Home News Stories

బీజేపీకి టీడీపీ బిస్కెట్ వేస్తోందా?

దుబ్బాక ఫలితం తెలంగాణలో బీజేపీకి వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. టీఆరెఎస్ సిటింగ్ సీటును అనూహ్యంగా చేజిక్కించుకుంది బీజేపీ. దుబ్బాక గెలిచేదాకా తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించింది ఒక ఎమ్మెల్యేలనే. రఘునందన్ రావు గెలుపుతో అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గొంతెత్తబోతున్నారు. పోయిన ఎన్నికల్లో ఏపీలో బీజేపీ పరిస్థితి మరీ దారుణం. అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంటులో ఏపీ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. వచ్చే ఎన్నికలదాకా చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పన్లేకుండా…అనుకోకుండా ఓ అవకాశం ఆ పార్టీకి కలిసొచ్చింది. అదే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గప్రసాదరావు మరణంతో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి బై ఎలక్షన్ రాబోతోంది. వాస్తవానికి ఏపీలో పొలిటికల్ ఫైటింగ్ వైసీపీ వర్సెస్ టీడీపీగానే సాగుతోంది. అయితే దుబ్బాక ఫలితం తర్వాత సమీకరణాలు మారే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఏపీలో ఇప్పటికే ముగ్గురు ఎంపీలున్న టీడీపీ వ్యూహాత్మకంగా తిరుపతి ఎంపీ సీటుని ….బీజేపీకి వదలొచ్చనేది పొలిటికల్ సర్కిల్స్.లో జోరుగా నడుస్తున్న చర్చ. అదేంటీ…టీడీపీ-బీజేపీల మధ్య ఎప్పుడో చెడిందిగా.. అటూ ఇటూ కాకుండా ఓ ఉప ఎన్నికలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యమనేది కొందరి ప్రశ్న. అయితే అక్కడే అసలు లాజిక్ ఉంది. ఎన్నికలతో ముందే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా అధికారపీఠానికి దూరమైన చంద్రబాబు… తిరుపతి బై ఎలక్షన్.తో మళ్లీ బీజేపీకి స్నేహహస్తం చాచాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీ కూడా శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు …వైసీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు మళ్లీ రాజకీయ అవసరార్థం టీడీపీని దువ్వాలనుకుంటోందటున్నారు

చంద్రబాబుకు దూరదృష్టి ఎక్కువ. దురాలోచన అని చెప్పలేంగానీ రాజకీయంగా చూస్తే దూరాలోచన. సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు చాలా లెక్కలేసుకున్నారు. బీజేపీతో అంటకాగితే మైనారిటీ ఓట్లతో పాటు, కేంద్ర విధానాలను వ్యతిరేకించేవారి ఓట్లు మైనస్ అవుతాయనుకున్నారు. దీంతో ప్రత్యేకహోదా సహా, రాష్ట్రానికి సాయం వంటి అంశాలు కలిసిరావటంతో కమలంతో తెగదెంపులు చేసుకున్నారు. ధర్మపోరాట దీక్షలతో కేంద్రంలోని బీజేపీపై పదవినుంచి దిగిపోయేదాకా ఫలితం లేని పోరాటం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయారు చంద్రబాబు. మరీ మొండికేసికూర్చుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలా…రాజకీయంగా రేసులో పూర్తిగా వెనుకబడి పోతామన్న ఆందోళన కూడా మొదలైంది. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందే బీజేపీతో పాతబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు అనుకోకుండా తిరుపతి ఎంపీ స్థానం కలిసొచ్చింది. అందుకే…తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే బై ఎలక్షన్.లో పోటీకి దూరంగా ఉండి, బీజేపీకి మద్దతు ప్రకటించాలనేది చంద్రబాబు వ్యూహంలా కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి దీనిపై సంకేతాలున్నాయని, టీడీపీ అధినేత నుంచి ఇలాంటి ఆఫర్ వస్తే బీజేపీ కూడా తిరస్కరించకపోవచ్చనేది కొందరి విశ్లేషణ.

ఎన్డీయేలో ఉన్న మిత్రులు కొందరు చేజారుతుంటే కొత్త స్నేహితులను వెతుక్కుంటోంది బీజేపీ. అదే సమయంలో పాత మిత్రులు మనసు మార్చుకుని ముందుకొస్తే…షరతులు వర్తిస్తాయి అంటూనే మళ్లీ వాళ్లకు షేక్.హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. టీడీపీతో సుదీర్ఘకాల అనుబంధం ఉన్న సుజనాచౌదరి లాంటి నేతలు పొలిటికల్.గా సేఫ్ జోన్.లో ఉండేందుకు ఎన్నికల తర్వాత బీజేపీ గూటికి చేరారు. టీడీపీ హయాంలోని నిర్ణయాలను తిరగదోడుతూ, కేసులు పెడుతూ విపక్షనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాజధాని భూములు సహా గత ప్రభుత్వ హయాంలోని చాలా అంశాలపై పోస్టుమార్టం నడుస్తోంది. కారణాలేమయినా తీవ్ర ఒత్తిడితోనే మాజీ స్పీకర్ కోడెల సూసైడ్ చేసుకున్నారు. ESI స్కాంలో జైలుకెళ్లి బతుకుజీవుడా అంటూ బెయిల్.పై బయటపడ్డారు అచ్చెన్నాయుడు. వైసీపీ నేత మర్డర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రబాబు ఇరుక్కున్నారు.

