Home News Stories

ఆసక్తిగా మారిన అవనిగడ్డ రాజకీయం…!

కృష్ణాజిల్లా దివిసీమ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏళ్ళ తరబడి ఏలిన కుటుంబాలకు సైతం ఎదురుగాలి వీస్తోంది. చరిత్ర తిరగరాయాలని కొందరు, గెలుపుతో చరిత్ర సృష్టించాలని మరికొందరు అవనిగడ్డ నుంచి పోటీకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. అవనిగడ్డ నుంచి గెలిచిన వారికి మంత్రి పదవి అదనపు బహుమతిగా అధికార పార్టీ ఇస్తూ వస్తోంది. మరి ఇక్కడ నుంచి ఈసారి విజయబావుటా ఎగురవేసే దెవరు, ఆపై మంత్రిగా అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుందనేది దివిసీమలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా దశాబ్ధాల నుంచి ప్రత్యర్థులుగా తలపడుతుంటే కొత్త పార్టీలు బోణీ కొట్టాలనే ప్రయత్నాలు చేస్తూన్నాయి.అవనిగడ్డ రాజకీయం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

ఏపీలో దివిసీమ ప్రత్యేకత వేరు. ఇక్కడ నుంచి ప్రాతినిద్యం వహించిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. ఏళ్ల తరబడి కొన్ని కుటుంబాలు మాత్రమే అవనిగడ్డను ఏలాయి అంటే అతిశయోక్తి కాదు. అక్కడ ప్రజాభిమానం నమ్మితే ఆ విధంగా ఉంటుందనేది అక్కడ వారు గెలిపించిన వారి చరిత్ర చూస్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నపుడు 60లో యార్లగడ్డ శివరామప్రసాద్, 70లో మండలి వెంకటకృష్ణారావులు 20 ఏళ్లపాటు అవనిగడ్డ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 83లో టీడీపీ ప్రభంజనం వచ్చినా మండలి వెంకటకృష్ణారావు ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు అంటే 85,89,94 లలో సింహాద్రి సత్యానారాయణ వరుసగా ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు కుటుంబాలే అవనిగడ్డ రాజకీయాలను శాసించాయనేది వాస్తవం.

మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యానారాయణ ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి విజయం దోబూచులాడటంతోపాటు ప్రతి ఎన్నిక బిగ్ ఫైట్ గా మారుతూ వస్తోంది. అవనిగడ్డను శాసించిన మండలి వెంకటకృష్ణారావు, సింహాద్రి సత్యానారాయణల తరం తర్వాత అక్కడ రెండుసార్లు అంటే 99,2004 ఎన్నికల్లో కృష్ణారావు కుమారుడు మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 2009లో ఆయన ఓటమి పాలైనా 2014లో మాత్రం పార్టీ మారి టీడీపీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ గెలిచారు. బుద్ధప్రసాద్ కు కూడా డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. మరోవైపు అవనిగడ్డ నుంచి గెలచి మళ్ళీ బోణీ కొట్టాలనే ప్రయత్నాల్లో ఉంది సింహాద్రి కుటుంబం. సింహాద్రి రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగా ఓటమి పాలయ్యారు. ఆయన ఇప్పుడు మూడో పర్యాయం వైసీపీ నుంచి బరిలోకి దిగి గెలుపుకోసం తన దండ యాత్రను కొనసాగిస్తున్నారు.

ఇక ప్రజారాజ్యం బోణీ చేయలేని ఈ సీటుని తాము ఈసారి ఎట్టిపరిస్థితుల్లో గెలవాలనే తలంపుతో జనసేన ఉంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే అవనిగడ్డలో పోటీ చేసే అభ్యర్థులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారే. దీనితో ఒక కమ్యూనిటీ ఓటును అందరూ నమ్ముకోవాల్సి పరిస్థితి. అవనిగడ్డలో కీలక ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు, బీసీలే విజయాన్ని నిర్ణయిస్తారు. కాంగ్రెస్ కుటుంబమైన మండలి బుద్ధప్రసాద్ 2014లో మాత్రం గత్యంతరం లేక టీడీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే ఐదేళ్ళు గడుస్తున్నా ఆయన టీడీపీ శ్రేణులతో మమేకం కాలేదనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ శ్రేణులకు కూడా పూర్తి స్థాయిలో ఆయన అందుబాటులో లేకపోవటం, వారితో సమన్వయం లోపం కారణంగా పలు మండలాల్లో ఆయనపై వ్యతిరేకత టీడీపీ వర్గాల్లో లోలోపల ఉంది. ఇది ఎన్నికల సమయానికి ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి. మరోవైపు టీడీపీ నుంచి బుధ్ధప్రసాద్ తప్ప ప్రత్యామ్నాయంలేని టీడీపీ మళ్ళీ ఆయన్నే బరిలోకి దింపే ఆలోచనలో ఉంది.

ఇక దండయాత్రలు చేస్తున్న సింహాద్రి రమేష్ కూడా గెలుపు కోసం శ్రమించక తప్పని పరిస్థితి. గత ఎన్నికల్లో కేవలం 5 వేల ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి జనసేన కూడా బరిలోకి దిగటంతో 50 వేల ఓట్లున్న కాపు సామాజిక వర్గం ఎటు ఓటేస్తారనే దాన్ని బట్టి సింహాద్రి విజయం ఆధారపడి ఉంటుంది. వైసీపీ టికెట్ ఆశించి ఇక్కడ నుంచి పేర్ల శ్రీనివాసరావు నియోజక వర్గంలో సేవా కార్యక్రమాలను విసృతంగా చేపట్టారు. ఆయన చివరి క్షణం వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తానని, అప్పటికీ రాకపోతే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీకి దిగాలని భావిస్తున్నారు. పేర్ల శ్రీనివాసరావు పోటీ చేస్తే ఆ ప్రభావం కూడా వైసీపీ విజయావకాశాలపై ప్రభావం చూపటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ప్రజారాజ్యం గెలవలేకపోయిన ఈ సీటును గెలవాలనే ఆలోచనలో జనసేన ఉంది. ఇక్కడ నుంచి పవన్ సన్నిహితుడు, జనసేన నేత ముత్తంశెట్టి కృష్ణారావు బరిలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయి. గత ఎన్నికల్లోనే టీడీపీ తరపున ముత్తంశెట్టి ఇక్కడ నుంచి పోటీకి దిగటానికి మొత్తం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ చివరి క్షణాల్లో అధిష్టానం బుద్ధప్రసాద్ ను బరిలోకి దింపింది. దీనితో ఈసారి జనసేన నుంచి పోటీకి దిగి ఎమ్మెల్యే అవ్వాల్సిందేనని ఆయన నియోజక వర్గం అంతా పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో జనసేన పేరుతో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్న ఆయన ఖచ్చితంగా ఈ సీటు జనసేనదే అని ముందుకెళ్తున్నారు.

గతంలో వార్ వన్ సైడ్ గా ఉండి కేవలం టీడీపీ, కాంగ్రెస్ మధ్య పోరు నడిచిన అవనిగడ్డలో ఇప్పుడు కొత్త సమీకరణాలు వచ్చి చేరాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఆరుసార్లు కాంగ్రెస్, ఆరుసార్లు టీడీపీ గెలిచిన అవనిగడ్డలో కొత్త పార్టీలు బోణీ కొడతాయా చరిత్ర పునరావృతమవుతుందా వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here