
నెల్లూరు 8,55,500
తిరుపతి (ఎస్సీ) 8,50,826
అనంతపురం 8,48,842
నంద్యాల 8,38,222
విజయవాడ 8,30,991
కర్నూలు 8,20,230
కాకినాడ 8,08.177
ఏలూరు 8.07.139
కడప 8.06.166
రాజంపేట 8.06.164
శ్రీకాకుళం 7,99,259
అనకాపల్లి 7,95,270
హిందూపురం 7,91,626
రాజమండ్రి 7,91,180
ఒంగోలు 7,85,558
అరకు 7,71,205
విజయనగరం7,70,297
మచిలీపట్నం 7,49,716
బాపట్ల 7,47,701
అమలాపురం 7,44,691
నరసాపురం 7,34,989లో మహిళా ఓటర్లు ఉన్నారు.

ఈ లోక్ సభ స్థానాల్లో 8 స్థానాలు మహిళలకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ఏపీ అసెంబ్లీలోనూ 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.ఈ బిల్లు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది, ఇప్పటికప్పుడు ఆ ప్రభావం తమపై ఎలా ఉంటుందోనని తొలుత ఆందోళన వ్యక్తమైంది. అయితే 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే అమలవుతుందని తెలియడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు. 2022 నాటికి రాష్ట్రంలో 4,07,06,804 మంది ఓటర్లుండగా.. ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం కొత్తగా 1,69,916 మందిని జాబితాలో చేర్చింది. 1,40,372 మందిని తొలగించింది. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,62,880 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి తక్కువగా 1,67,596 మంది, కృష్ణా జిల్లా పెడనలో 1,71,454 మంది, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో 1,79,103 మంది ఓటర్లు ఉన్నట్లుగా గణాంకాలు తేల్చాయి. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న మొదటి మూడు నియోజకవర్గాల్లో రెండు విశాఖ జిల్లాలోనూ, అతి తక్కువ ఓటర్లున్న తొలి మూడు నియోజకవర్గాల్లో రెండు పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పటివకి 13,85,239 మంది ఓటర్లు పెరిగారు.తాడిపత్రిలో లక్షా 19 వేల 334 మంది ఓటర్లు ఉన్నారు.

Latest articles

More like this