బాలయ్య అల్లుడికి చెందిన విశాఖ గీతం యూనివర్సిటీ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతతో పాటు… భూ కేటాయింపులపై విచారణ జరుగుతోంది. ఇలా ఎటు నుంచి చూసినా వైసీపీ దెబ్బకు టీడీపీ విలవిల్లాడుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర పెద్దలతో పాత సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు….తిరుపతి ఉప ఎన్నికే బ్రహ్మాస్త్రంలా కనిపిస్తోంది చంద్రబాబుకి. బీజేపీకి మద్దతు పలికితే ఇప్పుడు రాజకీయంగా వచ్చే నష్టమేం లేదు. పైగా ఓ రక్షణ కవచం ఉన్నట్టుట్లుంది. మూడు పార్టీలు పోటీచేసి అంతిమంగా మళ్లీ వైసీపీ లాభపడేకంటే…ఏపీలో అధికారపార్టీకి ఓ షాక్ ఇచ్చేందుకు బీజేపీతో చేతులు కలపడమే తిరుగులేని వ్యూహం అవుతుందనేది చంద్రబాబు ఆలోచన. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందని సమాచారం. సీనియర్ నేతలు కూడా సుముఖంగా ఉండటంతో తిరుపతి పార్లమెంట్ స్థానంలో ఈసారి సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేవడమైతే ఖాయమనే అంటున్నారు.

అడిగితే మద్దతివ్వడానికి టీడీపీ రెడీగానే ఉన్నా…బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే బీహార్.లో మళ్లీ బీజేపీ-జేడీయూ కూటమే అధికారంలోకి వచ్చింది. అయితే అత్యంత వ్యూహాత్మకంగా నితీష్ కుమార్ పార్టీని బాగా బలహీనపరిచింది…సొంతంగా బలాన్ని పెంచుకుంది బీజేపీ. ఉప ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా తన సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్.లో ఈసారి పాగా వేస్తాననే ధీమాతో ఉంది. అలాంటిది… సింగిల్ సీటు కోసం నానా మాటలు అని, తమను బద్నాం చేసిన చంద్రబాబుతో మళ్లీ చెయ్యి కలుపుతుందా అన్న అనుమానాలు కూడా కొందరికున్నాయి. అయితే 2014లో ఏపీనుంచి గౌరవప్రదమైన ప్రాతినిధ్యం ఉన్న బీజేపీ, 2019 ఎన్నికల్లో జీరోకి చేరింది. అలాంటి రాష్ట్రంలో ఎంతోకొంత ప్రభావం చూపాలంటే అది సొంత బలంతో సాధ్యంకాదని బీజేపీకి తెలుసు. అందుకే టీడీపీ మద్దతు ఇస్తానంటే వద్దనకపోవచ్చు. 2024 నాటికి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి కలిసొచ్చిన ఏ అవకాశాన్నీ కమలం పార్టీ వదులుకోకపోవచ్చు.

దుబ్బాక ఫలితం తర్వాత తెలంగాణలో ఫుల్ జోష్.లో ఉంది బీజేపీ. పక్కనున్న ఏపీలోనూ దాని తాలూకు వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడైన సోమువీర్రాజు తిరుపతి బై పోల్.లో గెలుపు తమదేనని తొడగొడుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తిరుపతిపై దృష్టిసారించారు. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు కమలం పార్టీ హడావుడి మొదలైంది. జనసేన ఎలాగూ మద్దతిస్తుంది. టీడీపీ కూడా కలిసొస్తే తిరుపతిలో పాగా వేయొచ్చనే ప్లాన్.తో ఉంది బీజేపీ. రోగి కోరుకుందే వైద్యుడు ఇచ్చాడన్నట్లు చంద్రబాబు కూడా వైసీపీని దెబ్బకొట్టేందుకు ఇంతకంటే మంచి తరుణం మరోటి దొరకదనుకుంటున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు …అటు వైసీపీని దెబ్బకొట్టేందుకు, ఇటు పాత మిత్రుడైన బీజేపీకి దగ్గరయ్యేందుకు తిరుపతి ఉప ఎన్నికలతో రూట్ క్లియర్ చేసుకోవాలని…నాలుగు పదుల రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు. చంద్రబాబు మద్దతిచ్చి, పవన్ కల్యాణ్ కూడా ప్రచారం చేసి పెడితే…తిరుపతి ఎంపీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో దుబ్బాక మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఇప్పటికే నేతలు కేంద్ర పెద్దల చెవిన వేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ…తిరుపతి సాక్షిగా రాష్ట్ర విభజన తర్వాత మోదీ ఇచ్చిన హామీలను ప్రజలెవరూ మరిచిపోలేదు. ప్రత్యేక హోదా, ఢిల్లీకి తీసిపోని రాజధాని వంటి హామీలను తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తుంగలో తొక్కేసిందన్న అసంతృప్తితో ఇప్పటికీ ప్రజలు రగిలిపోతూనే ఉన్నారు. అందరూ కూడబలుక్కుంటే గెలిచిపోతామనుకోవడం కూడా పొరపాటే. కేంద్రం నుంచి ఈసారి హామీలు కాదు, కచ్చితమైన కార్యాచరణ ఏదన్నా ఉంటేనే ప్రజలు నమ్మేలా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here