Home News Updates

సంగం డెయిరీలో ‘పాలతో కోట్లు పోగు చేసిందెవరు’

ఒక పక్క కరోనా పీక్‌ స్టేజ్‌లో ఉన్నా.. ఏపీలో రాజకీయం సెగలు రేపుతోంది. పాలు, పాల ఫ్యాక్టరీల చుట్టూ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆ సంస్థ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర జైలుకెళ్లారు. అక్కడ నుంచి సంగం డెయిరీ విషయంలో శరవేగంగా పావులు కదుపుతోంది ప్రభుత్వం. సంగం డెయిరీ ఛైర్మన్ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నాయి.

గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న సంగం డెయిరీని తిరిగి ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ యాజమాన్యం కిందకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 1978 జులైలో జారీ చేసిన జీవో 515ను ఉపసంహరించడంతోపాటు..డెయిరీ రోజువారీ బాధ్యతలను తెనాలి సబ్‌ కలెక్టర్‌కు అప్పగించింది జగన్ సర్కార్‌.

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ కేసు పెట్టింది. ప్రభుత్వానికి చెందిన డెయిరీ భూములను బ్యాంకులో తాకట్టుపెట్టి కోట్ల రూపాయల నిధులను ఛైర్మన్‌ నరేంద్ర దారిమళ్లించినట్టు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఏసీబీ వెల్లడించింది. అందుకే సంగం డెయిరీ నిర్వహణలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సర్కార్‌ తాజా జీవోలో వివరించింది. సంస్థ భూములన్నీ ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చెందుతాయన్నది ప్రభుత్వం వాదన.

ఈ చర్యలపై టీడీపీ మండిపడుతోంది. డెయిరీని నిర్వీర్యం చేసేందుకే ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. సహకార సంఘం నుంచి కంపెనీ యాక్టుగా మార్చినప్పుడే అన్ని రకాల ప్రక్రియలు పూర్తయ్యాయని టీడీపీ చెబుతోంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లుబాటు కాదని విమర్శిస్తోంది. టీడీపీ కౌంటర్లు ఎలా ఉన్నా.. సర్కార్ మాత్రం సంగం విషయంలో చకచకా చర్యలు తీసుకుంటోంది. డెయిరీలో ఉద్యోగుల పని, పాల సేకరణ, ప్రాసెసింగ్‌, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌ పర్యవేక్షణ బాధ్యతలను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకునే అధికారాలను కూడా సబ్‌ కలెక్టర్‌కు కట్టబెట్టింది ప్రభుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here