Home News Politics

ఏపీలో టీడీపీ నేతలకు సన్ స్ట్రోక్స్…!

వాళ్లంతా సీనియర్‌మోస్ట్‌ నేతలే .. తెలుగు రాష్ట్రాల్లో మంచి పలుకుబడి ఉన్న బిగ్ షాట్స్ కూడా .. వారి వారి మాటకు తిరుగులేని విధంగా జిల్లాల్లో రాజకీయం నడిపిన వారు… అయితే ఇప్పుడా పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది.. వారి పలుకుబడి పలుచన అవుతూ .. రాజకీయం చేయడమే కష్టమనే రీతిలోకి మారిపోయిందంట వ్యవహరం… ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆ ప్రముఖ నేతల పరిస్థితేంటో.. ఎవరికి అంతుచిక్కకుండా తయారైంది .. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వాళ్లు.. ఇప్పుడు ఎందుకిలా అయిపోయారు..? దీని వెనుకున్న కథేంటీ చూద్దాం…

ఏపీ అధికార పార్టీలోని సీనియర్లకు ఇప్పుడు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. చెట్టంత కొడుకు అంది వస్తాడు.. అక్కరకు వస్తాడని అనుకుంటే వాళ్లే సదరు నేతలకు తలనొప్పిగా మారుతున్నారంట … రాజకీయంగా తమ జీవిత కాలంలో సాధించుకున్న మంచి పేరును ..ఒక్క దెబ్బకు తీసేసేలా వారు వ్యవహరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూడాల్సి వస్తోందంట సీనియర్ నేతలకి … ఈ క్రమంలో రాజకీయంగా సదురు పుత్ర రత్నాలతో వారు హైరానా పడడమే కాకుండా.. అంతర్గతంగా ఆయా కుటుంబాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాట్లు కన్పిస్తున్నాయి.. దీంతో రాజకీయంగా ఆ కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా..? అనే చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది… రాజకీయం అంటే ఇలా చేయాలనే రీతిలో ప్రజల్లో పేరు తెచ్చుకున్న బడా నేతలు .. ఇప్పుడు పుత్రుల దెబ్బకు కుదేలైపోవాల్సి వస్తోందంట పాపం..

అయ్యన్నపాత్రుడు… విశాఖ జిల్లాలో అయ్యన్నకు ప్రత్యేక స్థానం ఉంది… ఆ జిల్లాలోనే కాదు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అయ్యన్న మాటకు చాలా మంది విలువనిస్తారు… ఇదీ అయ్యన్నపాత్రుడుకు బయట ఉన్న పరపతి… కానీ సొంత ఇంట్లో మాత్రం అయ్యన్నపాత్రుడు తెగ ఇబ్బంది పడిపోతున్నారట… ముఖ్యంగా కొడుకు చింతకాయల విజయ్ పాత్రుడు దెబ్బకు అయ్యన్న కుటుంబంలో విబేధాలు బహిర్గతమవుతున్నాయి … అయితే ఇదేదో ఇంటికే పరిమితం అయితే అంతగా చర్చకు వచ్చేది కాదేమో కానీ.. ఏకంగా పార్టీ హైకమాండ్ దాకా అయ్యన్న ఫ్యామ్లీ వ్యవహారాలు చేరడంతో ప్రస్తుతం అయ్యన్న కుటుంబం వ్యవహరం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది… రామలక్ష్మణుల్లా ఉండే అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడు మధ్య విబేధాలకు కారణం కొడుకు విజయ్ పాత్రుడేననే భావన పార్టీ పెద్దల్లో కూడా స్పష్టంగా కన్పిస్తోంది.

నర్సిపట్నం నియోజకవర్గంలో అయ్యన్నపాత్రుడు పెద్దతనంగా వ్యవహరిస్తూ వచ్చినా.. క్షేత్ర స్థాయి రాజకీయమంతా తమ్ముడు సన్యాసి పాత్రుడే చేసేవారట… ఆ ఎఫెక్ట్‌తో స్థానికంగా సన్యాసిపాత్రుడుకు నర్శిపట్నంలో మంచి పేరే ఉంది… దాంతో అయ్యన్న తర్వాత ఆ స్థానాన్ని సన్యాసి పాత్రుడు ఆశించినట్టు కన్పిస్తోంది… అయితే దానికి విజయ్ పాత్రుడు అడ్డంకిగా మారారట… కుటుంబపరంగా ఈ వ్యవహరాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా.. బాబాయితో పంతాలకు పోవడంతో పట్టణాధ్యక్షుడిగా ఉన్న సన్యాసి పాత్రుడు ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటారు .. .

క్షేత్ర స్థాయిలో బాబాయ్ వెనుకే రాజకీయాలు చేస్తూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట విజయ్ పాత్రుడు… ఇదే కాకుండా.. అయ్యన్నపాత్రుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో సదురు పుత్ర రత్నం చేసిన ఘనకార్యాలతో తండ్రి అయ్యన్నకు వచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదంటున్నారు … నీతి నిజాయితీలకు మారుపేరనే దిశగా పేరు తెచ్చుకున్న అయ్యన్నకు ఒక్కసారిగా ఆ ఎపిసోడ్ చెడ్డ పేరు తెచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన స్థానిక తెలుగుదేశం నేతల్లో కన్పిస్తోంది.

