Home News

హుజురాబాద్ లో బీజేపీని కలవరపెడుతున్నది ఇదే…!

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ నేతలు సంతోషంగా ఉంటే..తెరవెనక మరో అంశం వారిని కలవరపెడుతుంది.ఒకప్పుడు నువ్వా నేనా అని కత్తులు దూసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ఒకే గూటిలోకి వచ్చారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు గతంలో పోటీపడిన వారే. ప్రస్తుతం ఇద్దరూ బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడిదే బీజేపీ నేతల టెన్షన్ కి కారణమవుతుంది.

హుజురాబాద్‌ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్‌గా ఇప్పటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారు. బీజేపీలోకి ఈటల రాకను ఆయన మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో ఇద్దరూ వేర్వేరు పార్టీలలో ఉండి ఒకరిపై ఒకరు పోరాటం చేశారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలు.. సవాళ్లు హోరెత్తాయి. ఈటల చేరిక సందర్భంగా ఢిల్లీకి పెద్దిరెడ్డిని పార్టీ నేతలు పిలవలేదట. దీంతో ఆయన చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈటల బీజేపీలోకి వస్తున్నారన్న విషయాన్నే ఇంఛార్జ్‌గా ఉన్న తనకు చెప్పకపోవడంపై ముందు నుంచీ పెద్దిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.

గతంలో ఈటల రాజేందర్‌, పెద్దిరెడ్డి ఇద్దరూ హుజురాబాద్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రులుగానూ చేశారు. స్థానికంగా పట్టున్న నాయకులు. అందుకే ఇద్దరు ఉద్దండులను ఒకేతాటిపైకి తీసుకురావాలని బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. కానీ ఈటల రాకతో నియోజకవర్గంలో తన ప్రాబల్యం తగ్గిపోతుందనే ఆందోళనలో పెద్దిరెడ్డి ఉన్నారు. ఇదే విషయాన్ని అనుచరుల దగ్గర కూడా ఆయన ప్రస్తావించారట. ఒకవేళ బీజేపీలో తనకేదైనా కీలక పదవి ఇస్తే పార్టీలో ఉంటానని స్పష్టం చేశారట. ఈటల వచ్చారన్న సంతోషం కంటే.. పెద్దిరెడ్డి శిబిరం నుంచి వస్తోన్న రియాక్షనే ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చగా మారింది.

హుజురాబాద్‌లో పర్యటించి అనుచరులతో మాట్లాడిన తర్వాత పెద్దిరెడ్డి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే వీలుందని తెలుస్తోంది. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఆయన పర్యటన ఉంటుందని చెబుతున్నారు. అనుచరులతో మాట్లాడిన తర్వాత.. బీజేపీ నాయకత్వం ముందు పెద్దిరెడ్డి తన డిమండ్స్‌ ఉంచుతారని..పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతుందని భావిస్తే బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో పెద్దిరెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here