Home News Politics

తెలంగాణ ఎన్నికల పోరులో కమలం దూకుడు ఎందాక….? త్రిముఖ పోటీతో ఏ పార్టీకి ప్రయోజనం…!

ఓవైపు టీఆర్ఎస్ మరోవైపు ప్రతిపక్షాల ప్రజాకూటమి అధికారం కోసం పోటాపోటీగా తలబడుతున్న తరుణంలో కమళదళం కూడా తెలంగాణ వ్యాప్తంగా 118 స్థానాల్లో బరిలో దిగింది. తాము పోటీలో బలమైన ప్రత్యర్ధులమే అంటూ ఢిల్లీ నుంచి బడా నాయకులు తెలంగాణ గల్లీల్లో సవాల్ విసురుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఆఖరి నిమిషంలో వచ్చిన వారికి టెక్కెట్లిచ్చి బరిలో దింపిన కమలం పార్టీ తెలంగాణ లో అధికారం పై దృష్టి పెట్టిందా లేక మరేదైన ఫ్యూహంతో ముందుకెళ్తుందా ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కించేలా ప్రధాని మోడీ నుంచి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వరకు చేస్తున్న పర్యటనలతో కమలదళం టార్గెట్ ఏంటీ…రసవత్తరంగా మారిన ఎన్నికలలో త్రిముఖ పోటీ ఏ పార్టీకి ప్రయోజనం….

గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంతోపాటు కొన్నిచోట్ల విజయం కోసం కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో ఓటింగ్‌శాతాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ఈ ఎన్నికల్లో భీజేపీ దృష్టిపెట్టింది. అంగబలం, అర్థబలం ఉన్నవారికి.. ఇతర పార్టీల నుంచి ఆఖరి నిమిషంలో చేర్చుకున్న మాజీ ఎమ్మెల్యేలకు, నాయకులకు టికెట్లు ఇచ్చింది. జాతీయస్థాయి నేతలను రప్పిస్తోంది. బీజేపీకి పెరిగే ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్థుల జయాపజయాలపై గట్టిగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని 45 చోట్ల పోటీచేసిన భీజేపీ అంబర్‌పేట, గోషామహల్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌ స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఒంటరిగా బరిలో దిగటం.. టీఆర్ఎస్ , ప్రజా కూటమి నుంచి బలమైన ప్రత్యర్థులు పోటీలో ఉండటంతో ఈ స్థానాలను నిలబెట్టుకునేందుకు భీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. వీటితోపాటుగా..మల్కాజ్ గిరి, కరీంనగర్‌, సూర్యాపేట, నిజామాబాద్‌ అర్బన్‌, ముథోల్‌, కల్వకుర్తి, ఆదిలాబాద్‌,నిర్మల్ వంటి చోట్ల విజయం కోసం హోరాహోరీ పోరాటం చేస్తోంది. వీటిలో అక్కడక్కడా గెలుస్తాన్న ధీమాను సైతం కమలనాథులు వ్యక్తంచేస్తున్నారు. భీజేపికి తక్కువ ఓట్లు వచ్చే అవకాశమున్న చోట్ల కూడా ప్రధానపార్టీల విజయావకాశాల్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ముషీరాబాద్‌లో పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ నుంచి ముఠా గోపాల్‌, కాంగ్రెస్‌ నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ల రూపంలో గట్టి ప్రత్యర్థులు బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అంబర్‌పేటలో కిషన్‌రెడ్డికి టీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేశ్‌, తెజస నుంచి రమేశ్‌ ముదిరాజ్‌లు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈసారి మజ్లిస్‌ పోటీలో లేకపోవడం..తెరాస నుంచి ఈసారి గట్టి అభ్యర్థి ఉండటం.. తెజసకు కాంగ్రెస్‌, తెదేపాల మద్దతు ఉండటంతో.. కిషన్‌రెడ్డికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఖైరతాబాద్‌ నుంచి పోటీచేస్తున్న చింతల రామచంద్రారెడ్డికి టీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌ల రూపంలో గట్టి ప్రత్యర్థులున్నారు. మిగతా అభ్యర్థుల కంటే ముందే ప్రచారం మొదలుపెట్టడంతోపాటు, నియోజకవర్గ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వారిని ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల భీజేపీ నేతల్ని రప్పిస్తున్నారు. ఉప్పల్‌లో ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేందర్‌గౌడ్‌, టీఆర్ఎస్ నుంచి భేతి సుభాష్‌రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్నారు. గోషామహల్‌లో రాజాసింగ్‌ కాంగ్రెస్‌ నుంచి ముఖేష్‌గౌడ్‌, టీఆర్ఎస్ నుంచి ప్రేంసింగ్‌రాథోడ్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

