Home News

పేరు మార్పుతో ఫెటు మారిందా….యెడియూరప్ప అను నేను…!

రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌, మాజీ సీఎం యెడియూరప్ప శుక్రవారం ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్టీ శ్రేణులు వెంటరాగా ర్యాలీగా రాజ్‌భవన్‌కు చేరుకున్న యెడియూరప్ప చేత.. గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పేర్లు మార్చుకుంటే ఫేట్‌ కూడా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇందుకు ప్రముఖులు అతీతులేం కాదు. కర్ణాటకకు సీఎం యడ్యూరప్ప కూడా తాజాగా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు సీఎం సీటు దక్కిందని కన్నాడ నాట సెటైర్లు పేలుతున్నాయి.

ఎక్కువగా సినిమా వాళ్లు, క్రీడాకారులు వారి పేర్లలో మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. ఇలా అదృష్టాన్ని నమ్ముకునే వాళ్లలో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అందుకే వెంటనే జ్యోతిషుడి వద్ద వాలిపోతారు. పదవిని చేజేతులా వదులుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు. కొందరైతే పార్టీ నాయకుల మాటనైనా పెడచెవిన పెడతారేమో గానీ పండితుల వాక్కు మాత్రం తూ.చ తప్పకుండా పాటిస్తారు. కర్ణాటకకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా తాజాగా ఇదే కోవలోకి వచ్చారు. ఇది వరకు ఆయన మూడుసార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ పూర్తికాలం అందులో కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఆయన తన పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారు.

ఇప్పటివరకు ఆయన పేరు యడ్యూరప్ప (BS Yaddyurappa) అని ఉండగా.. తాజాగా యడియూరప్ప (BS Yadiyurappa)గా మార్చుకున్నారు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్ప(BS Yediyurappa)ను యడ్యూరప్ప( BS Yeddyurappa)గా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిషుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. కానీ ఆ ఫార్ములా వర్కవుట్‌ కాలేదని భావించిన యడ్డీ.. తాజాగా మళ్లీ పేరులో మార్పు చేశారు. మరి ఈసారైనా ఆయనకి అదృష్టం కలిసివస్తుందో లేదో చూడాలి.

ఈ నెల 29లోగా బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ యడియూరప్పను కోరినట్టు సమాచారం. అయితే బలాన్ని ఏవిధంగా నిరూపించుకుంటారన్న అంశం ఆసక్తిగా మారింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా.. గురువారం స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేయడంతో ఆ సంఖ్య 222కు పడిపోయింది. అందులో స్పీకర్‌ను తీసేస్తే ఆ సంఖ్య 221 కాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 112 మంది సభ్యుల మద్దతు అవసరం. భాజపాకు 105 మంది సభ్యులు ఉండగా.. మరో స్వతంత్ర సభ్యుడు మద్దతు ఇస్తున్నారు. సాధారణ మెజార్టీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సంఖ్యను యడియూరప్ప ఎలా కూడగడతారనే అంశం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here