సెంట్రల్ ఏసీలో, పట్టుపరుపుల మీద చుట్టూ పరిచారికలు, వందిమాగధులతో బిందాస్‌గా బతికిన స్వయం ప్రకటిత భగవత్ స్వరూపుడికి పాపం ఎంత కష్టం..ఎంతకష్టం. అంతా బాగున్నప్పుడు మంత్రులు, బడాబడా నేతలు, ఉన్నతాధికారులు ఆయన కరుణకటాక్షాలకోసం సాష్టాంగపడేవారు. ఇప్పుడిక ఎవరికీ ఆ దర్శనభాగ్యంలేదు. కేవలం ఆ జైలు పక్షులకు తప్ప. వందల ఆశ్రమాలు, లక్షలమంది భక్తులు ఏవీ ఆయన్ని కాపాడలేకపోయాయి. ప్రస్తుతం ఆయన వయసు 77 ఏళ్లు. జైల్లోంచి బయటికొచ్చేది ఆయన తుదిశ్వాస విడిచాకే. బాబాల ముసుగులో ఏంచేసినా చెల్లుతుందనేవారికి ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ జీవితం.
ఐదేళ్లక్రితం చేసిన పాపానికి చచ్చేదాకా జైల్లోనే గడపాలని తీర్పు ఇచ్చింది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ న్యాయస్థానం. తమ ఆశ్రమం కింద నడుస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్న 16 ఏళ్ల మైనర్బాలికను చిదిమేసినందుకు ఆశారాం బాపూ మిగిలిన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందే. 10వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం, మహామహుల సాంగత్యం ఏవీ ఆయన్ని కాపాడలేకపోయాయి. 2013లో నిస్సహాయ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు యావజ్జీవ ఖైదు విధించింది న్యాయస్థానం. జైలుగోడలమధ్యే తుదిశ్వాస విడిచే అవకాశాన్ని ప్రసాదించింది. వయోభారంతో శిక్ష తగ్గిస్తారని ఆశారాంబాపూ ఆశపడ్డా అతను చేసిన పాపం క్షమార్హం కాదని చెప్పేసింది కోర్టు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున అర్ధరాత్రి మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా ఆశ్రమ్‌లో చదువుకుంటున్న 16 ఏళ్ల దళిత బాలికపై జరిగిందీ దారుణం. జోధ్‌పూర్ సమీపంలోని మనాయ్ దగ్గరికి ఆ బాలికను పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆశారాంబాపూకు మరో ఇద్దరు అనుచరులు సహకరించారు. నాలుగురోజుల తర్వాత కేసు నమోదు కావటంతో 2013 నవంబరు నుంచీ ఆశారాం అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లోనే ఉన్నాడు. బెయిల్ కోసం 12 సార్లు ప్రయత్నించాడు. కానీ చట్టం చేతులు ఎంత పెద్దవో ఆయనకు శిక్షతో తెలిసొచ్చింది.
సూరత్‌లో మరో మహిళపై అత్యాచారం కేసులోనూ ఆశారామ్ ప్రధాన నిందితుడు. ఆ మహిళపై ఆశారాంతో పాటు ఆయన పుత్రరత్నం నారాయణ్‌సాయి కూడా అఘాయిత్యంలో పాలుపంచుకున్నాడనే ఆరోపణలపై కేసు నడుస్తోంది. యూపీ ఎన్నికల్లోనూ పోటీచేసిన ఆశారాం బాపూ కొడుకు మరో రెండు రేప్ కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. చెప్పేవి శ్రీరంగనీతులు…దూరేవి ఇంకేవో గుడిసెలన్నట్లు అయ్య గడ్డిమేస్తే కొడుకు అన్నమెందుకు తింటాడు? దొందుదొందే. ఇలాంటి విలువల్లేని బాబాల ముందు బొక్కబోర్లాపడే పెద్దల్నేమనాలి?