గత ఎన్నికల్లో కల్వకుర్తిలో భీజేపీ అభ్యర్థి ఆచారి 78 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఓడిన సానుభూతి ఈసారి పనిచేస్తుందన్న నమ్మకంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో హోరాహోరీగా తలపడుతున్నారు. మల్కాజ్ గిరిలో గత ఎన్నికల్లో 2,768 ఓట్లతో ఓటమిపాలైన రామచంద్రరావు ఈసారైనా అవకాశం ఇవ్వాలని ప్రజల్లోకి వెళుతున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌కుమార్‌ విజయంపై కమలం పార్టీ గట్టి ఆశలు పెట్టుకుంది. పొన్నం ప్రభాకర్‌, గంగుల కమలాకర్‌లు ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. సూర్యాపేటలో పొత్తులో అవకాశం రాక గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండోస్థానంలో నిలిచిన సంకినేని వెంకటేశ్వరరావు ఈసారి మంత్రి జగదీశ్‌రెడ్డి పై గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మరో ప్రత్యర్థిగా ఉండటంతో ఇక్కడ త్రిముఖపోరు నెలకొంది.

భూపాలపల్లిలో మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు కీర్తిరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో భీజేపీ నుంచి పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావు గులాబీ పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ద్విముఖ పోరు కాస్త చతుర్ముఖ పోటీగా మారుతోంది. శేరిలింగంపల్లిలో రియల్టర్ యోగానంద్‌ను భిజేపీ బరిలో దించింది. పార్టీ ఓటింగ్‌తో పాటు నిర్మాణరంగంలో తనకున్న పరిచయాలు, ఉత్తరాదిరాష్ట్రాల వారిని, తన సామాజికవర్గం ఓటర్లను, సీమాంధ్ర ఓటర్లను ఆకర్షించేందుకు యోగానంద్‌ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంగారెడ్డిలో ప్రభావం చూపాలని భీజేపీ భావిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారానికి రప్పిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్గారెడ్డిల మధ్య ప్రధాన పోటీ ఉంది. భీజేపీ నుంచి రాజేశ్వరరావు దేశ్‌పాండే పోటీలో ఉన్నారు.

ఆర్మూర్‌లో తెరాస నుంచి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ఆకుల లలిత మధ్య గట్టిపోటీ ఉంది. భాజపా అభ్యర్థి వినయ్‌కుమార్‌రెడ్డి కొద్దిరోజులుగా చురుకుగా ప్రచారం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో కమలం పార్టీ నుంచి ఈసారి బద్దం బాల్‌రెడ్డి పోటీలో నిలిచారు. మజ్లిస్‌ పార్టీ బరిలో ఉండటంతో ఇక్కడ గట్టిగా పోటీపడేందుకు భీజేపీ ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీల మాజీ ఎమ్మెల్యేలకు, ముఖ్యనాయకులకు భీజేపీ టికెట్లు ఇచ్చింది. చొప్పదండిలో బొడిగె శోభకు, జుక్కల్‌లో అరుణతారకు, భద్రాచలంలో కుంజ సత్యవతికి, అందోలులో బాబూమోహన్‌కు టికెట్లు ఇచ్చింది. మొత్తం మీద భీజేపీ ఎన్ని ఓట్లు చీలుస్తుంది? ఎవరి ఓట్లకు గండి కొడుతుంది? అన్న దానిపైనే చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు ఆధారపడి ఉన్నాయి.

బీజేపీ హోరాహోరి తలపడుతుండటం,కొన్ని స్థానాల్లో గట్టి పోటీనిస్తుండటంతో టీఆర్ఎస్,ప్రజాకూటమిలో ఎవరి ఓట్లకు గండిపడుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలి తమకు లాభాం జరుగుతుందని అధికార గులాబీ పార్టీ లెక్కలేస్తుండగా ఆ పార్టీలో టిక్కెట్ దక్కక బయటకి వచ్చిన నేతలకే బీజేపీ టిక్కెట్లు దక్కడంతో తమకే కలిసొస్తుందని ప్రజాకూటమి లెక్కలేసుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here