ఉత్తరాంధ్ర సీనియర్ నేత పరిస్థితి ఆ విధంగా ఉంటే.. పల్నాటి పులిగా చెప్పుకుంటున్న కోడెలకూ ఇదే రకమైన ఇబ్బంది ఉన్నట్టే కన్పిస్తోంది… ఒకప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన చరిత్ర కోడెలది… అలాంటి కోడెలకు ఇప్పుడు సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలేటట్లు కనిపిస్తోంది … గతంలో ఎన్నడూ లేని విధంగా కోడెల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం కోడెల పుత్రుడు శివరాం అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది… దాంతో పార్టీ అధినాయకత్వం కూడా నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహరాలపై నిత్యం ఓ కన్నేసినట్టుగానే కన్పిస్తోంది.

స్థానికంగా ఉండే చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ పెద్దాయన పుత్రుడు జోక్యాన్ని సహించలేకపోతున్నారట జనం… అదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో కూడా తన వంతు వ్యవహరం కచ్చితంగా ఉండాల్సిందేనంటూ చెలరేగిపోతున్నారట ఈ శివరాముడు.. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ మాత్రం కన్పించకుండా పోతున్నాయట. తాజాగా సత్తెనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమాన్ని.. శివరాం వ్యవహారాన్ని పోలుస్తూ స్థానిక నేతలు సెటైర్లు వేసుకుంటున్నారట… సత్తెనపల్లిలో భారీ ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం నిర్మించినా.. అంతకంటే ఎక్కువ ఎత్తులోనే డాక్టరు గారికి పుత్రుడు చెడ్డ పేరు తెచ్చారంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు స్థానిక నేతలు.

ఇక రాయలసీమలో మరో బిగ్ షాట్ కూడా ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారట… చిత్తూరు జిల్లా రాజకీయాలను ఓ ఊపు ఊపేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. అడిగిన వారికి కాదనకుండా చేస్తారని.. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు వస్తే.. ఎంత కష్టమైనా సరే పని చేసి పెడతారని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు… కానీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి పేరును ఆయన పుత్రుడు సుధీర్‌కుమార్‌రెడ్డి ఏ స్థాయిలో బదనాం చేయాలో.. ఆ స్థాయిలో చేసి చూపిస్తున్నారన్న ప్రచారం ఉంది… ఇక్కడ బొజ్జల భార్య బృందమ్మ విషయంలోనూ ఆయన చాల ఇబ్బంది పడ్డారు.

ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లల్లో మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్న సందర్భంలో .. బదిలీల విషయంలో అవసరానికి మించిన జోక్యం చేసుకుంటూ బొజ్జల పుత్రుడు సుధీర్ రెడ్డి … తండ్రికి చెడ్డపేరు తెచ్చారనే విషయం ఇప్పటికీ సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రస్తావిస్తూనే ఉంటారు అక్కడి ప్రజలు… అలాగే స్థానికంగా ఇసుక ర్యాంపుల విషయంలో కూడా సుధీర్ రెడ్డి జోక్యం ఎక్కువగా ఉంటుందనే అంశం పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందంట.. అయితే ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన వారసుడిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది … ఏదేమైనా ప్రస్తుతం శ్రీకాళహస్తి టిక్కెట్ బొజ్జల కుటుంబానికి ఇవ్వాలా..? వేరే వారికి ఇవ్వాలా..? అనే ఆలోచనలో హైకమాండ్ ఉందంటే బొజ్జల ఫ్యామ్లీ ఇమేజ్ ఏ స్థాయిలో మసకబారిందో అర్థమవుతుందని అంటున్నారు.

ఇక కర్నూలులోనూ ఇదే పరిస్థితి సీనియర్ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు కూడా ఇక్కడ కొరకరానికొయ్యలా మారాడు. పత్తికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్న కేఈ కుమారుడు ప్రత్యర్ధి పార్టీ నేత చెరుకులపాటి నారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. రెవిన్యూ మంత్రిగా ఉన్న తండ్రి కేఈ పేషీలోను ఈయన ఘనకార్యాలు చాలానే ఉన్నాయట. ఇప్పుడు పార్టీలో కోట్ల చేరికతో వీరి వ్యవహారం ఎలా ఉంటుందనేది చూడాలి.

వీళ్లే కాకుండా.. ఇంకొందరు నేతల పుత్రులు కూడా ఇదే బాట పట్టినప్పటికీ.. పరిస్థితిని, ప్రమాదాన్ని అంచనా వేసి వారిని కట్టడి చేశారట… ఈ విధంగా ఒకప్పుడు యోధానుయోధులుగా ఉన్న నేతలు ఇప్పుడు తమ పుత్రరత్నాల ధాటికి బలి పశువులుగా మారిపోతున్నారనేది పార్టీ అగ్ర నేతల్లో ఉన్న చర్చ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here