Home News

అచ్చన్న కుటుంబం పై కేసులు..టీడీపీ సైలెంట్..కథ వేరే ఉందా..!

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం. జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఎర్రన్న తనయుడు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీ. ఆయన కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే. ఇంతటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ కింజరాపు కుటుంబానికి 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అలాంటి కింజారపు కుటుంబం పై వరుస కేసులు పెడుతున్నా టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. దీని పైనే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలిచి చురుకైన పాత్ర పోషిస్తోన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ కేసులతో నలిగిపోయారు. ప్రస్తుతం అచ్చెన్న కుటుంబానికి చెందిన ముగ్గురిపై రౌడీషీట్స్ తెరిచారు. అచ్చెన్న అన్నయ్య హరివరప్రసాద్‌తోపాటు హరిప్రసాద్‌ కుమారుడు సురేష్‌, సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో ఓ రేంజ్‌లో పొలిటికల్‌ రగడ జరిగింది. వైసీపీ బలపర్చిన కింజరాపు అప్పన్నను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు సంభవించాయి.

అదే సమయంలో పోలీసుల విధినిర్వహణకు ఆటంకం కల్పించారని ఆరోపణలు రావడంతో అచ్చెన్న కుటుంబసభ్యులు 22 మందిపై నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు నమోదయ్యాయి. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయగా హరివరప్రసాద్, సురేష్‌లు బెయిల్ తెచ్చుకున్నారు. అప్పట్లో హరివరప్రసాద్‌, సురేష్‌, అచ్చెన్నాయుడి సమీప బంధువు కృష్ణమూర్తిపై కోటబొమ్మాళి పోలీసులు బైండోవర్లు ఓపెన్ చేశారు. ఈ కేసులు పెట్టిన 4 నెలల తర్వాత ఇప్పుడు రౌడీషీట్లు ఓపెన్ చేయడం చర్చగా మారింది. బైండోవర్‌ రూల్స్ ఉల్లంఘించడంతోపాటు పాత కేసులు ఉండటంతో రౌడీషీట్లు ఓపెన్‌ చేశామన్నది పోలీసుల వాదన.

కింజరాపు కుటుంబంపై ఈగవాలినా ఊరుకోని తెలుగు తమ్ముళ్లు.. ఈ ఎపిసోడ్‌లో మాత్రం కిమ్మనకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. జిల్లాలో టీడీపీకి అనేక మంది ముఖ్యనేతలు ఉన్నా.. ఒక్కరూ స్పందించలేదు. పార్టీలో చిన్న కార్యకర్తపై కేసుపెడితే అక్రమం అని రోడ్డెక్కే నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదట. అచ్చెన్నను అరెస్ట్‌ చేసిన సమయంలో నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలియజేసిన తెలుగు తమ్ముళ్లు కామైపోయారు. పార్టీ నేతల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ చర్యలపై అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు సైతం స్పందించడానికి ఆసక్తి చూపించలేదు. ఏం మాట్లాడాలో కూడా పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వలేదట. ఈ పరిణామాలే జిల్లా రాజకీయాలలో చర్చగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here