బీజేపీతో తెగదెంపుల తర్వాత చంద్రబాబు మాటల్లో ఆవేశం కంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్రంపై ఆయన ఆరోపణల తీవ్రత కంటే తననేమన్నా చేస్తారేమోనన్న భయమే ఎక్కువగా ధ్వనిస్తోంది. నిప్పులా బతికాననీ, నిజాయితీకిని నిలువుటద్దంలా నిలిచాననీ మాటకుముందు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఏమైంది? ఓటుకు నోటు కేసుని దుమ్ము దులిపి బయటికి తీస్తారని భయపడుతున్నారా? లేదంటే బీజేపీనో, వైసీపీనో విమర్శిస్తున్నట్లు రాజధాని మాటునో, పోలవరం చాటునో జరిగిన అక్రమాలపై ఎంక్వయిరీలేస్తే ఇబ్బందులు తప్పవనే కలవరమా?. మనం నిప్పయినప్పుడు పట్టుకునేవాడి చెయ్యే కాలుతుంది. అలాంటప్పుడు ఎందుకింత ఆందోళన(అలాగే కనిపిస్తున్నారు మరి) పడుతున్నట్లు?
కర్ణాటక ఎన్నికలతర్వాత మనల్ని టార్గెట్ చేస్తారని పదేపదే చెబుతున్నారు చంద్రబాబు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా తనపై ఎన్ని కేసులేసినా కడిగిన ముత్యంలా(ఆయన చెప్పుకున్నదే) బయటపడ్డారు చంద్రబాబు. ఈ నాలుగేళ్లలో టైం బాలేక తెలంగాణ రాజకీయాల్లో నోరేయబోయి కాల్ రికార్డింగ్‌లో దొరికిపోయారుగానీ…ప్రత్యక్షంగా మరే విషయంలోనూ ఆయన జుట్టు ఎవరి చేతికీ చిక్కలేదు. ప్రభుత్వంలో పాలనాయంత్రాంగాన్ని నడిపించిన ఇద్దరు మాజీ ప్రధాన కార్యదర్శులు తీవ్రస్థాయి ఆరోపణలుచేసినా చెప్పుకోదగ్గ ఆధారాల్లేవు. ఆయన ఫారిన్ టూర్లపై, లోటు బడ్జెట్ ఉన్నా అదుపులేని ఖర్చులపై, ఈవెంట్(విపక్షాలు అంటున్నాయి)ని మరిపించిన ధర్మపోరాటదీక్షపై విమర్శలొచ్చాయోగానీ ఆ విషయంలో కొంపలేం అంటుకోవు.
ఎప్పుడైతే ఎన్డీఏనుంచి బయటికొచ్చారో, బీజేపీనుంచి తెగదెంపులు చేసుకున్నారో కేంద్రం కుట్ర చేస్తోందన్న మాట మొదలైంది. కర్ణాటక ఎన్నికల తర్వాత టార్గెట్ అవుతానని అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతల్ని అప్రమత్తం చేయడం వేరు. పబ్లిక్ మీటింగ్లలోనే చెబుతున్నారీ మాట. మోడీకి మమతాబెనర్జీ కంట్లో నలుసే. అరవింద్ కేజ్రీవాల్ పక్కలోబల్లెమే. కేరళ సీఎంపైనా పీకల్లోతు కోపం ఉంది. వారినేం చేయలేంది..ప్రత్యేకించి చంద్రబాబుని ఏం చేస్తారు? తననేం చేస్తారని ఆయన అనుకుంటున్నారన్నదే చాలామందికి అర్ధంకాని ప్రశ్న. ఓటుకునోటు కేసు బయటికి తీస్తారని భయమా? అది తన గొంతే కాదని చెప్పేశారుగా..ఇక దేనికి భయం?
సోమువీర్రాజు అలిపిరి సంఘటనని గుర్తుచేయడంతో టీడీపీకో కీ పాయింట్ దొరికింది. అంటే చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలన్న దురాలోచన ఉన్నట్లేగా అంటూ గుండెలు బాదుకుంటున్నారు. మోడీని ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య ఏజెంట్ విక్రమ్ 007లా పక్కా ఇన్ఫర్మేషన్ అంటూ హోదా అంబాసిడర్ శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం ఖాయమన్న విపక్షనేత మాటలకు భుజాలు తడుముకోవాల్సిన పనేంటి? అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే తన చుట్టూ వలయంలా ఏర్పడి కాపాడుకోవాలని కేడర్‌కి, నేతకు చెప్పాల్సిన అవసరమేంటి? ఆ అవకాశమేలేదని కొట్టిపారేయాలి. అలాంటి ప్రచారాన్ని చూసి నవ్వుకోవాలేగానీ ఎందుకింత కలవరం? దాల్ మే కుఛ్ కాలా హై..నా?