Home News

    హెచ్ సీఏ లో మళ్లీ మొదలైన రాజకీయ రగడ

    హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదం మరింత ముదిరింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై వేటు పడింది. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసినట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. దీంతో మళ్లీ వివాదం రాజుకుంది. అపెక్స్‌ కౌన్సిల్..అధ్యక్షుడు అజారుద్దీన్‌కు నోటీసులివ్వడంతో వ్యవహారం మరింత ముదిరింది. హెచ్‌సీఏ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్‌ మండిపడ్డారు.

    ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాడని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ అధ్యక్షుడు అజారుద్దీన్ ను పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. అలాగే ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై..గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని విమర్శలు చేశారు. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయన్నారు. అజార్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

    హెచ్‌సీఏలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదన్నారు మహ్మద్‌ అజారుద్దీన్‌. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొంతమంది వ్యక్తులు తమపై అనవసరంగా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఆటగాళ్ల ఎంపిక విషయంలో అసోసియేషన్ ప్రమేయం లేదని అజారుద్దీన్ వెల్లడించారు. ఈ వివాదం బీసీసీఐ వరకు చేరింది. కానీ హెచ్‌సీఏ వివాదంపై బీసీసీఐ పెద్దగా స్పందించడం లేదు. అజారుద్దీన్ విషయంలో అపెక్స్‌ కౌన్సిల్‌ విభేదించినా ఇటీవల జరిగిన ఎస్‌జీఎంలో హెచ్‌సీఏ ప్రతినిధిగా అజారుద్దీన్ హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here