Home News Stories

అయ్యయ్యో…చేతితో సీట్లు పోయెనే!

నోటిదాకా వచ్చిన ముద్ద చేజారిపోవడం అంటే ఇదే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ విజయం ఆర్జేడీ కూటమిదేనని ఢంకా బజాయించి చెప్పాయి. మొదట్లో ట్రెండ్స్‌ కూడా అలాగే కనిపించాయి. కానీ చివరికొచ్చేసరికి సీన్‌ సితారైంది. కాంగ్రెస్‌ మునుగుతూ మునుగుతూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వారసుడి కొంప కూడా ముంచేసింది. రాంవిలాస్‌ పాశ్వాన్‌ కొడుకు సొంతంగా గెలవలేకపోయినా మహా ఘట్‌ బంధన్‌ విజయావకాశాలను దెబ్బకొట్టాడు. రాష్ట్రం ఏదయినా వెళ్లి వేలుపెట్టే ఎంఐఎం కూడా ముస్లిం సీట్లు చీల్చేసి తేజస్వి విజయానికున్న దారులు మూసేసింది. మొత్తంగా ఇతరులు 20శాతంపైన ఓట్లు కొల్లగొట్టటంతో గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనుకున్న తేజస్వి యాదవ్‌ బొక్కబోర్లా పడ్డాడు. ఓటమిఖాయమని ముందే మెంటల్‌ గా ప్రిపేర్ అయిన నితీష్‌ కుమార్‌…ఊపిరాడని సమయంలో ఆక్సిజన్ దొరికినట్లు బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు.

బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనే ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ విజయావకాశాల్ని ఘోరంగా దెబ్బతీసింది కాంగ్రెస్‌. నీళ్లలో మునుగుతున్న కాంగ్రెస్‌ ని గట్టుకు చేర్చే ప్రయత్నంలో దాంతో పాటు తాను కూడా మునిగిపోయాడు ఆర్జేడీ యువనేత తేజస్వి. మహాఘట్‌ బంధన్‌ లో భాగంగా 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 20 సీట్లు కూడా గెలుచుకోలేకపోవటంతో…మ్యాజిక్‌ ఫిగర్‌ ని అందుకోలేకపోయాడు తేజస్వి. చివరికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. అత్యధిక సీట్లతో RJD అతి పెద్ద పార్టీగా అవతరించినా.. అధికారం చేపట్టే అవకాశం రాకపోవడంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. ఆర్జేడీ ఓటమికి కారణాలు ఎన్ని ఉన్నా… ప్రధానంగా కాంగ్రెస్ తప్పిదాలు శాపంగా మారాయి.

బీహార్‌ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. మహాఘట్ బంధన్ తరఫున ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేసింది. తర్వాత అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీకి 70 సీట్లు ఇచ్చారు. సీపీఎం 4, సీపీఐ 6, సీపీఐఎంఎల్ 19 స్థానాల్లో పోటీ చేశాయి. తగుదునమ్మా అంటూ 70 స్థానాల్లో పోటీకి దిగిన కాంగ్రెస్‌ కనీసం సగం సీట్లయినా దక్కించుకోలేకపోయింది. మహాకూటమి విజయావకాశాలను కాంగ్రెస్‌ వైఫల్యం దారుణంగా దెబ్బతీసింది. ఆర్జేడీ కంటే బీజేపీకి నాలుగు స్థానాలు తక్కువ వచ్చినా…43 సీట్లు గెలిచిన జేడీయూతో మరోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీయే. అటు లోక్‌ జనశక్తి పార్టీ, ఎంఐఎం కూడా ఓటు బ్యాంకును చీల్చి మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

ఎల్జేపి, ఎంఐఎంలతో కూడా మహా కూటమికి దోస్తీ కుదిరి ఉంటే బీహార్‌ ఫలితం వేరేగా ఉండేది. అయితే ఆ రెండు పార్టీలో పరోక్షంగా ఎన్డీయే విజయానికి దోహదపడ్డాయి. ఎంఐఎం ముస్లిం ఓట్లను లాగేసుకుంటే…ఎల్జేపి దళిత ఓట్లకు గండికొట్టింది. కాంగ్రెస్‌ పార్టీని ఏ 30, 40 స్థానాలకో ఒప్పించి ఉన్నా ఫలితం వేరేలా ఉండేదంటున్నారు. కాంగ్రెస్‌కు తన సత్తాకు మించి సీట్లు ఇచ్చారనేది పలువురి అభిప్రాయం. సీట్ల పంపకం సందర్భంగా తేజస్వీ యాదవ్ ఇంకా గట్టిగా పట్టుబట్టాల్సి ఉండాల్సిందని చెబుతున్నారు. అంతా అయిపోయాక ఎన్ని అనుకుంటే మాత్రం ఏం లాభం. అందివచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని..అనుభవ రాహిత్యంతో చేజార్చుకున్నాడు తేజస్వియాదవ్‌. కాకపోతే బీహార్‌ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here