Home News Politics

సబ్బం భీమిలీకి బలయ్యారా…!

ఎట్టకేలకు విశాఖ జిల్లా మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలీ సీటుని టీడీపీ కేటాయించింది. గత రెండేళ్ళుగా బాబును పొగడ్తలతో ముంచినందుకు గిట్టుబాటు జరిగింది. దీని కోసం ఎన్ని హరి కధలు చెప్పారో, మరెన్ని విధాలుగా లాబీయింగ్ చేయించారో మొత్తానికి సీటు అయితే పట్టేశారు. అయితే కోరుకున్న సీటు ఇవ్వలేదని హరి ఇపుడు దిగాలు చెందుతున్నారట. భీమిలీ అంటేనే వణుకుతున్న టీడీపీ కోరి మరీ ఓడిపోయే సీటుని ఇచ్చిందని హరి సతమతమవుతున్నారట. తాను కోరింది ఒకటి, ఇచ్చింది వేరొకటి అంటూ ఈ మాజీ ఎంపీ గారు ఇపుడు తన హరి కధను తానే వినిపిస్తున్నారుట.

నిజానికి భీమిలీలో ఇపుడున్న పరిస్థితుల్లో ఎవరూ గెలవరు అన్న సర్వే టీడీపీ వద్ద ఉంది. అక్కడ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిన తరువాత ఒక్కసారిగా టీడీపీకి అసలు బలం తెలిసొచ్చింది. దాంతోనే మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం విశాఖ ఉత్తరానికి షిఫ్ట్ ఐపోయారు. నారా లోకేష్ సైతం భీమిలీ సేఫ్ కాదని వెళ్ళిపోయారు. అటువంటి సీట్లో ఇపుదు సబ్బం హరిని పోటీ చేయమంటోంది టీడీపీ హై కమాండ్.దీనిమీద అసంతృప్తి వ్యక్తం చేసిన హరి అమరావతి వెళ్ళి మరీ చంద్రబాబు వద్ద మొర పెట్టుకున్నారు కూడా.

తనకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని చివరి ప్రయత్నం చేశారు. అయితే భీమిలీ నుంచి పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేయడంతో చేసేది లేక హరి వెనక్కు వచ్చేశారు. ఇదిలా ఉండగా మరో వైపు భీమిలీలో ఉన్న టీడీపీ నాయకులు హరిని తెచ్చి తమ నెత్తి మీద పెడితే తాము పనిచేయమని క్లారిటీగా చెప్పేస్తున్నారు. తమలో ఒకరికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని, అలాంటిది బయట నుంచి నాయకులను రుద్దడమేంటని వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారుట. అసలు పార్టీలో ఇంకా చేరని వారికి టికెట్ ఎలా ఇస్తారని లాజిక్ కూడా లాగుతున్నారు.

ఇంకో వైపు భీమిలీలో వైసీపీ దూసుకుపోతోంది. గట్టిగా ఇరవై రోజులు కూడా లేని వేళ అక్కడ పోటీ చేసి ఏం లాభమని హరి తర్జన భర్జన పడుతున్నారట. ఇక అసలు లేని దాని కన్నా కొసరు మేలు అనుకుంటూ మెల్లగా భీమిలీ వైపు అడుగులు వేస్తున్న హరి ఇంతకీ సాధించింది ఏంటి అంటే కిందా మీదా పడి టికెట్ తెచ్చుకోవడం. అదీ కోరుకున్న చోట కానే కాదు. ఇక గెలుపు ముచ్చట అంటారా. అది ఏ టీడీపీ నేతలను అడిగితే చాలు అక్కడ ప్రజల తీర్పు ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తారు. మొత్తానికి రాజకీయ పబ్బం ఎవరికి గడిచిందో హరినే అడగాలేమో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here