మహారాష్ట్రలో అమరావతి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్లమెంటుకు ఎన్నికైన సినీనటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల్లో ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారంటూ.. దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఆమెకు 2లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే, కోర్టు తీర్పును స్వాగతించిన నవనీత్.. పైకోర్టుకు అప్పీల్వెళ్తానన్నారు.
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్‌కౌర్.. పార్లమెంట్ సభ్యత్వం ప్రమాదంలో పడింది. తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు సమర్పించారంటూ నవనీత్ కౌర్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు.. సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల్లో ఆమె తప్పుడు ధృవపత్రాలు జరతపరిచినట్టు అభిప్రాయపడిన న్యాయస్థానం.. రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది.
నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదంటూ.. మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని రుజువు చేసుకొనేందుకు నవనీత్‌కు నెల పాటు గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయినా నిరూపించుకోకపోవడంతో.. సంచలన తీర్పునిచ్చింది కోర్టు. గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం అమరావతి నుంచి ఆనందరావు అదసూల్ పైనే విజయం సాధించారు నవనీత్‌కౌర్. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్‌కౌర్.. ఎన్సీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయారు.