టాలీవుడ్ సీనియర్ హీరోలు ఫుల్ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే రెండు మూడు సినిమాలు లైన్లో పెడుతున్నారు. అయితే మిగతా ముగ్గురితో పోల్చితే బాలక్రిష్ణ మాత్రం కొంచెం స్లోగా ఉన్నాడు. మరి బాలయ్య స్పీడ్ తగ్గడానికి కారణమేంటి అన్నదాని పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

చిరంజీవి సిక్స్టీ ప్లస్‌లో కూడా కుర్రాళ్లతో పోటీపడుతూ ఫుల్ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ‘ఆచార్య’ సెట్స్‌లో ఉండగానే మరో మూడు సినిమాలని లైన్లో పెట్టాడు. మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళం హిట్ ‘లూసిఫర్’ రీమేక్ చేస్తున్నాడు. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ సినిమా ‘వేదళం’ రీమేక్ చేస్తున్నాడు చిరు. చిరంజీవి రీమేక్స్‌తో పాటు బాబీ డైరెక్షన్లో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. వీటితోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో కూడా ఒక సినిమా అనౌన్స్ చేశాడు చిరంజీవి.
రొమాంటిక్ మూవీస్ వద్దు, డిఫరెంట్ మూవీస్ ముద్దు అంటోన్న నాగార్జున కూడా మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నాడు నాగ్. ఇక ఈ సినిమాలతో కొడుకులు ఇద్దరితో కలిసి నటించడానికి స్క్రిప్టులు కూడా సిద్ధం చేయిస్తున్నాడు. నాగార్జున జూన్‌లో ‘బంగార్రాజు’ సినిమా స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట నాగ్. ఈ మూవీలో నాగార్జున, అఖిల్ ఇద్దరూ కలిసి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
వెంకటేశ్ నాలుగు సినిమాలతో దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో ఈ ఏడాదే మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. తమిళ హిట్ ‘అసురన్’ని ‘నారప్ప’గా రీమేక్ చేశాడు. ఈ మూవీ మే 14న రిలీజ్ కాబోతోంది. అలాగే జీతు జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం2’ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాని జులైలో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు వెంకీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ చేస్తోన్న ‘ఎఫ్3’ కూడా ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. ‘ఎఫ్2’ సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ అవుతోంది. ఇక వీటితో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది.
సీనియర్ హీరోలంతా మూడు నాలుగు సినిమాలు చేస్తోంటే, బాలక్రిష్ణ మాత్రం రెండు సినిమాల దగ్గరే ఉన్నాడు. బోయపాటి శ్రీనుతో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు బాలయ్య. అలాగే గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అయితే బాలక్రిష్ణ పొలిటీషియన్ కమ్ హీరోగా రెండు బాధ్యతలు నెరవేరుస్తున్నాడని కాబట్టి, సినిమాల్లో కొంచెం స్లో అయ్యాడని చెప్పుకుంటున్నారు సినీజనాలు.