Home Entertainment Cinema

బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కే ఎందుకంటే….?

ఒక్కడిగా వచ్చాడు.. ఒక్కడిగా ఆడాడు.. ఒక్కడిగానే విజేతగా అవతరించాడు కౌశల్. నేను గేమ్ ఆడటానికి వచ్చా.. నేను గేమ్ మాత్రమే ఆడతా.. అందుకోసం నా ప్రాణం పెడతా.. నాకు నో రిలేషన్స్.. నో ఎమోషన్స్.. నా ఫోకస్ ఓన్లీ బిగ్ బాస్ టైటిల్.. ఈ మొండి పట్టుదలతో హౌస్‌ మేట్ దగ్గర విలన్‌గా మారినా ప్రజల తీర్పు ముందు విజేతగా నిలిచాడు.

వేటగాడే గెలిచాడు.. అవును 17 మంది వేటాగాళ్లు ఆ ఒక్కడిని వెంటాడినా.. కళ్లల్లో నిమ్మరసం పిండినా, పసుపు కొట్టినా.. ఒళ్లంతా గాయం చేసినా.. గుడ్లుతో, బాల్స్‌తో, వాటర్‌తో దాడి చేసినా.. కంటికి పేస్ట్ పూసినా.. సీజన్ మొత్తం ఎలిమినేట్ చేసినా.. బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ కొట్టాలనే అతని బలమైన సంకల్పం ముందు ఈ వేటగాళ్లు ఓడిపోయారు.. ఆ వేటగాడు గెలిచారు అతడే కౌశల్. ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్‌లో కోట్ల ఓట్లను కొల్లగొట్టి విజేతగా నిలిచారు. వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ టైటిల్ అందుకున్నారు.

నేను గేమ్ ఆడటానికి వచ్చా.. నేను గేమ్ మాత్రమే ఆడతా.. అందుకోసం నా ప్రాణం పెడతా.. నాకు నో రిలేషన్స్.. నో ఎమోషన్స్.. నా ఫోకస్ ఓన్లీ బిగ్ బాస్ టైటిల్.. ఈ మొండి పట్టుదలతో హౌస్‌ మేట్ దగ్గర విలన్‌గా మారినా ప్రజల తీర్పు ముందు విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఏకాకిగా మారారు. అయితేనేం.. 17 మంది హౌస్ మేట్స్ ఆయన వెంటవెంట లేకపోతేనేం.. కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు.


కౌశల్ పేరుతో ఆర్మీలు పుట్టుకొచ్చాయి. కౌశల్ ఫ్యాన్స్ పేరుతో హోల్టింగ్‌లు వెలిశాయి. ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది మహిళలు, పిల్లలు, పిల్లల తల్లులు కూడా కౌశల్ పేరుతో నిర్వహించిన 2కె రన్‌లో పాల్గొన్నారు. స్టార్ హీరోలు కుళ్లుకునేలా కౌశల్ ఆర్మీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి బిగ్ బాస్ నిర్వాహకులకు గట్టి సంకేతాలనే పంపింది. బిగ్ బాస్ అంటే కౌశల్.. కౌశల్ అంటే బిగ్ బాస్ అన్న రేంజ్‌లో తోటి కంటెస్టెంట్స్‌ కుళ్లుకుని నువ్ బిగ్ బాస్‌వా? అని తింగరి మొహం వేసేలా డిక్టేటర్‌గా మారి టైటిల్‌ రేస్‌లో టాప్ 1 ప్లేస్‌లో నిలిచారు కౌశల్.

కౌశల్ ఆర్మీ ప్రభావంతో హౌస్‌లో ఎవ్వరుండాలో డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారు కౌశల్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కౌశల్ ఆర్మీ పోస్టులే దర్శనం ఇచ్చాయి. ఒక ఇండియాలోనే కాకుండా అరబ్ కంట్రీస్‌లో కూడా ఈయన పేరుతో అభిమాన సంఘాలు ఏర్పాడ్డాయంటే కౌశల్ ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం పరిచయం లేని ఓ వ్యక్తికి ఊహించని స్థాయి పాపులారిటీ రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ పాపులారిటీ, ఫ్యాన్స్ ఫాలోయింగ్, కౌశల్‌కి వ్యతిరేకంగా మిగిలిన కంటెస్టెంట్ ఒక్క మాట మాట్లాడినా కౌశల్ ఆర్మీ దండెత్తేది.

