Home News Stories

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆ ఎమ్మెల్యేల రాజీనామాలు…!

ఇప్పుడు ఏపీ స్పీకర్ కోడెల తీసుకున్న చర్య చర్చకు దారి తీస్తోంది… ఆ పెద్దాయన నిర్ణయంతో ప్రత్యర్ధులు ఇప్పుడు చరిత్రను తవ్వి తీస్తున్నారు… అప్పుడలా..? ఇప్పుడిలా..? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు… చేయాల్సిన పని చేసినా.. కోడెల ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు..? ఇంతకీ స్పీకర్ కోడెల తీసుకున్న నిర్ణయం రైటా..? రాంగా..? అసలు ఆయన నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటీ..?

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి… అయితే స్పీకరు తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకూడదని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎప్పుడో నిర్ణయించుకుంది… ఆ నిర్ణయాన్ని ఇప్పటి వరకూ అమల్లో పెడుతూనే ఉంది… జగన్ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అశెంబ్లీ సమావేశాలకు ఒక్క దానికి కూడా ప్రధాన ప్రతిపక్షం హాజరు కాలేదు… పార్టీ మారిన వారిపై డిస్‌ క్వాలిఫై పిటిషన్లు పెండింగులో ఉన్నా.. వాటిని పరిష్కరించని స్పీకర్ వైఖరితోపాటు.. ప్రతిపక్షం తరపున గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయడాన్ని తప్పుపడుతూ సభకు రావడం లేదు వైసీపీ. .. దీనిపై ఎన్నిరకాల విమర్శలు వచ్చినా.. వైసీపీ మాత్రం తన పంథాను మార్చుకోలేదు… ఈ క్రమంలో స్పీకర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది… తమకు అవసరమైన నిర్ణయాలను త్వరగా తీసేసుకుంటూ.. ప్రతిపక్షం పెట్టిన పిటిషన్ల విషయంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారని మళ్లీ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడుతోంది…

అధికార పార్టీ నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు,రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి.. బీజేపీ నుంచి రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాణ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు… రాజీనామా చేసిన వారిద్దరూ జనసేన పార్టీలో చేరారు…మరోకరు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారి రాజీనామాలను స్పీకర్ కోడెల ఇట్టే ఆమోదించేశారు. వారు రాజీనామా చేసిన మరుక్షణం ఆమోదించిన స్పీకర్ .. తమ పిటిషన్లను ఎందుకు డిస్పోజ్ చేయడం లేదనే వాదనను వినిపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ…

23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే వారిపై డిస్‌ క్వాలిఫై పిటిషన్లు వేశామని.. అయినా ఏదో సాకు చూపుతూ వాటిని పరిష్కరించడం లేదని అంటున్నారు వైసీపీ నేతలు … రాజీనామాల ఆమోదం విషయంలో చూపిన శ్రద్ధ తమ పిటిషన్లను డిస్పోజ్ చేసే విషయంలో కూడా చూపితే బాగుంటుందంటున్నాయి ప్రతిపక్షాలు… ఇదే సమయంలో తనదైన వాదనను తెరపైకి తెస్తోంది టీడీపీ … స్పీకర్ వద్ద ఉన్న అనర్హత పిటిషన్లను ఆరు నెలల్లోగా డిస్పోజ్ చేసేయాలన్న విషయానికి సంబంధించిన వ్యవహరం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని లాజిక్కు లాగుతోంది … సహజంగా స్పీకర్ పరిధిలో ఉన్న అధికారాలను ఎవ్వరూ ప్రశ్నించడం కుదరదని.. స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయాలు ఉంటాయనే విషయం అందరికి తెలుసనే విషయాన్ని ప్రస్తావిస్తోంది అధికారపక్షం .. మరోవైపు అనర్హత పిటిషన్ల అంశం ఇప్పటికీ కోర్టు పరిధిలోనే ఉందని.. ఈ క్రమంలో స్పీకర్ కూడా వాటిపై ఎలా నిర్ణయం తీసుకోగలరంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది.

ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది… మార్చిలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనవసర చర్చకు.. లేనిపోని రచ్చకు ఆస్కారం లేకుండా స్పీకర్ వ్యవహరించారనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు… ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి మార్చిలో ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం టీడీపీకి నాలుగు .. వైసీపీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కడం ఖాయం… అయితే ఈ మధ్య కాలంలో టీడీపీ నుంచి రావెల కిషోర్ బాబు.. బీజేపీ నుంచి ఆకుల సత్యనారాయణ తమ పదవులకు రిజైన్ చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించకుండా.. అలాగే పెండింగులో ఉంచినట్టైతే.. మార్చిలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరిద్దరి ఓట్ల గురించి మళ్లీ అనవసరమైన చర్చ జరిగేది. వీరిద్దరి ఓట్లతో పరిస్థితి ఏం మారకున్నా.. గెలుపొటములు నిర్ధారించే పరిస్థితి లేకున్నా.. కొంత గందరగోళానికి దారి తీసే ఆస్కారం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది … దాని ప్రకారం చూస్తే.. స్పీకర్ వీరి రాజీనామాలను పెండింగులో పెట్టకుండా త్వరగా డిస్పోజ్ చేయడం కరెక్టేనంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. లేకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు.. థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్లు అంటూ లేనిపోని పంచాయతీలు తెరపైకి వచ్చేవని … ఇప్పుడా సమస్యే లేకుండా పోయిందని అంటున్నారు.

మొత్తంగా వాళ్ళ ముగ్గురు రాజీనామాలు చేసినప్పుడైనా.. ఇంతటి చర్చ జరిగిందో లేదో కానీ.. వీరి రాజీనామాలను ఆమోదించడంతో మాత్రం అసెంబ్లీ లాబీల్లో స్పీకర్‌ నిర్ణయంపై తెగ చర్చలు జరుగుతున్నాయిప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here