Home News

బీజేపీలో సోషల్‌ స్టార్‌గా మారుతున్న రాములమ్మ

తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి పాత్ర ప్రత్యేకం. సొంత పార్టీ పెట్టి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అయ్యారు. ఆపై కాంగ్రెస్‌లో కొంతకాలం ప్రయాణించి.. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ ఆమెకు కొత్త కాదు. ఇంతకు ముందు ఆమె పొలిటికల్‌ ఎంట్రీ కాషాయ శిబిరంలోనే. వాతావరణం పాతదే అయినప్పటికీ.. ఇప్పుడున్న బీజేపీ నాయకులే విజయశాంతికి కొత్త. రాములమ్మ పార్టీలో చేరినా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న సందర్భాలు తక్కువే అన్నది శ్రేణుల్లో వినిపించే మాట. మీడియా సమావేశాలు సైతం పెద్దగా పెట్టడం లేదు. ఏదైనా మీటింగ్‌ ఉంటే పార్టీ ఆఫీస్‌కు వచ్చి వెళ్లిపోతున్నారనే విమర్శలున్నాయి. దీంతో రూటు మార్చారు.

ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో విజయశాంతి యాక్టివ్‌ అయ్యారు. సోషల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుకొని.. ప్రధాని మోడీతోపాటు బీజేపీ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తనదైన శైలిలో పోస్టింగ్‌లు పెట్టి ప్రజలు, మీడియా అటెన్షన్‌ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ట్విటర్‌ వేదికగా గ్రాఫిక్‌ ప్లేట్స్‌..చిన్న చిన్న వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ..కేంద్ర సర్కార్ పథకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మోడీ ఫర్‌ ఇండియా..మార్పుకోసం కమలం అని క్యాప్షన్‌ పెట్టి ట్వీట్స్‌ చేస్తున్నారు విజయశాంతి. మిగతా బీజేపీ నేతలతో పోల్చుకుంటే ఈ విషయంలో ఆమె చాలా ముందు ఉన్నారట. పోస్టింగ్‌లలో ఉపయోగిస్తున్న పదాలు కూడా ఘాటుగా ఉంటున్నాయి. అయితే రాములమ్మ ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌ అయ్యారని ప్రశ్నించేవారు లేకపోలేదు. కరోనా పరిస్థితుల కారణంగా జనాల్లోకి వెళ్లలేని దుస్థితి. అందుకే సోషల్‌ మీడియాను నమ్ముకున్నారనే వారు లేకపోలేదు. రాజకీయాల్లో ఉన్నాననే ఉనికి కోసమో ఏమో తాను చెప్పదలుచుకున్నది సోషల్‌ మీడియా ద్వారా తొందరగా వెళ్తుందని ఆమె భావించడం చర్చగా మారింది.

బీజేపీలో చేరిన తర్వాత విజయశాంతి పెద్దగా కనిపించడం లేదు. అయితే పార్టీ వేదికలపై అవకాశం రాకే ఈ విధంగా ట్విటర్‌ను ఆశ్రయించారనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా..సోషల్‌ స్టార్‌గా రాములమ్మ మారిందన్న చర్చ మాత్రం నడుస్తుంది.ప్రత్యేకంగా కొన్ని వీడియోలు సిద్ధం చేసి రిలీజ్‌ చేయడం కమలనాథులను సైతం ఆశ్చర్య పరుస్తోందట. వాస్తవానికి బీజేపీ కేంద్ర నాయకత్వం సోషల్ మీడియా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ప్రధాని మోడీ..హోంమంత్రి అమిత్‌షా మొదలుకుని అంతా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. ఇదే ఇప్పుడు విజయశాంతికి మైలేజ్ తీసుకొస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here