ఇకపోతే.. బయట ఇంతమంది అభిమానాన్ని సంపాదించిన కౌశల్.. తనతో పాటు 112 రోజుల పాటు జర్నీ చేసినా ఒక్కరంటే.. ఒక్క హౌస్ మేట్ మనసు గెలుచుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక్క నూతన్ నాయుడు మాత్రమే కౌశల్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా అందులోనూ నూతన్ స్వార్ధం లేకపోలేదు. కౌశల్‌‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నుండి బయట నుండి చూసిన నూతన్ నాయుడు.. కౌశల్‌తో చనువుగా ఉంటే లాభపడొచ్చనే ధీమాతో ఆయనతో దోస్త్ మేరా దోస్త్ అనేవారు.

ఇక ఎలిమినేట్ అయిన దీప్తి సునయన, తేజస్విని, అమిత్, నందిని, బాబు గోగినేని, భాను శ్రీ, కిరీటి తదితర బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవుతూ.. కౌశల్‌పై సంచలన కామెంట్స్ చేసినవాళ్లే. కావాలని కంటెస్టెంట్‌తో చర్చలకు తెరతీయడం.. ఎక్కడ కెలికితే అది వివాదం అవుతుందో బాగా ఒంటపట్టించుకున్న కౌశల్ పదే పదే కంటెస్టెంట్స్‌కు టార్గెట్ అయ్యాడు ఇదో తరుణంలో మూకుమ్మడి దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ పరిణామక్రమంలోనే ప్రేక్షకుల మద్దతుని కూడగట్టాడు. అయ్యో.. అందరూ కలిసికట్టుగా కౌశల్‌ని టార్గెట్ చేస్తున్నారే అన్న ఫీల్ ప్రేక్షకుల్లో కలిగేలా తన గేమ్ ప్లాన్‌ని వర్కౌట్ చేసేవారు. మనల్ని రెచ్చగొట్టి సింపతీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని గీతా మాధురి అండ్ కో పదే పదే అంటున్నా కౌశల్ వ్యూహంలో చిక్కుకుని కౌశల్‌కి టైటిల్ కట్టబెట్టారు.

బిగ్ బాస్ షో ప్రారంభం నుండి ఎవరు అవునన్నా కాదన్నా.. తన ఫోకస్ మొత్తం గేమ్. నో రిలేషన్స్.. నో ఎమోషన్స్.. ఓన్లీ ఫర్ విన్. ఇదే కౌశల్ గేమ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో భాగంగానే అతడి నడవడి ప్రవర్తన ఉంటుంది. ఇది హౌస్‌తో పాటు చాలా మంది ప్రేక్షకులకు కౌశల్‌ను దూరం చేసినా.. టైటిల్ రేస్‌లో అందరికంటే ఒక అడుగు ముందు నిలబెట్టాయి. ఎంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయలేదు. మీ మనోధైర్యంతో, సంకల్పంతో ముందుకు కొనసాగారు. మీరు నమ్మిన దాని కోసం ఒంటిరి పోరాటం చేశారు. ఏకాకిగానే ప్రయాణించారు. పట్టుదల కోల్పోలేదు. ఎదుటి వారి బలహీనతల్నే బలంగా మార్చుకుని బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచారు. కౌశల్ తనను గురించి తాను నానితో ఓ కథ చెప్పాడు. ఈ కథలో సారాంశం ఏంటంటే.. బిగ్ బాస్ ఆటలో వేటా నాదే.. ఆటా నాదే.. బిగ్ బాస్ టైటిల్ నాదే అంటూ చెప్పకనే చెప్పాడు కౌశల్. అదే ఇప్పుడు నిజమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here